రూపాయి లేదా?:-- యామిజాల జగదీశ్

 బస్టాప్ లేదు. వేగంగా పోతున్న బస్సు. ఇంతలో కండక్టర్ విజిల్ వేయడంతో డ్రైవర్ బ్రేక్ వేసి బస్సు ఆపాడు.
కండక్టర్ ఓ ముసలామెతో గొడవపడు తున్నాడు. "సరైన చిల్లర పెట్టుకోకుండా బస్సెక్కి మా ప్రాణాలు తీస్తారో అర్థం కాదు. ఎంత మందికని ఎన్నిసార్లు చెప్పి చావాలి. జాలి పడి మీలాంటి వాళ్ళ దగ్గర ఒక్కో  రూపాయంటూ తగ్గింంచుకుంటూ పోతే చివరకు నేను నా చేతిలోంచి డబ్బు కట్టాల్సి వస్తుంది గానీ ముందు దిగమ్మా దిగు" అంటూ ఏవేవో మాటలని ఆ పెద్దామెను బస్సులోంచి దింపేశాడు కండక్టర్.
మరో రెండు ట్రిప్పులతో ఆ రోజు డ్యూటీ కానిచ్చుకుని ఇంటికి చేరాడు కండక్టర్ రామనాథం.
ఇంటి ఆవరణలోకి వస్తుంటే చిమ్మచీకటి. అటూ ఇటూ ఇళ్ళల్లో కరెంటు ఉంది. రామనాథం ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. కరెంటు బిల్లు కట్టమని డబ్బులిచ్చి వెళ్ళానుగా? మరచిపోయిందా కట్టడం? రాధికా!" అంటూ పిలిచాడు. 
రాధిక లోపలి నుంచి వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకుని వాకిట్లోకి వచ్చీరావడంతోనే మాటలందుకుంది.
"మీరు ఇచ్చి వెళ్ళిన డబ్బులో రూపాయి తక్కువైంది. రూపాయే కదా....సర్దుకోమని అంటే కరెంటు ఆఫీసులో మనిషి ఎన్నెన్ని మాటలన్నాడో తెలుసాండీ. ఇది మీ బాబుగాడి ఆఫీసా....ఎందుకొస్తారిలా డబ్బులు  సరిగ్గా తీసుకురాకుండా ....రూపాయి నా జేబులోంచి కట్టాలా....వచ్చే నెల ఇస్తారా....నా పైవాడికి నేనేం చెప్పను...అవన్నీ జరగని పని...వెళ్ళి తెస్తే తెండి...లేకపోతే పొండి...." అంటూ ఏవేవో మాటలని మనిషిని పంపించి కరెంట్ కట్ చేయించాడండి" అంది రాధిక.
అప్పుడతనికి బస్సులో ఓ ముసలామెను రూపాయి తక్కువిచ్చినందుకు నిర్దాక్షిణ్యంగా నానా మాటలని బస్సాపి కిందకు దింపిన విషయం కళ్ళ ముందు కదలాడింది.