ప్రతిఫలాపేక్ష:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535.

   ఒక గాడిద గుర్రం తో  ఇలా అంది. "నీవు నేను చూడడానికి ఒకేలాగున ఉన్నాము .అయినా ఈ నరులకు నీ మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. పైగా నన్ను మూటల బరువు మోయడానికి వాడతారు. నా పైన ఎక్కితే వారు అవమానంగా భావిస్తారు" అని   అంది.
       అప్పుడు గుర్రం బదులిస్తూ"ఓ గాడిదా! నేను కూడా మానవులకు స్వారీలో ఉపయోగపడుతున్నాను.వారిని గమ్యం చేర్చడమే నా విధి .వారు నన్ను కొట్టినా, తిట్టినా నేను ఏమి అనుకోను. వారి బరువును కూడా నేను మోస్తున్నాను. పైగా పరిగెడుతున్నా ను" అని అంది.
        " అవును !నీవు వారి బరువు మోస్తే, నేను వారి పెద్ద పెద్ద మూటలను  మోస్తున్నాను. ఇది కూడా పెద్దబరువే  కదా !నన్ను ,నిన్ను ఒక్కసారైనా వారు తలచుకుంటే నాకు, నీకు ఎంతో సంతోషం అనిపించదూ" అని  అంది గాడిద.
           అప్పుడు గుర్రం "చూడు! వారు మనము తలచినా, తలవకపోయినా మన పని మనం చేయాలి. ఆ సేవ లోనే  ఎంతో  ఆనందం ఉంది. వారు ఒకవేళ నిన్ను తలుస్తే నీకు బరువు ఏమైనా తగ్గుతుందా! ఎప్పుడైనా మనం ఇతరులకు సహాయపడాలి. అంతేతప్ప వారు మన గురించి చెడుగా అనుకుంటున్నారని అనుకోకూడదు. మనం ప్రతిఫలాపేక్ష కోరుకోకుండా  ఉంటేనే మన మనస్సు ఎంతో   ఆనందంగా ఉంటుంది "అని అంది.
      ఆ మాటలకు గాడిద తలవంచుకొని" ఇకముందు నీవు అన్నట్లుగానే వారి నుండి ఏమీ కోరకుండానే వారికి మరింత సేవ చేస్తాను" అని అంది తృప్తిగా.
       ఒకసారి   గాడిద కాలు జారి క్రింద పడితే గుర్రమే అత్యవసరంగా ఆ మూటలను మోసి ఆదర్శంగా నిలిచింది.

కామెంట్‌లు