జ్ఞానం చాలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

 ఒక కుగ్రామంలో వెంకయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు.వాడు చదువుకోక పోయినా ఎక్కడ హరికథ,బుర్రకథ,తోలుబొమ్మల ఆటలు జరిగినా వెళ్ళి శ్రద్దగా విని వాటిలోని సూక్ష్మాలు ఆకళింపు చేసుకునేవాడు.
        ఒక హరికథలో చెట్లను గురించి ప్రాశస్త్యం వెంకయ్య విన్నాడు.పచ్చని చెట్లు  మానవాళికి ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకున్నాడు.అప్పటినుండి పచ్చని చెట్లు కొట్టకూడదని నిశ్చయించుకున్నాడు.అడవిలోకి వెళ్ళి ఎండిన చెట్లను మాత్రమే కొట్టేవాడు.
        అలా ఒకరోజు ఎండిన చెట్టు కొడుతుంటే అందులో ఇంకా పచ్చదనం ఉన్నట్టు కనబడింది!ఆ పచ్చదనం చూసి వెంకయ్య బాధతో గొడ్డలి పక్కన పడవేసి ఆ చెట్టు పక్కనే కూర్చున్నాడు.అప్పడే అటువైపు వెళుతున్న వనదేవత  దిగాలుగా కూర్చున్న వెంకయ్యను చూసింది.వాడి దిగులుకు కారణం ఏమిటో తెలుసుకోవాలని వెంకయ్య ముందు ప్రత్యక్షం అయింది.
         ఆ దేవతను చూసి వెంకయ్య ఆశ్చర్యపోయి,"అమ్మా నీవెవరు?"అడిగాడు
       "నేను వనదేవతను,నీవు ఏదో బాధ పడుతున్నట్లున్నావు,ఎందుకు?"అడిగింది దేవత.
      "తల్లీ,పచ్చని చెట్లు అందరికీ మేలు చేస్తాయని విన్నాను.అప్పటినుండి నేను పచ్చని చెట్లు కొట్టడంలేదు.కేవలం చనిపోయిన ఎండిన చెట్లనే కొడుతున్నాను,కానీ అనుకోకుండా ఈ రోజు ఈ పచ్చదనం లోపల ఉన్న చెట్టును కొట్టాను.అందుకే బాధ పడుతున్నాను"చెప్పాడు వెంకయ్య.
          స్వార్థం లేని వెంకయ్య మాటలు విని దేవత ఆశ్చర్యపోయింది.అంతటి మంచివాడు కట్టెలు కొట్టుకుని బతకడం వలన నలుగురికీ  ఉపయోగ పడలేక పోతున్నాడని దేవత తెలుసుకుంది.
          "నీ మంచి మనస్సు నాకు నచ్చింది,నీకు ధనమైనా, జ్ఞానమైనా ఏదో ఒకటి మాత్రమే ఇస్తాను,ఆ ధనంతో నీవు కట్టెలు కొట్టకుండా హాయిగా బతకొచ్చు,జ్ఞానం నీవు తీసుకుంటే, నీవు జ్ఞానం వలన బాగుపడటమే కాకుండా ఇతరులలో జ్ఞానం పెంపొందించి వారు బాగుపడేట్టు చేయగలవు,ఏది కావాలో చెప్పు"అన్నది దేవత.
       "అమ్మా డబ్బు శాశ్వతం కాదు,అదిగాక డబ్బు ఒక్కొక్కసారి మనిషిని స్వార్థపరుణ్ణి  చేస్తుంది.అందుకు నాకు ధనం వద్దు,జ్ఞానం ప్రసాదించు,నేను బాగుపడటమే కాకుండా నా జ్ఞానంతో నా ఊరిని బాగుచేస్తాను"వినయంగా చెప్పాడు వెంకయ్య.
       వెంకయ్య ఆలోచనను దేవత ఎంతో మెచ్చుకుంది.దేవత వెంకయ్య తలను తాకింది.వాడిలో ఆ క్షణం నుండి అనేక జ్ఞాన విషయాలు,విద్య ప్రాప్తించాయి!వెంకయ్య మొహంలో  ఒక విధమైన జ్ఞాన కళ ఉట్టిపడింది!
        వెంకయ్య తన జ్ఞానంతో ఊరిలో ఎందరిలోనో మార్పు తీసుకవచ్చాడు,విద్య నేర్చుకునేట్టు చేశాడు.
      వెంకయ్య మంచితనం గమనించిన వనదేవత  అతనికి ధనం కూడా ప్రాప్తించేటట్లు చేసింది.
       ఆ ధనంతో వెంకయ్య అందరికీ ఉపయోగపడే గ్రంథాలయం,పాఠశాల కట్టించాడు.
       కేవలం డబ్బు కాకుండా,జ్ఞానాన్ని కోరడం వలన వెంకయ్యకు ధనం కూడా ప్రాప్తించింది.తను ఉత్తముడవడమే కాకుండా ఎందరికో వెలుగును చూపించిన వాడయ్యాడు.
            

కామెంట్‌లు