తరతరాల భారతీయ సంప్రదాయం
వ్యవసాయం ఒక మహా యజ్ఞం
మానవ జీవనానికి ఆధారం
ఉరుముల మెరుపుల తొలకరి జల్లుల ఆగమనం
పుడమి పరవశంతో పులకరించే ఆనందోత్సవం
అనాదిగా ప్రతీ పని పవిత్ర కార్యంగా తలచి
శుభ సమయానికై నిరీక్షించే సంప్రదాయం
జ్యేష్ఠ నక్షత్రంతో చంద్రుడు కూడి వుండే శుభ తరుణం
భూమాతని మొక్కి దుక్కి దున్నడం ఆరంభించే క్షణం
మట్టిపై విశ్వాసంతో మాణిక్యాలు పండించే
కృషీవలుని చూసీ ఖుషీ ఖుషీగా విరిసే హరివిల్లు
పల్లె గడపలన్నీ పసుపు కుంకుమలతో
పచ్చని తోరణాలతో కళకళ లాడగ
కాడెడ్లను రంగు రంగులతో అలంకరించి
గణగణ గంటల గజ్జెలతో ముస్తాబు చేసి
బసవన్నలను నందీశ్వరునిగ కొలిచే పర్వం
కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించే పుణ్యదినం
ఏరువాక పున్నమి ఓ పవిత్రోత్సవం
హాలికుని కుటుంబాన అంబరం తాకే సంబరం
బతుకు విత్తనాలు చల్లగ మెతుకుల పంటకై
తమ శ్వాస ధ్యాస సేద్యం పైనే సమస్తం
భూమికి భుక్తికి నడుమ అవినాభావ సంబంధం
ప్రకృతి విపత్తుల నివారించి
ధాన్యపు సిరులు కురిపించాలని నివేదించే దినం
ఆడ పడుచులు పుట్టింటికి చేరగా
కర్షకుల కళ్ళ నిండా కోటి కాంతులు
రైతే రారాజైతే పల్లెలన్నీ సుభిక్షం!దేశ ప్రగతికి సోపానం!
(24 జూన్, రైతన్నలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలతో)


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి