సలీం బాయి అన్ని రకాల కోళ్ళతోపాటు పందెంకోళ్ళను గూడా పెంచి వాటిని అమ్మి డబ్బులు సంపాది౦చేవాడు .రోజు కొళ్ళకు మేత వేసి వాటిని అపురూపంగా చూసుకునేవాడు . పందెం కోళ్ళకు మాత్రం బలమైన ఆహార ధాన్యాలు , పప్పులు పెట్టి ప్రత్యేక శ్రద్ద తో చూసుకునేవాడు .
తన ఇంటి చుట్టూ కోళ్ళకు ఎలాంటి ప్రమాదం రాకుండా గట్టి కంచె నిర్మించి వాటికి భద్రత కల్పించాడు . సలీం బాయి కోడి గుడ్లను పొదగేసాడు . కోడి వాటిని పొదిగి పిల్లలు చేసింది. చిన్న చిన్న కోడి పిల్లలు అరుస్తూ ,తప్పటడుగులు వేస్తూ వాటి అమ్మ కోడి వెంట తిరుగుతూ , అమ్మకోడి కాలితో భూమిని దున్ని గింజలు ,చిన్న పురుగులు అందిస్తే తింటూ తిరుగుతుం డేవి.
ఒకరోజు ఒక పెద్ద గ్రద్ద కోడి పిల్లలని చూసింది . ఆహారం దొరికిందని సంబర పడిపోయి ఆకాశంలో చెక్కర్లు కొడుతూ మెల్లగా వచ్చి సలీం ఇంటి ఆవరణంలోని ఒకపెద్ద చెట్టు పై వాలింది . అదను చూసి కోడి పిల్లల్ని తన్నుకు పోవాలని చూస్తోంది . సమయం చూసి రివ్వునకిందికి దూసుకొచ్చింది . . పౌరుషం , చిన్న శబ్ద మైనా విన గలిగిన శక్తి గల ఒక పందెం కోడి గ్రద్ద రెక్కల చప్పుడు విని వెంటనే ఒక్క ఉదుటున ఎగిరి గ్రద్దను కాళ్లతో తన్నింది . మిగిలిన పందెం కోళ్ళు గూడా గ్రద్ద పై తిరుగు బాటు చేయ బోయాయి .గ్రద్దకి చావు తప్పి కన్ను లొట్ట పోయి ఎంత వేగం గా దూసుక వచ్చిందో అంతకంటే ఎక్కువ వేగంతో ఆకాశంలోకి ఎగిరి చుక్కలా అయిపోయింది . మిగిలిన కోళ్ళు భయంతో అరుస్తూ అటు ఇటు పరిగెత్తాయి . పందెం కోళ్ళ వల్ల కోడి పిల్లలు రక్షింప బడ్డాయి, ఒక గూటి పక్షులు ఒక చోట చేరుతాయి అన్నట్లు ఐకమత్యమే మహాబలం అని చెప్పకనే చెప్పాయి .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి