ఆ ఇద్దరూ ..!!:-శ్యామ్ కుమార్ నిజామాబాద్.


 


పెద్దవాళ్ల పెంపకం ,వారి మార్గదర్శనం ,పరిసరా ల 
ప్రభావం ,పెద్దల జీవనశైలి ,క్రమశిక్షణ ,నడవడిక 
పిల్లల భవిష్యత్తుమీద తప్పక ప్రభావం చూపిస్తుంది .
అందుచేత పెరుగుతున్న పిల్లల మధ్య పెద్దలు 
ప్రతివిషయంలోనూ జగ్రత్త వహించాలి.మాట ,ప్రవ ..
ర్తన విషయంలో జాగ్రత్తగావుండాలి.అలాంటి వాతావరణంలో పెరిగిన జీవితాల భవిశ్యత్తు ఎంతో 
అశాజనకంగా ఉంటుంది .దానికి మంచి ఉదాహరణ 
నా ..జీవితమే ..!!
2 సంవత్సరాల వయస్సు నుండీ నన్ను పెంచిన మా కృష్ణ బాబాయి చాలా ప్రత్యేక మైన వ్యక్తిత్వం కలవారు.  సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు చాలా ఇష్టంఆయనకి .  పాటలు బాగా పాడే వారు. తాను చక్కగా వేసిన చిత్రాలు నాలో  చిత్ర కళ  ఉద్భవించే లా చేశాయి. ఇందులో నా  స్నేహితులైన కర్ణాకర్  సుధాకర్ ఇద్దరు నాకు సమఉజ్జీలుగా నిలబడ్డారు.   దాంతో నాకు పట్టుదల పెరిగి  చిత్రకళను చాలా సాధన చేశాను. 
 మా బాబాయ్ కి తగినట్లు గానే    తన స్నేహితులు అందరూ కూడా ప్రత్యేకమైన  నైపుణ్యాలు కలిగి ఉండేవారు. అందులో ఒకరు  పులిమామిడి బాలకృష్ణ రెడ్డి అనే మా చిన్నాన్న స్నేహితులు. మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారు.   చాలా ఆకర్షణీయంగా అందంగా ఉండేవారు.  సినిమా హీరో  శోభన్ బాబు లాగా ఉండేవారు. ఎప్పుడు  పూర్తిగా తెల్లటి  ధోవతి మీద కనిపించేవారు.  ఆ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పుడు బాలకృష్ణారెడ్డి మామ అందులో చాలా చురుకు గా పాల్గొనేవారు.  'తెలంగాణ ప్రజా సమితి' అని చెన్నారెడ్డి గారు   పెట్టిన తెలంగాణ ఉద్యమం పార్టీ లో తిరుగుతూ ఎన్నో సార్లు జైలుకు కూడా వెళ్లారు.  అంతేకాకుండా నాటికలు, నాటకాలు  ప్రత్యేక కార్యక్రమాలు , సాంస్కృతిక కార్యక్రమాలు వగైరా నిర్వహించేవారు . ఏ కార్యక్రమం ప్రదర్శించినా  కూడా అది ప్రేక్షకులతో నిండిపోయేది. అందులో సౌండ్ అండ్ లైటింగ్  పనులన్నీ మా బాబాయి చూసుకునేవారు.  వారు వేసిన నాటకం " వాన వెలిసింది " .ఇప్పటికీ చాలా  బాగా గుర్తు ఉంది.  అందులో వర్షం పడుతున్నప్పుడు వచ్చే పిడుగులు ఉరుముల   చప్పుడులు  అన్నీ కూడా ఏదో   గ్రామఫోన్    రికార్డు తెచ్చి వేశారు.  అప్పుడు ప్రేక్షకులందరూ నిజంగా వర్షం మొదలౌ తుందేమో  అనుకొని ఆకాశం వైపు చూసేవారు!
                      ***
 మా ఇంటికి తరచుగా యాదగిరి మామ అని మా బాబాయ్ స్నేహితుడు వచ్చేవారు .  ఆయన కూడా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. ఉద్యోగం లేనందువలన అనుకుంటాను ప్రైవేటుగా  తెలుగు మీడియం స్కూల్  నడిపారు.  చదువు సరిగా అబ్బని విద్యార్థులందరినీ అందులో చేర్పించేవారు వారి తల్లిదండ్రులు.  ఆ స్కూల్ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులను చూసి వీళ్ళకు ఎందుకు చదువు రాదు ?వీళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లం? అని చాలాసార్లు అనుకునేవాడిని.  తర్వాతి రోజుల్లో ఆ స్కూలు మంచి పేరు తెచ్చుకొని విద్యార్థులతో   నిండిపోయింది . 
 స్నేహితులు అనే వారు మనకు జీవితంలో ఏ విధంగా సహాయ పడతారు అన్నది  మా బాబాయి స్నేహితులు లో ఒకరైన యాదగిరి మామ  నిరూపించారు.   దీనికి  మా బాబాయి  వివాహ సమయంలో ఒక విచిత్రమైన సంఘటనే  ఆధారం.  మా బాబాయి వివాహం యాదగిరి గుట్ట మీద ఉదయాన్నే మూడున్నర గంటలకు జరిగింది. ఉన్నట్టుండి ఆ సమయానికి కరెంటు పోయింది.  ఇది ఎవరూ ఊహించలేదు,  దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోలేదు.  వివాహ మంటపం లో    పెట్రోమాక్స్ దీపాల సౌకర్యం లేదు .ఆ రోజుల్లో జనరేటర్ లాంటివి ఉండేవి కావు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే సమయానికి బాజాభజంత్రీలు రాలేదు . వివాహం పొద్దున మూడు గంటలకు  మొదలయ్యింది . వారు ముందు రోజు రాత్రి ఎక్కడ పడుకున్నారో ఎవరికీ తెలియదు.  పైగా కరెంట్ రాలేదు. చిమ్మని చీకటి ,అంత రసాభాసగా ఉంది.   పండితుల వారు చిరు దీపాల వెలుగులో మంత్రాలూ వగైరా కార్యక్రమాలు కానిచ్చేశారు.     అసలైన ముహూర్తం సమయానికి పెళ్లి బాజాలు లేనిలోటు అందరికీ తెలుస్తూ ఉంది.   పెళ్లి బాజాలు లేకుంటే ఎలా అని మా చుట్టాలు అందరూ  గొడవ మొదలు పెట్టారు.  కరెంటు పోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోలేదు పైగా బాజాలు లేవు ఇదేం పెళ్లి ? అంటూ అందరూ గొడవ మొదలు పెట్టారు. అందరిలో అసహనం పెరిగిపోయి కోపతాపాల తో  పెద్దగా అరవటం మొదలు పెట్టారు.  ఏం చేయాలో ఎవరికీ పాలుపోని పరిస్థితి.  అప్పుడే ఒక విచిత్రం జరిగింది.  మా యాదగిరి మామ అక్కడే ఉన్న డోలు తీసుకొని,  అందరూ ఆశ్చర్య పోయేలా  బ్రహ్మాండంగా వాయించడం మొదలు పెట్టాడు.   సన్నాయి కూడా   వాయించాడు.   ఆయన తన చిన్నప్పుడు దాన్ని  నేర్చుకున్నాడని తెలిసింది.  ఎందుకంటే అది వారి కుల వృత్తి .  పెళ్లి మండపం లో అందరి మొహాల్లో నవ్వులు వెల్లివిరిశాయి.  అప్పుడు అందరి మనసులు  కుదుటపడి ,పెళ్లి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు.  పెళ్లి విషయాలు   చర్చించుకున్న ప్పుడల్లా ,ఎన్నో రోజులు యాదగిరి మామ గురించి,   ఈ విషయం గురించి చెప్పుకొని నవ్వుకునేవారం. మరి కొద్దిసేపట్లో తూర్పున  సూర్యుడి రాకను తెలుపుతూ ,వెలుగు మొదలై కరెంటు లేని లోటు కనిపించకుండా పోయింది.    సినిమాల్లో ఫైటింగ్ అంతా అయిపోయాక పోలీసులు వచ్చినట్టుగా,అప్పుడు వచ్చింది కరెంటు.!!! , లైట్లు అన్ని వెలిగి మండపం అంతా వెలుగుతో నిండిపోయింది.  మొత్తానికి మా బాబాయి వివాహం ఆ రకంగా, సంతోషంగా జరిగిపోయింది.
                     ***
బాలకృష్ణ రెడ్డి మామ నాటకాలు- డ్రామాలు రాజకీయాలు, మానేసి చాలా లేటుగా ఎల్ ఎల్ బి     లో ఉస్మానియా యూనివర్సిటీ లో చదివారు.  ఇక్కడ ఒక గమ్మత్తయిన విషయం ఏంటంటే  ఒక సమయంలో  తను స్కూల్  నడిపించినప్పుడు అందులో చదివిన విద్యార్థులు ఎల్.ఎల్.బి లో సహ విద్యార్థులు గా ఉన్నారట .  ప్రస్తుతం భువనగిరిలో పెద్ద అడ్వకేట్ గా  పేరు తెచ్చుకొని సెటిల్ అయ్యారు.  పిల్లలు కూడా జీవితంలో బాగా స్థిరపడ్డారు. ఇప్పుడు దాదాపుగా 75 సంవత్సరాల వయసు ఉంటుంది అయినా కూడా చురుకుగా ,ఆరోగ్యంగా ఉన్నారు.
 యాదగిరి మామను ఈమధ్యనే కలిశాను.   85 సంవత్సరాలు  వయస్సు అని చెప్పారు.  వినికిడి శక్తి చాలా తగ్గిపోయింది. నన్ను తదేకంగా  చూసి చాలా సేపటి తర్వాత నన్ను గుర్తు పట్టాడు.  భగవంతుడు వీరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 
 ఒక రకంగా  చెప్పాలంటే మన  బాల్యాన్ని   వీరందరూ  ,ఇంకా ఎందరో బంధుమిత్రులు కలిసి  జీవితంలో మరిచిపోలేని మరపురాని మధురమైన ఘట్టం గా  చేస్తారు.   మనకు తెలియని ,మనం మర్చిపోయిన ఎన్నో సంఘటనలను వీరి ద్వారా మనం వినవచ్చు. నేను వీలైనప్పుడల్లా  వయసు చాలా పైబడిన బంధుమిత్రులను మా పెద్ద వారి స్నేహితులను  కలిసి నా చిన్నప్పటి విషయాలను వింటుంటాను.  వాటిని వింటుంటే మనకు,కలిగే ఆనందం -సంతోషం, మరి  స్వర్గంలో  కూడా దొరకవు.  అలాగే మనకు చదువు చెప్పిన గురువుల ను కలిస్తే ,అప్పుడు మనం, మన వయసు మర్చిపోయి మళ్ళీ   చిన్న పిల్లలుగా మారిపోతాము.    
                       ***
                
ఫోటోలో----బాలకృష్ణారెడ్డి మామనటుడిగా.
కామెంట్‌లు