మరువలేని -మహేశ్వరి ..అక్క ..!!:------శ్యామ్ కుమార్ .నిజామాబాద్ .


 చిన్నతనంలో పిల్లలు తమను ఇష్టపడే వాళ్లను వెంటనే గుర్తుపట్టేస్తారు . తమను ప్రేమించే వారి దగ్గరికి ఇష్టంగా పరిగెడతారు .వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఏదో ఒక తెలియని కారణంతో పిల్లలు కూడా  కొందరిని ఇష్టపడుతుంటారు. ఇది మనందరికీ అనుభవమే! పిల్లలు మన బంధుమిత్రుల లో  కొద్ది మందితో చాలా ప్రేమగా, స్నేహంగా ఉంటారు.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను ఎత్తుకొని  ఆడించిన మహేశ్వరి అక్క అంటే నాకు చాలా ఇష్టం.
 మా ఊరిలో  జడల సత్తయ్య గారి కూతురు మహేశ్వరి అక్క.  నేను వారి ఇంట్లోనే జన్మించాను.   వారి  బంగ్లా,  తోట మధ్యలో ఉండేది.  ఊరు మధ్యలో తోట ,అందులో పెద్ద బంగ్లా, దాదాపుగా బోనగిరి లో ఇంక ఎవరికీ లేదనే చెప్పాలి.    ఆ తోట మధ్యలో పెద్ద దిగుడు బావి ఉండేది. దాని లోపలికి దిగడానికి మెట్లు ఉండేవి ,కానీ  దిగేటప్పుడు పక్కన పట్టుకోడానికి ఏమీ ఉండకపోయేది.
స్కూల్ కు సెలవులు వున్నప్పుడు  ఇంట్లో స్నానం చేయకుండా  నేను నా స్నేహితులు ఆ తోట కి వెళ్లి దిగుడు బావిలో దిగి స్నానాలు చేసే వాళ్ళం. ఆ పెద్ద బావి నుండి వారి తోట కు ,పొలానికి  నీరు పోసేవారు. మోటార్ ద్వారా నీరు పైకి వచ్చి అక్కడ ఉన్న పెద్ద సిమెంట్  హౌసింగ్ లో పడేది.   ఆ    హౌసింగ్ నుంచి పడే నీటిధార కింద కూర్చొని స్నానం చేస్తూ, జలపాతం కింద   స్నానం  చేస్తున్నట్టుగాఆనందాన్ని ,అనుభూతిని పొందే వాళ్ళం.   అక్కడ పని వాళ్ళు ఎవరూ చూడకుండా  మెట్ల గుండా జాగ్రత్తగా ఆ బావిలో  దిగి ఈత కొట్టే వాళ్ళం. 
 ఒకసారి   మేము అందరం దిగి చాలా హాయిగా ఈతలు   కొడుతున్నాం. ఆ  బావిలో  వున్న   చిన్న రంధ్రాల నుంచి ఒక పాము బయటకు వచ్చి మాతోపాటు ఈత కొట్టడం మొదలు పెట్టింది. దాన్ని దూరం నుంచి చూసి మేము పెద్ద గా అరుపులు అరుస్తూ ,ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని  ,మెట్లెక్కి పరిగెత్తాం.  బావి బయటికి వచ్చి బట్టలు వేసుకొని మళ్ళీ  బావి అంచుల దగ్గర కూర్చొని దగ్గర చూడసాగాను.  కింద నీరు స్వచ్ఛంగా ఉండడం మూలాన ఆ పాము ఎటు తిరుగుతుందో మాకు అందరికీ చాలా బాగా  కనపడింది.  ఈత మధ్యలో, ఆట మధ్యలో బయటకు  వచ్చేసినందుకు  చాలా అసంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాను.    తర్వాత మేము ఎన్నోసార్లు వెళ్లి స్నానం చేసాము కానీ ఆ పాము మాకు   ఎప్పుడూ కనిపించలేదు. కానీ మేమందరం ఆ   కలుగు వైపు, వేరే  కలుగుల  వైపు కూడా   చూడటం అలవాటు చేసుకున్నాం. చాలా భయం వేసేది అయినా అందులో స్నానం చేయడం మాత్రం మేం మానుకోలేదు. పెద్ద వాళ్లకు ఈ విషయం చెప్తే కచ్చితంగా మమ్మల్ని ఇంకోసారి  ఆ  బావికి, స్నానాలకు పంపరు. అందుకని మేము ఇంట్లో వాళ్లకు ఈ విషయం  అసలు ఎప్పుడు చెప్పలేదు. ఇటువంటి విషయాల్లో నేను నా స్నేహితులు చాలా సమయస్ఫూర్తితో , లౌక్యం తో వ్యవహరించే  వాళ్ళం సుమ.  అది  నీటి పాము, ఎవరినీ ఏమీ చేయదు,అని మాలో మేము  సర్ది చెప్పుకునే వాళ్ళం. అయినా అందరికీ మనసులో భయమే ఉండేది కానీ ఎవరు బయటికి అనేవారు  కాదు.
 ఇంటికి వెళ్లే ముందు ఆ తోట బంగ్లాలో ఉన్న  మహేశ్వరి అక్క ని కలిసి వెళ్ళే వాడిని. చామన ఛాయ రంగులో, కాటుక కళ్ళ తోటి ఎంతో అందంగా  ఉండేది బహుశా చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని   ఆడించి నందుకు అనుకుంటాను ,ఎందుకు ఏమో తెలియదు  ,కానీ , నాకు అక్క అంటే చాలా ఇష్టం .
అక్క కూడా నన్ను చాలా ప్రేమతో పలకరించేది. కాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళి  పోయేవాడిని.
మహేశ్వరి అక్కకి  ఒక ఇంజనీర్ తో  పెళ్లిసంబంధం కుదిరింది.  బాగా ధనవంతుల కుటుంబం కావటం మూలాన పెళ్లి బ్రహ్మాండంగా చేశారు.  ఆ పెళ్లిలో  గులాబ్ జాములు  ఎన్ని తిన్నాను అంటే,   ఇంక  ఎక్కడా  నా జీవితంలో  మళ్లీ అన్ని   తినలేదు.  మహేశ్వరి అక్క నవలలు బాగా చదివేది,  ఎక్కడ నవలలు కనిపించినా తీసుకెళ్ళి ఇచ్చేవాడిని.  వివాహం తర్వాత భర్తతో కాపురం ఆ బోనగిరి లోనే   కాబట్టి నేను తరచుగా వెళ్లి  కలుస్తుండే వాడిని.  భర్త ఇంజనీర్ అయినా కూడా చాలా సీదా సాదా  వ్యక్తిత్వం గల మనిషి.    కాటుక కళ్ళతో,  గలగలా నవ్వుతూ పలకరించే మా అక్క ని చూస్తుంటే ఇప్పటికీ నాకు  మనసుకి హాయిగా ఉంటుంది. ప్రస్తుతం మనుమలు  , మనుమరాళ్లతో  హాయిగా కాలం గడుపుతోంది.
------------------------------------------------
        ఫోటోలో......:--మహేశ్వరి అక్క ఇప్పుడు.