తల్లి వేరు!:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు

 1.నువ్వు పుట్టావు!
   బొడ్డు కోసారు!
   తల్లినుండి వేరు చేసారు!
 ఆ తల్లివేరు ఎదిగింది!
మాతృత్వమహావృక్షమైంది!
ఆ నీడ బతుక్కి గొడుగైంది!
కన్పించని కన్నపేగు!
నీ చుట్టూ చుట్టుకుంది!
కాసే అదృశ్యకవచమైంది!
2.నీ ఎత్తు ఐదు అడుగులే!
   ఎదిగింది ఎన్ని అడుగులో!
   నీవు,నీ శ్రీమతి,ఒకరికొకరు,                                 
   ఘనబహుమతులే!
  మీ పిల్లలున్న ఉన్నతస్థాయి, జనాలఅసూయపునాదిరాయి,
తలుచుకుంటే తరగని హాయి!
3.నీ తల్లి?
   ఇక్కడా! అక్కడా! ఎక్కడ?
ఆమె ఉన్నది వృద్ధాశ్రమమా!
 సమృద్ధి మహాశ్రయం,అనన్య,
సౌకర్యాలు, సౌలభ్యాలు!
ఆ భవనవైభవం చెప్పలేనంత!
4.ఆకర్షణల అయస్కాంతాల్లో,
   ఆమె అనయస్కాంతమే!
  ఆమె బతుకుతున్నది,తన,
  కుమారరాముడొస్తాడనే!
అతడిని ఒక్కక్షణం చూడాలని,
ఆ క్షణం ఈ శబరి చివరిక్షణం!
5.చూసి చూసి ఆ కళ్ళు,
          చూపు కోల్పోయాయి!
 కలియుగంలో రాముడొస్తాడా!
ఈ వెర్రి శబరికేం తెలుసు?
ఆమె కంటి రెప్పలు,
      నేటినుంచి మూసుకోవు!
6.ఆమె ప్రాణాలెళ్ళిపోయాయి!
  కంటిరెప్పలు తెరిచేఉన్నాయి!
   ఎవరు వస్తారు?
   ఎప్పుడు మూస్తారు?
.
కామెంట్‌లు