తొలి కోడికూత:-ద్వారపురెడ్డి.జయరాం నాయుడు(టీచర్)-కైకలూరు, కృష్ణా జిల్లా


 పూర్వం పార్వతీపురం అడవుల్లో నక్కలు ఎక్కువగా ఉండేవి . వాటికి కోళ్ళంటే మహాఇష్టం.అవి తరచుగా గ్రామాల మీద పడి కోళ్ళను ఎత్తుకుపోయేవి . దీంతో గ్రామంలోని కోళ్ళన్నింటికీ  భయం పట్టుకుంది . నక్కల వల్ల తమ జాతి అంతమైపోతుందని దిగులు పడ్డాయి .

           తమ జాతిని కాపాడుకోవటానికై ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి . ఆ జాతి నాయకుడైన కోడిపుంజు  తమ జాతిని కాపాడుకునే సూచనలు ఇవ్వాలని కోళ్ళను అడిగినది . దానికి ఒక పెద్ద కోడి నక్కలకు మనుషులంటే భయం . మనుషులున్న చోటికి రావు. కనుక మనమంతా మనుషులకు దగ్గరలోనే ఉండాలి. ఆహారానికై దూరంగా అడవుల్లోకి వెళ్ళరాదు అని సలహా ఇచ్చింది . ఈ సలహా మిగిలిన కోళ్ళకు నచ్చింది . అప్పటినుంచి అవన్నీ ఈ సలహాని పాటిస్తూ  మనుషులకు దగ్గరగా ఉండసాగాయి .

         నక్కలకు ఒక కోడి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది . అవి ఆకలితో అలమటించసాగాయి , నక్కలన్నీ సమావేశమై తమ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచించాయి . వాటికి ఒక ఉపాయం తోచింది . రాత్రి సమయంలో మనుష్యులు గాఢ నిద్రలో ఉంటారు . కనుక ఆ సమయములో గ్రామాలకు వెళ్ళి కోళ్ళను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి . ఆ విధంగానే అవి ఊళ్ళ మీద పడి కోళ్ళను పట్టుకుపోతున్నాయి.

          కోళ్ళు మరలా తమకు కొత్తగా వచ్చిన ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాయి . అప్పుడు పెదదైన కోడి పుంజు తమ జాతిలో ఉన్న కోడిపుంజులన్నీ రాత్రి వేళ నక్కలు వచ్చే సమయాన్ని గుర్తించి పెద్దగా “ కొక్కొరోకోయని కూత వేయాలని చెప్పింది . ఆ కూతలకు నిద్రపోతున్న మనుషులంతా లేచి నక్కల్ని తరుముతారని , దానితో నక్కల బెడద పోతుందని చెప్పింది . అప్పటినుంచి ఆ గ్రామంలో కోడిపుంజులన్నీ ఆ సలహాను విధిగా పాటించాయి.

        నాటి నుంచి కోడి జాతికి నక్కల బెడద తప్పింది . అయినా రాత్రి వేళల్లో కూసే అలవాటు కోడిపుంజులకు అలాగే మిగిలింది . నేటికీ రైతులు తొలికోడి కూతలను బట్టి సమయం నిర్ణయం చేసుకుని తమ పనులకు బయలుదేరుతారు . 


కామెంట్‌లు