యోజనాల దూరాభారాలు
సరిపడని వాతావరణం..
ఏదీ సడలించలేని
సంకల్పం.. వలసబాటలో వయ్యారి పులుగులు..
ఆకాశానికే అచ్చెరువై..
ఆనందం దృశ్యమాలికలై..
కోలో కోలో యన్న
పిల్లల కేరింతల మధ్య..
గోళ్ళ మీద పాల చుక్కలు
వెతికి చూసుకున్న బాల్యం..
బహు సుందరం!
నిజంగా కొంగలు
పాలు పోస్తాయా...?
పాలేమో గానీ విశ్వపర్యావరణానికి
గొప్ప మేలు చేస్తాయి!
అననుకూల పరిస్థితుల్లో
బయలుదేరాక, ఎన్నో వేలమైళ్ళు గగనవీధుల్లో..
భీకర సముద్రం ఘోషలూ
తీక్షణ భానుకిరణాలు..
తుఫానులూ, ఆహారలేమి..
అయినా చలించని తపోదీక్ష..
వంశవృద్ధికి బాధ్యత వహించే
లక్ష్యం!
దారితప్పకుండ..
ఏటా వచ్చి,కుదురుకుని..
పులికాట్, కొల్లేరు వంటి చోట్ల
స్ధావరాలతో..
పెద్దగా గుబురులేని కర్రతుమ్మలమధ్య..
పడిపోతుందేమో అనేలా గూళ్ళు!
స్థానికుల దత్తపుత్రికలై,
సందర్శకుల నేత్ర పర్వంగా
పర్యాటక శాఖ ఆదాయవనరుగా..
ఈ రాజహంసలు రమ్యచిత్రాలు !
ప్రకృతి మాత వొడిలో
పురుడోసుకుని పోయే
అచ్చ తెలుగు అమ్మాయిలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి