బోవర్ పక్షి :-- మంగారి రాజేందర్ జింబో

 బోవర్ పక్షి గురించి ఈ మధ్య ఓ మంచి కథని చదివాను. అది చాలా ఉత్సాహభరితంగా అన్పించింది. బోవర్ పక్షి గురించి తెలుసుకోవాలని కూడా అన్పించింది.
ఆడ బోవర్ పక్షులను ఆకర్షించడానికి ఈ పక్షి చాలా విపరీతంగా ప్రయత్నిస్తుంది. ఇంటీరియర్స్ గురించి ఆలోచించే వ్యక్తులు కూడా ఈ పక్షి గురించి తెలుసుకోవాల్సిందే. 
ఇంటీరియర్స్ చాలా ఆకర్షణీయంగా కళాత్మకంగా ఈ పక్షులు తమ గూళ్లలో తయారుచేస్తాయి. గూడును, గూడు పరిసర ప్రాంతాలని, చాలా అందంగా, ఆకర్షణీయంగా తయారుచేస్తుందీ బోవర్ పక్షి. రంగురంగుల షెల్స్‌ని ఆకులని ఇలా ఎన్నో సేకరించి తన గూడును నిర్మించి ఆడ పక్షి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
అది తన గూడును ఎలా నిర్మించుకుంటుందో, డేవిడ్ అటెన్‌బరో ఓ వీడియా చిత్రాన్ని నిర్మించాడు. అది బిబిసి యూ ట్యూబ్‌లో పెట్టింది. కొన్ని వారాలు కష్టపడి ఓ అందమైన గూడుని బోవర్ పక్షి నిర్మిస్తుంది. ఆ గూడును నిర్మించడానికి ఆ మగ బోవర్ పక్షి తీసుకున్న శ్రద్ధ మనలని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంత శ్రద్ధగా నిర్మించుకున్న గూడుని మరో రెండు పక్షులు వచ్చి ధ్వంసం చేస్తాయి.
ఆ బోవర్ పక్షి వచ్చి తన గూడు ధ్వంసం అయ్యిందన్న విషయాన్ని పరిశీలిస్తుంది. జరిగిన నష్టాన్ని గమనిస్తుంది. 
అయితే ఆ గూడుని ధ్వంసం చేసిన పక్షుల కోసం వెదికే ప్రయత్నం చేయదు. అలా ఎందుకు జరిగిందోనన్న విషయాన్ని కూడా ఆలోచించదు.
నిరుత్సాహపడిపోదు.
ఆందోళన చెందదు.
ఎవరికీ ఫిర్యాదు చేయదు.
భగవంతుడిని తిడుతూ కూర్చోదు.
తనకు జరిగిన ఈ అన్యాయం గురించి సాంఘిక మాధ్యమాల్లో ఘోషించి సానుభూతిని ఆశించదు. 
పగ సాధించడానికి ప్రయత్నం చేయదు.
అది తిరిగి తన లక్ష్యం వైపు ప్రయాణం చేస్తుంది.
తిరిగి తన గూడుని నిర్మించడానికి తన ప్రయత్నాన్ని మొదలుపెడ్తుంది.
ఈ దృశ్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనం మనకు కలిగిన అననుకూల పరిస్థితులని తిడుతూ కూర్చోం.
పరిస్థితులని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం.
బోవర్ పక్షి మనకు ఆదర్శం ఎందుకు కాకూడదు..?