బాలగేయం:- సత్యవాణి

 ముత్యాల ముగ్గుల
ముంగిలికి అందం
నేర్వవే పాపాయి 
నేర్పుతోనీవు
చుక్కల్ల ముగ్గులు
చూచుటకు అందం
చుక్కల్ల ముగ్గులో
లెక్కల్లు గలవు
చుక్క చుక్కను గలుప
లెక్క పెట్టాలి
కలుపగా చుక్కల్లు
కలుగు సంతోషం
కలువ పూవుల ముగ్గు
కమలాల ముగ్గు
తామరాకుల ముగ్గు
తాబేళ్ళ ముగ్గు
ఏనుగూ అంబారి
విస్తళ్ళ ముగ్గు
పూలబట్టల ముగ్గు 
పల్లకీల ముగ్గు
రథము ముగ్గుల తోడి
రత్నాలముగ్గు
గీతలతో ముగ్గులు
గమ్మత్తుగుండు
తాబేళ్ళు కుందేళ్ళు
త్రాసుల్ల ముగ్గు
పట్టు చీరల ముగ్గు
పాపల్ల ముగ్గు
నెమళ్ళాఢే ముగ్గు
నిచ్చనల ముగ్గు
అది  ఇది అననేల
ఏదైన ముగ్గూ
పెట్టగా నేర్వండి
పిల్లలూ మీరు 
మెదడుకును మేతది
మెండు జ్ఞానము
కలిగించు ముగ్గులు
కనుక నేర్వండీ