దౌత్య వ్యవహారం....!!:- -------శ్యామ్ కుమార్--నిజామాబాద్.
 సాధారణంగా చదువులో బాగా ఉండే విద్యార్థులు అల్లరి తక్కువగా చేస్తుంటారు,  అల్లరి చేసే విద్యార్థులు చదువులో మామూలుగా ఉంటారు.  చదువు ల్లో  మరి   చిలిపి పనుల్లో కూడా ముందుకు  వచ్చే వారు చాలా తక్కువ. 
 ఆ కోవకు చెందిన వాళ్ళమే  మేము ఐదుగురం స్నేహితులం.
 నేను, వాసు, కృష్ణ  ,రావు, రాజేందర్ , కాలేజీ చదువులో ముందు ఉండేవాళ్ళం.   కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కూడా   మాదే పైచేయి.  ఫోటోగ్రఫీలో వాసుకి చాలా వరకూ బహుమతులు వచ్చేవి.   ఎలక్యూషన్ కాంపిటీషన్ లో ( speeches)  మంచి ఉపన్యాసకుడిగా
 నాకు/ ,రావు కి 'బహుమతులు వచ్చేవి. ఒకరోజు
 మేము ఎదురు చూడని సంఘటన ఎదురైన్ది.
 అది ఎలా జరిగిందంటే ,ఆ రోజు మాకు  క్లాసులోకి ఒక నోటీసు వచ్చింది.దాని సారాంశం ఏమిటంటే,
 దాదాపు రెండు గంటల   తర్వాత  జరిగే పోటీలో   "ఆంధ్రుల చరిత్ర" మీద  ఎవరైనా  పదినిమిషాలు మాట్లాడాలి.  మేము ఐదుగురు మొహాలు చూసుకున్నాం ఎందుకంటే మాకు ఆంధ్రుల చరిత్ర గురించి ఇసుమంత కూడా తెలియదు. 
 మేము    అది విని అందులో ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.  ఇవన్నీ ఎందుకు పనికి రాని ,పని పాట లేని పనులు అనుకున్నాం ,కానీ అంతలోనే  మళ్లీ తెలిసిందేమిటంటే అందులో బహుమతులు కూడా ఉంటాయని. అప్పుడు మా మొహాలు వెలిగిపోయాయి. యేలాగైనా సరే 
వాటిని   మేమే  కొట్టాలని నిశ్చయించుకున్నాం. కానీ   ఎలాగా అన్నది మాకు అర్థం కాలేదు, ఎందుకంటే మేము సైన్స్ స్టూడెంట్స్,  అదేమో హిస్టరీ కి  సంబంధించిన విషయం.  వెంటనే హిస్టరీ లెక్చరర్ గారైన సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాం.  దాని గురించి ప్రత్యేకంగా మన కాలేజీ లో పుస్తకాలు ఏమీ లేవు అని చెప్పారు.   అప్పుడు మాకు   బల్బు వెలిగింది, 
 అలాంటి అన్ని పుస్తకాలు కూడా రీజనల్  లైబ్రరీలో ఉంటాయని.    కాకపోతే అది మా కాలేజ్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.  కాలేజీ మొత్తంలో ఎవరికి కూడా స్కూటర్లు, మోటార్ సైకిల్ కానీ ఉండేవి కావు.  మాకు కూడా సైకిల్స్   మాత్రమే గతి.  ఇవన్నీ చేసేటప్పటికి మాకు అరగంట సమయం గడిచిపోయింది.  ఇంకొక్క గంటన్నర మాత్రమే మిగిలి ఉంది.  అక్కడికి వెళ్లి అది చదివి తొందరగా వచ్చేస్తాము రా    అంటే ఎవరు  కూడా రెడీ కాలేదు.  నా దగ్గర సైకిల్ లేదు .   వాసు దగ్గర ర్యాలీ సైకిల్ ఉండేది.   ర్యాలీ సైకిల్ అంటే ఆ రోజుల్లో చాలా మంచి  మోడల్  .పైగా ధర కూడా చాలా ఎక్కువ.  వాడు వెంటనే మొహం సీరియస్ గా పెట్టేసాడు. అసలు వాడు తన సైకిల్ని ఎవరికీ ఇచ్చేవాడు కాదు,కనీసం  పట్టుకొనిచ్చేవాడు  కాదు .  వాడిని   ఓ పది నిమిషాల    దాకా కాకా పట్టి సైకిల్ తీసుకున్నాను.
 నాకు బోలెడు జాగ్రత్తలు చెప్పి సైకిల్ కి ఏమన్నా జరిగితే నాదే బాధ్యత అని నాతో ఒప్పించి మరీ సైకిల్ ఇచ్చాడు వాసు.  
 కానీ పాపం వాడికి తెలియదు  నేను  ఆ గతుకుల రోడ్డు మీద కంకర రాళ్ల మీద నుంచి చాలా తొందరగా సైకిల్ రేస్ లో పాల్గొన్న టు గా దాన్ని నడిపించుకుంటూ  లైబ్రరీ కి వెల్లాను అని!
 
లైబ్రరీలో వెళ్లి  ఆ పుస్తకాన్ని వెతుకుదును  కదా ,  పదిహేను నిమిషాలు గడిచిపోయాయి కానీ అది ఎక్కడా దొరకలేదు. అర్థం కాలేదు . 
 ఎలాగైనా బహుమతి కొట్టాలని పట్టుదల ఒకవైపు.  ఆహా లాభం లేదు అనుకొని లైబ్రరీ  మేనేజర్ దగ్గరికి వెళ్లి అడిగా.  అతను ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా నన్ను చూసి , మొహం లో ఎటువంటి భావాలను కనిపించనీయకుండా, ఏడుపు ముఖంతో
లేచి వచ్చి డైరెక్ట్ గా ఆ పుస్తకం ఉండే దగ్గరికి వెళ్లి  నాకు కావలసిన పుస్తకం తీసి ఇచ్చాడు.    అప్పటివరకు  నేను ఆ రాక్ అంతా కూడా చూశాను  కానీ నాకు మాత్రం ఇంతకు ముందు అది కనపడలేదు.  అప్పుడు అర్థమైంది ఎవరి సబ్జెక్ట్ లో వారేగొప్ప అని!
 అప్పుడు అతనికి థాంక్స్ చెప్పి పుస్తకం తీసుకున్నాను. అయినా సరే అతను మాత్రం నవ్వలేదు. అక్కడ కూర్చొని ఆ పుస్తకం తిరగేశాను.  అదేమో చాలా పెద్ద గ్రంధం.   దాన్ని చదవడానికి దాదాపుగా ఐదారు గంటల సమయం కావచ్చుననిపించింది.అది చదివి అప్పుడు  స్టేజి మీద దాని గురించి స్పీచ్ ఇవ్వడం దాదాపుగా అసంభవం అని తేలిపోయింది.  ఇలా చదివితే లాభం లేదు అనుకొని అక్కడక్కడ ఉన్న కొన్ని పాయింట్స్ రాసుకొని వెళ్లాను .అయితే అవి చూడకుండా స్టేజి మీద మాట్లాడాలి కాబట్టి ఎక్కడ కూడా  డేట్స్ లాంటివి రాకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే డేట్స్ గుర్తుపెట్టుకోవడం  నాకు ఇంకా కష్టం  పైగా అదొక తలనొప్పి.
మొత్తానికి  అరగంట సమయం  ముందే మళ్ళీ కాలేజ్ కి చేరుకున్నాను.  ఆంధ్ర మహావిష్ణువుతో సహా రెడ్డిరాజులు, కాకతీయుల  వగైరా వరకు లాక్కొని వచ్చి చెప్పి పూర్తి చేశాను.
 నా తర్వాత గుంటూరు నుంచి వచ్చిన ఒక విద్యార్థి  అప్పారావు నాకంటే సీనియర్,  అతను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రైజ్ అతడికి మాత్రమే వచ్చేది.  వాక్చాతుర్యంతో చాలాసేపు మాట్లాడాడు.  నేను కనీసం  థర్డ్ ప్రైస్ అయినా వస్తుందని ఆశతో కూర్చున్నాను.  
అందరూ పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తులు ఒకరినొకరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు.  అసెంబ్లీ హాలంతా విద్యార్థులు, విద్యార్థినుల   మాటలతో గోలగోలగా ఉంది. కాసేపటికి  లెక్చరర్స్   అందరూ కుర్చీలో సర్దుకుని మా వైపు తిరిగారు. తీర్పు , ఫలితాలు విడుదల చేయాలని  నిశ్చయించి అందర్నీ కూర్చోబెట్టారు.  మేమందరం ఆతృతతో ఊపిరి బిగబట్టి వినడం మొదలు పెట్టాం.   న్యాయ మూర్తుల లోఒకరైన సుబ్బారావు గారు లేచి    మైక్ మరియు దాని సౌండ్ సెట్ చేసుకొని, చెప్పడం మొదలు పెట్టారు.  మళ్లీ అంతలోనే ఆయనకు ఏదో సందేహం వచ్చి మిగిలిన న్యాయమూర్తుల దగ్గరికి వెళ్లి ఎవరికీ వినపడకుండా గుసగుసలాడి  మళ్లీ  మైకు దగ్గరికి వచ్చారు.  ఇటువంటి సందేహాలు ఆఖరి నిమిషంలో వీళ్ళకు ప్రతిసారీ ఎందుకు వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు!
 పేపర్లు చేతిలో పట్టుకొని" మొదటి బహుమతి శ్యామ్ కుమార్ " అన్నారు.  మరంతే ,హాలంతా చప్పట్లతో నిండి పోయింది.  నేనేమో నమ్మశక్యం గాక ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాను. అది కలో నిజమో తెలియలేదు  .ఎప్పుడూ ఓటమెరుగని ఎక్కడికెళ్లినా మొదటి బహుమతి,వచ్చే గుంటూరు అబ్బాయి కి రెండవ బహుమతి లభించింది.  వెంటనే అబ్బాయి లేచి తనకు అన్యాయం చేశారని గగ్గోలు మొదలు పెట్టాడు.  అప్పుడు న్యాయమూర్తులు అబ్బాయిని పిలిచి మాట్లాడారు.  అతని మాటలు విని అప్పుడు అందరికీ మళ్ళీ కూర్చోబెట్టారు.  

 హిస్టరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్   సుబ్బారావు గారు   మైక్ తీసుకొని  చెప్పడం మొదలు పెట్టారు "  బాబు నువ్వు చెప్పే విధానం,  భాష అన్నీ బావున్నాయి.  అయితే చరిత్రలో ఎక్కడ  అయినా సరే  తేదీలు సంవత్సరాలు కరెక్టుగా చెప్పాలి.  లేదా చెప్పకూడదు.  అవి తెలియకుంటే అసలు వాటి గురించి మాట్లాడకూడదు.  అంతేగాని నువ్వు చరిత్రను మార్చలేవు,  మార్చకూడదు!!.  నువ్వు రెండు సందర్భాలలో కూడా వాటి శతాబ్దాలు, దశాబ్దాలు మార్చేసావు.   అంటే నువ్వు చెప్తున్న చరిత్ర యొక్క విషయ పరిజ్ఞానం తప్పు. ఒకే.?.   చెప్పినంత వరకు తప్పులు లేకుండా చెప్పిన అబ్బాయికి మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది.  ఇక వెళ్ళు"  అని. అందరూ లేచి వెళ్ళిపోయారు.  మేము అందరం సంతోషంగా  వెళ్ళిపోయాం.   కానీ  తర్వాత నేను భయంకరంగా దొరికిపోయాను .అది ఎలా? చెప్తాను వినండి.  
 ఆ రోజు సాయంత్రం కాలేజీలో చిన్న ప్రోగ్రాం పెట్టి  విద్యార్థులందరినీ అసెంబ్లీ హాల్లో కూర్చోబెట్టారు.  అసలు ఆ రోజు ఇందిరా గాంధీ పుట్టిన రోజట.  అందుకే ఈ కార్యక్రమాలన్నీ పెట్టారుట.   ముందుగా  బహుమతి ప్రదానం జరిగింది .  ఇక ఆ తర్వాత      సభా వేదిక మీదున్న పెద్దలందరూ   స్పీచెస్ ఇవ్వడం మొదలైన్ది  ,మాకు అసలు ఏమాత్రం  ఆసక్తి లేని ,విసుగు పుట్టించే  కార్యక్రమం మొదలయ్యింది.  అదిగో సరిగ్గా అప్పుడే ప్రిన్సిపాల్ లేచి  మొదటగా బహుమతి వచ్చిన అబ్బాయిని మాట్లాడమనండి అని చెప్పారు.  ఇంకేముంది వెంటనే నన్ను పిలిచారు.  అప్పుడు నా పరిస్థితి చెప్పాలి అగమ్యగోచరంగా ఉంది.  ఎందుకంటే  పోటీ గురించి ప్రత్యేకంగా నేను అప్పటికప్పుడు  చదివి వచ్చిన సబ్జెక్టు మాట్లాడాను కానీ నాకు ఇందిరా గాంధీ గురించి, ఆరోజు ప్రాముఖ్యత గురించి చెప్పడానికి ఏమీ తెలియదు.   ఒళ్లంతా జ్వరం వచ్చిన వాడి లాగా అయిపోయింది.   నడవడానికి  కాళ్ళలో బలం సరిపోలేదు.  వణుకుతూ వెళ్లి వెర్రి ముఖం వేసుకొని నాకు తెలిసిన నాలుగు మాటలు మాట్లాడి అయిపోయింది  "  మమ" అనిపించుకుని వచ్చేసాను.  మొత్తానికి చావు తప్పి కన్ను లొట్ట పోయింది.  ఆ రోజు కార్యక్రమంలో మా నలుగురికి  తలా ఒక బహుమతి వచ్చింది.  మాలో ఒక్క వాసుకి మాత్రం  ఏది రాలేదు.  ఇక ఆఖరున మిగిలింది ఫోటోగ్రఫీ కాంపిటీషన్ మాత్రమే.  అందులో రెండు ఫొటోస్ వాసు తీసినవి. ఆ రెండు ఫోటోగ్రాఫ్స్ మాత్రమే పోటీకి  అనుమతించబడ్డాయి.  అవి మామూలు  క్లిక్ 3 అనబడే  అతి సాధారణమైన కెమెరాతో  తీశాడు.  వాటిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏమిటంటే  ,మా వాడికి ఎట్టి పరిస్థితుల్లో బహుమతులు రావు.   అప్పుడు నేను రావు , కృష్ణ  కూర్చొని ఆలోచించాము.  అప్పుడు మాకు మంచి తెలివైన ఆలోచన వచ్చింది .  ఫోటోగ్రఫీ పోటీ కి న్యాయనిర్ణేతగా మాకు చాలా  సన్నిహితులైన  జువాలజీ లెక్చరర్ లక్ష్మీనారాయణ గారిని  నిర్ణయించారు.  ఇక లోపాయికారిగా దగ్గరికి వెళ్లి సహాయం   అర్థించాలని నిశ్చయించుకున్నాము "చ చ !!
వెళ్లి అలా అడగడం ఏంటి !  అలా ఎలా  అడుగుతాంరా?   అసహ్యంగా,  ఏం బాగుంటుంది?  "అన్నాడు వాసు. 
" ఏం తప్పు లేదు .వసుదేవుడంతటివాడు చేశాడు .మనం ఎంత అన్నాడు"  కృష్ణ.  
"అయితే ఏం చేద్దాం ?"అని నేను అడిగాను.  అప్పుడు వాసు అన్నాడు  "ఇంటికి పెళ్లి ఆయన కాళ్ళ మీద పడి కాలు గట్టిగా పట్టేసు కుoదాం.  అప్పుడు ఆయన అడుగుతారు 
.మీరు ఎవరు అని? ఏమిటిది ?అని.
" సార్ మేము వసుదేవులము  అని చెపుతాము."
  అప్పుడు రావు అన్నాడు" అలా  అంటే , ఆయన వెంటనే అయితే మీ ఉద్దేశంలో నేను గాడిదనా అంటూ      తన్ని తగిలిస్తాడు, తిక్క కుదురుతుంది " అని పకపక నవ్వాడు. 
అందరం కలిసికట్టుగా లక్ష్మి నారాయణ గారి ఇంటికి వెళ్లాం.  ఆ సమయంలో ఆయన   పంచ కట్టు కొని ఈజీ చైర్ లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు. మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయి "ఏంటి బాబు ఇలా వచ్చారు" అని లేచారు.  
మేము, లేని నవ్వు తెచ్చుకొని" ఏమీ లేదు సార్! మిమ్మల్ని కలవడానికి వచ్చాము !"అని నమస్కారం పెట్టాం. అయన  మాకు  ఎన్సీసీ ఆఫీసర్ కూడా. 
అప్పుడు తను నవ్వి" సరేలే కానీ ఏంటి సంగతి చెప్పండి "అన్నారు.
  అప్పుడు మేము నసుగుతూ అసలు సంగతి చెప్పాం.   మా  రిక్వెస్ట్ విని  సరేలే చూద్దాం మీరు  మీరు ఇంక వెళ్ళండి అని పంపించేశారు.  మేము తీసుకెళ్లిన ఢిల్లీ వాలా స్వీట్ డబ్బాను తనకిచ్చి వచ్చేసాం.  ఎందుకయ్యా ఇవి ఇటువంటి పనులు ఇంకోసారి చేయకండి అని  సున్నితంగా  మందలించి పంపించేశారు.  అయితే మేము చేసిన దౌత్య వ్యవహారం ఫలించింది.  మరుసటి రోజు ఫోటోగ్రఫీ పోటీలలో మా వాడికి కన్సోలేషన్ బహుమతి  వచ్చినట్టుగా నోటీస్ బోర్డులో ప్రకటించారు. అది చూసి మేము అందరం కేరింతలు కొడుతూ ఒకరినొకరు  గట్టిగా  కౌగిలించుకున్నాము.  అది మా జీవితంలో నేర్చుకున్న మొదటి తెరవెనుక దౌత్యం. 
తర్వాత కొద్ది రోజులకి మా లక్ష్మీనారాయణ లెక్చరర్ గారు మాతో అన్నారు "నేను చేసిందేమీ లేదు బాబూ కన్సోలేషన్ ప్రైజ్ అన్నది లేదు.  అయితే దాన్ని   ఆఖరు బహుమతిగా ప్రకటించాను.  ఒక రకంగా చెప్పాలంటే కన్సోలేషన్ బహుమతి కి వాసు అర్హుడే"  ఈ మాటలతో మాకందరికీ ఆయనంటే ఇంకా గౌరవం పెరిగిపోయింది. ఇకపోతే-----
 రాత్రింబగళ్ళుబాగా చదివేవాళ్ళం. దాదాపుగా ప్రతిరోజు రాత్రి రెండు మూడు గంటలకు పడుకునే వాళ్ళం.  క్రమశిక్షణతో ఉండటం,  ఉపాధ్యాయుల కి తగిన గౌరవం ఇవ్వడం,  పరీక్షలో మొదటి ర్యాంకు తెచ్చుకోవడం, వీటితో సమానంగా కోతి వేషాలు వేయడం  చేసేవాళ్ళం అసలు మమ్మల్ని ఏ విధంగా  అదుపు చేయాలో  తెలియక ఉపాధ్యాయులు అందరూ నవ్వుకునే వారని ఆ తర్వాత మాకు తెలిసింది.  వారి  ప్రేమ, అభిమానం మధ్య మేము మా కాలేజీ చదువులు చాలా  ఆనందంగాకొనసాగించాం.
         --------------------------------
ఫోటోలో.....:-ముగ్గురు మిత్రులు *


కామెంట్‌లు