బాల్యం గడిచిపోయి, యవ్వనం లోకి అడుగుపెడుతున్న తొలిరోజులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇంటర్ లో కూడా ఏమీ అర్థం కాకుండ ఉంటుంది. డిగ్రీ కాలేజీ లో అడుగు పెట్టే సరికి ,ఇంకా టీనేజ్లో ఉన్నప్పటికీ, ప్రతి ఉదయం మరియు సంధ్యా సమయం చాలా అందంగా, లోకమంతా ఇంద్రధనస్సులో రంగుల లాగా కనపడుతుంది. ప్రతి విషయం మనసును కదిలిస్తుంది. ప్రతి దానికి స్పందన ఎక్కువగా ఉంటుంది. ప్రతి అమ్మాయి లో ఎక్కడా లేని అందాలు కనపడుతుంటాయి. అమ్మాయిలు చాలా ధీమాగా నిదానంగా వ్యవహరించడం మొదలుపెడతారు. చాలావరకు అబ్బాయిలకి అంతవరకూ లేని ధైర్యం , ప్రతి సమస్యను ఎదుర్కొనే మనస్తత్వం అలవడుతుంది , కానీ తత్తర పడకుండా అమ్మాయిలతో స్నేహం కొనసాగించడం ఒక పట్టాన రాదు. అందుకు మంచి ఉదాహరణ నాకు అతి సన్నిహితస్నేహితుడు - కృష్ణ , అనే చెప్పాలి.
నేను బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతుండగా నాకు శ్రీనివాస్ ,వెంకు ,అనే ఇద్దరు, భవిష్యత్తులో విడలేని స్నేహితులు కలిశారు. వాసు తమ్ముడు కృష్ణ బీకాం మొదటి సంవత్సరం లో ఉండే వాడు. మేము నలుగురం కొద్ది సమయంలోనే మంచి స్నేహితులుగా మారి పోయాము. మాతో పాటు దేవేందర్ కూడా కలిసిపోయాడు. చాలా చిన్న పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన వాడు అవటం మూలాన ఏమీ మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేవాడు. కాలేజీలో మమ్మల్ని చూసి పంచపాండవులు అని పేరు కూడా పెట్టడం జరిగింది.
తొలిసారి జరిగిన మాస పరీక్షలలో నేను మా క్లాస్ లో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించాను. అప్పుడు విరామ సమయంలో వెంకు నా దగ్గరకు వచ్చాడు . చురుకైన పెద్ద కళ్ళు సన్నటి నూనూగు కోరమీసం ,ధర్మేంద్ర -సినిమా హీరోలాగా మొత్తంగా వెనక్కి దువ్వి దాదాపు ఆరడుగుల ఎత్తు , కాస్త చిరునవ్వుతో వచ్చి నాకు చెయ్యందించి " కంగ్రాట్స్ ! క్లాసులో మొదటి మార్కులు మీదే కదా ? అసలు ఎలా చదివారు ?ఏ రకంగా చదివారు? "అంటూ ప్రశ్నించాడు. అప్పుడు గమనించాను ,అతని మాటల్లో చాలా సిన్సియారిటీ కనిపించింది. మంచి వ్యక్తిత్వం ప్రిన్సిపుల్స్ ఉన్న వ్యక్తి లాగా కనిపించాడు. ఎప్పుడూ నలగని దుస్తులతో టక్ చేసుకుని , షూ వేసుకుని కాలేజీకి వచ్చేవాడు. ఆ తర్వాత రోజుల్లో మాకు చెప్పే వాడు " మనం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి చాలా నీట్ గా ఇలాగే ఉండాలి" అని. తర్వాత రోజుల్లో మేము అదే పాటించాము.
అదే సమయంలో బీకాంలో కృష్ణ కూడా విద్యార్థులలో ముందు నిలిచాడు . అప్పుడు నాకు , కృష్ణ కు సహ విద్యార్థులలో మరియు అధ్యాపకులలో మంచి గుర్తింపు వచ్చింది. అందరూ మమ్మల్ని ప్రత్యేకంగా చూసేవారు. ఇది గమనించి కృష్ణ చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. వాఢి,నాన్న గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రెండు జిల్లాలకు అధికారి కావటం మూలాన ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థితిలో ఉండేవాడు . బహుశా అందుకే అనుకుంటాను ,మనోధైర్యం ,దర్పం వాడి దగ్గర ప్రతి విషయం లో కనిపించేది. పైగా కాస్త అందగాడు కూడా. చదువులో మాత్రమే కాకుండా ప్రతి విషయాన్ని బాగా తెలివిగా ఆలోచించే వాడు. చదువు గురించి, ఆ తర్వాత ఉద్యోగాలు ఎలా సంపాదించాలి, చేయవలసిన పనుల గురించి మాకు మంచి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఇంగ్లీషు భాషలో మంచి దిట్ట. మాకు అసలు ఆ పేరే తెలియని హిందూ పేపర్ ని వాడు ప్రతి దినం తప్పకుండా చదివే వాడు. వాడు 7 తరగతి చదువుతున్నప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్ కి తెలుగులో అర్థం ఏమిటని వాళ్ళ నాన్నను అడిగాడట. అప్పుడు వాళ్ళ నాన్నగారు తను చదువుతున్న హిందూ పేపర్ ముందు పెట్టి ఇది రోజు చదువు .ఇంగ్లీషు రాకుంటే జీవితంలో ఎదగడం చాలా కష్టం అని చెప్పాడట. వాడు ప్రతి రోజూ హిందూ పేపర్ ఆమూలాగ్రం చదివేవాడు. ప్రత్యేకంగా సెంటర్ స్ప్రెడ్ ,ఎడిటోరియల్ తప్పకుండా చదివేవాడు. మేమందరం కనీసం పేపర్ను ముట్టుకునే ప్రయత్నం కూడా చేసేవాళ్ళం కాదు.
మాది కో ఎడ్యుకేషన్ కావటం మూలాన అమ్మాయిలు కూడా ఉండేవారు కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కృష్ణ అమ్మాయిల వైపు చూసే వాడు కానీ పట్టించుకోకపోయే వాడు. ఆడుతూ పాడుతూ చదువు మీద పట్టుదలతో సంవత్సరం పూర్తి చేశాం. మొదటి సంవత్సరం పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి, కాలేజీలో మంచి గౌరవం సంపాదించుకున్నాము . మేము రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి సంవత్సర విద్యార్థులలో రాజ్యలక్ష్మి అనే రెండు జడల అందమైన అమ్మాయి అడుగు పెట్టింది. పెద్ద కళ్ళతో కోటేరు ముక్కు తో , అందం కంటే ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండేది. అదిగో అప్పుడు కృష్ణ కి అసలు ప్రాబ్లం మొదలైంది.!
మా కాలేజీ మొత్తానికి ఒక నడవ అంటే వరండా ఉండేది . క్లాస్ మొదలయ్యే వరకు మేము ఆ నడవా లోనే ఉండేవాళ్ళం. అధ్యాపకులు రావడం చూసి అప్పుడు గానీ లోపలికి వెళ్లక పోయే వాళ్ళం. ఆ సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించారు ,కాలేజీ వాతావరణమంతా చాలా క్రమశిక్షణతో కూడుకొని ఉండేది. మేము కాలేజీలో చాలా బాగా ఎక్కువగా ఆనందించిన స్థలం ఏదైనా ఉంది అంటే అది నడవా అంటే కారిడార్ మాత్రమే!సరదాగా జోకులు పిచ్చి పిచ్చి కబుర్లు ,అందరినీ పలకరించడం , వేరే క్లాసులలోకి వెళ్తున్న సహా విద్యార్థిని విద్యార్థులను చూడడం వగైరా,అన్నీ అక్కడే జరిగేవి. అప్పుడప్పుడు కారిడార్ పైనుంచి కిందికి దిగడానికి ఉన్న మెట్ల మీద కూర్చునే వాళ్ళం. లేదా కారిడార్ కింద ఉన్న మైదానంలో గడ్డి మీద కూర్చుని అందర్నీ చూస్తూ వారి మీద జోకులు వేసుకుంటూ నవ్వుతూ సమయం గడిపే వాళ్ళం.
డిగ్రీ రెండవ సంవత్సరం మొదలైన కొత్తలో ఒకసారి అలాగే గడ్డి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మాతో అంతవరకూ సరదాగా నవ్వుతూ , నవ్విస్తున్న కృష్ణ ఉన్నట్టుండి మాటలు మానేసి గంభీరంగా అయిపోయాడు. వాడప్పుడు దూరంగా కారిడార్ వైపు చూస్తున్నాడు. అక్కడ నుంచి నేను ఇంతకు ముందు చెప్పిన రాజ్యలక్ష్మి అనే మొదటి సంవత్సరం అమ్మాయి తలవంచుకొని ఒక జడ ముందుకీ ఒక జడ వెనక్కీ వేసుకొని రెండు చేతులతో పుస్తకాలు ఎదను ఆనించుకుని అటు వైపుగా ఉన్న క్లాస్ కు వెళుతోంది. మొదలే చాలా పెద్దగా ఉండే వాడి కనుగుడ్లు దాదాపుగా సగం బయటికి వచ్చేశాయి. "అరే !! భలేగా ఉందిరా అమ్మాయి!!! " అన్నాడు. వాడి మొహం చూస్తే తెలుస్తుంది ,స్పృహ కోల్పోయి ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాడని.
"అయితే ఏంటి ??మరి అంతలా చూడాలా! గుడ్లగూబ లాగా ఆ కళ్ళు వేసుకొని, ముష్టి వెధవ !అన్నాడు కోపంగా, చిరాకుగా, వాడి అన్నయ్య వాసు . సరదాగా జోకులతో, నవ్వుల తో జరుగుతున్న మా సంభాషణ మధ్యలో, వాడు అలా అమ్మాయి వైపు చూడటం, అమ్మాయి గురించి మాట్లాడడం మాకు ఎవరికీ నచ్చలేదు. కృష్ణ ఆ తరువాత చాలా రోజుల వరకూ ఈ అమ్మాయి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ కళ్ళతోటి అమ్మాయిని అనుసరించడం మాత్రం వదల్లేదు. మేము ఐదుగురం ఎక్కడ మాట్లాడుతూ ఉన్నా ఒకవేళ ఆ అమ్మాయి అటుపక్క వచ్చిందంటే చాలు వీడి హావభావాల్లో ,మాటలలో తేడా వచ్చేసేది. ఆ అమ్మాయి దూరంగా వెళ్లే వరకు కూడా వీరి శరీరం వంకర్లు తిరుగుతూ ఉండేది. అమ్మాయి గమనించాలని వీడు కమెడియన్ వేషాలు లాంటివి వేస్తూ ఉండేవాడు . ముందు తెలియ లేదు కానీ తర్వాత తర్వాత మాకు అసలు అసలు విషయం అర్థమైంది.
"అమ్మాయి చాలా అందంగా ఉంది. బుద్ధిమంతురాలు లా కనబడుతోంది, కాబట్టి ఈ వెధవ వేషాలు మానేసి బుద్దిగా చదువుకో, నువ్వు ఎన్ని కోతి వేషాలు వేసినా సరే , ఆ అమ్మాయి నిన్ను చూడదు " అని చెప్పి అందరం పగలబడి నవ్వాం. ఆ అమ్మాయి ఎదురు అయిందంటే చాలు వీడి నడక కూడా మారిపోయేది. కాలేజీలో అత్యంత తెలివైన విద్యార్థిగా గుర్తింపు రావడం వలన అందరూ కృష్ణ ను గమనించేవారు.ఆ అమ్మాయికి కూడా అది తెలిసే ఉంటుంది.
మా కాలేజీ కి PLMS అని ఒక ప్రైవేట్ బస్సు ఉండేది. అమ్మాయిలందరూ ఆ బస్సులోనే వచ్చేవారు. చాలా వరకు అబ్బాయిలు మాత్రం నడక, సైకిళ్లపై వచ్చేవారు. కొందరు అబ్బాయిలు మాత్రం బస్సులో వచ్చేవారు. మేము మా సైకిల్స్ అన్నీ వెంకు ఇంటి దగ్గర పెట్టేసి, సరదాగా బస్సు ఎక్కి కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాం. సరిగ్గా అదే బస్సు లో రాజ్యలక్ష్మి కూడా రావడం మొదలు పెట్టింది. ఇంకేముంది మా కృష్ణ రొట్టె విరిగి నేతిలో పడింది. బస్సులో అమ్మాయిలు కూర్చోవడానికి కొన్ని సీట్లు వదిలేవారు. సరిగ్గా ఆ సీట్ల దగ్గర్లో కూర్చోడానికి ప్రయత్నించేవాడు కృష్ణ. కొత్త విషయాలు మాట్లాడుతూ జోకు చేస్తూ ఉండేవాడు .కానీ ఆ అమ్మాయి అసలు వీడిని కించిత్తు కూడా చూసేది కాదు. "వీడి కర్మ !వీడికి పోయేకాలం వచ్చింది!!" అని వాసు అనేవాడు . వాడి బాధను చూసి మేము తెగ నవ్వుకునే వాళ్ళం.
అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మేము ఇక వాడిని ఎగతాళి పట్టించడం
మొదలుపెట్టాం. "ఇంకా ఆ అమ్మాయి వెంట పడడం దండగ. ఆ అమ్మాయి కనీసం నిన్ను గమనించలేదు, చూడట్లేదు .ఎందుకురా అనవసరంగా పరువు తీసుకుంటావు ?" అని ఒక రకమైన విసుగుతో చిరాకుగా సలహా ఇచ్చాము. మొహల్లా రా మీకు ఏం తెలుసు అమ్మాయి నన్నే చూస్తుంది నన్ను గమనిస్తోంది. నేను తన వెంట పడుతుంటే అమ్మాయి చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. మేమందరం కడుపులు పట్టుకొని పగలబడి నవ్వాం. ఒక నిముషం ఆగి "ఏది నిన్ను చూసి? " అని , మళ్ళీ కాసేపు పొట్టచెక్కలయ్యేలా నవ్వాము. అప్పుడు వాడి అన్నయ్య వాసు అన్నాడు "అంత సీన్ లేదు ,అమ్మాయి నిన్నేమీ గమనించటం లేదు . అటువంటి అత్యాశ ఏమి పెట్టుకోకు ముష్టి !!" అని పకపకా నవ్వాడు. మేమందరం మళ్ళీ కాసేపు నవ్వుతూనే ఉన్నాం. అప్పుడు పాపం కృష్ణ మొహం ఎలా పెట్టాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. అయినా సరే వాడు తన ప్రయత్నాన్ని మానలేదు. అసలు ఆ అమ్మాయి తోటి మాట్లాడటం గానీ, పలకరించటానికి కాని అవకాశం , వీలులేదు. కనీసం ఒకటే క్లాసు లేదా ఒకటే సంవత్సరం అయినా అటువంటి అవకాశం కృష్ణ కు దొరికేది. బాగా ఆలోచించి ఒక చక్కటి ఆలోచన తో మా దగ్గరికి వచ్చాడు. అదేమిటంటే మొదటి సంవత్సరము బీకాం కామర్స్ సంబంధించిన ఒక ప్రత్యేకమైన పుస్తకం వాడి దగ్గర ఉంది. దాన్ని అమ్మాయికి బహుమతిగా ఇస్తాడట.
మేమందరం వాడి వైపు విచిత్రంగా చూశాం. "అయితే ?? ఆ పుస్తకం ఇవ్వగానే నీకు పడిపోతుంది ఏంటి?" అని మళ్లీ పెద్దపెట్టున నవ్వుతూ, ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇంకా ఎక్కువగా నవ్వటం మొదలు పెట్టాం.
"ఎదవల్లారా పూర్తిగా వినండి. ఏమీ తెలియదు వెధవలకి ,నవ్వటం ఒకటే తెలుసు" అంటూ వాడు తెగ చిరాకు పడిపోయాడు. మేము మళ్లీ కడుపుబ్బా , మనసు తీర నవ్వుకొని, ఆపి ,"సరే! చెప్పు రా! ఇప్పుడు నీ బాధ ఏంటో ?" అని వాడి బాధ చూడలేక, వినడం మొదలు పెట్టాము. తీరా వాడు చెప్పింది ఏంటంటే, మధ్యాహ్నం భోజన సమయంలో వాడు అమ్మాయిల వెయిటింగ్ రూం దగ్గరికి వెళ్లి తలుపు కొట్టి అమ్మాయి ని పిలిచి ఈ పుస్తకం చదవండి ,మార్కులు బాగా వస్తాయి అని సలహా ఇచ్చి ,ఆ పుస్తకం చేతిలో పెట్టి వస్తాడట మరేమో అమ్మాయి చాలా సంతోషిస్తుంది అట. వాడి ప్లాన్ వినగానే మాకు దిగులు పట్టుకుంది.,, ఎంతో తెలివైన వాడు ఏంటిరా ఇలా అయిపోయాడు అని. మేము ఒకరినొకరు చూసుకుని, ముసిముసిగా నవ్వుకొని , వాడు బాధపడతాడు అని , ఆ నవ్వులు దాచుకొని సీరియస్ గా మొహాలు పెట్టి సరే అన్నాం.
ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అటక మీద విసిరేసిన మొదటి సంవత్సరపు పుస్తకాలన్నీ తీసి అందులోంచి తనకు కావాల్సింది వెతికి తీసుకున్నాడు. దాని దుమ్ముదులిపి, కత్తెరతో రంగురంగుల పేపర్ తీసుకొని చక్కగా దానికి కవర్ వేసాడు. మేము నలుగురం వాడు చేసే ఈ పనులన్నీ చూస్తూ వీడికి పిచ్చి ముదిరింది అని అనుకున్నాం.
మరుసటి ఉదయాన్నే నున్నగా గడ్డం గీసుకొని, ఆ మధ్య కొత్తగా కొట్టించుకున్న సఫారీ వేసుకున్నాడు. కొత్తగా కొన్న షూస్ తీసుకొని బట్టతో నీటుగా తుడిచి పాలిష్ చేయడం మొదలుపెట్టాడు . అది చూసి ఇంక ఆపుకోలేక వాసు వెక్కిరింతగా అన్నాడు " ఏరా, కొంపదీసి పెళ్లిచూపులు గట్రా వెళ్తున్నావ్ ఏంటి ?"
వాడు మమ్మల్ని సీరియస్ గా
చూసి చూసి ఏం మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాడు. ముందు అనుకున్నట్టుగానే మార్నింగ్ సెషన్ అయిపోగానే లంచ్ టైం కల్లా వాడు మా క్లాస్ రూం దగ్గరకు వచ్చాడు. ఏమైంది ఇచ్చేసావ అని అడిగితే, మీరు అందరూ రండి నా ఒక్కడికి కాస్త కంగారుగా ఉంది అని భయంగా మొహం పెట్టాడు. అది చూసి జాలి వేసి సరే పద అని బయలుదేరాం.
అమ్మాయిల వెయిటింగ్ రూమ్ దగ్గర్లో కాకుండా మేం కాస్త దూరంగా నిలబడ్డాం. ఎందుకైనా మంచిదని అందరూ వాడికి సలహా ఇచ్చాo, జాగ్రత్తరా అటూ ఇటూ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అప్పుడు వెంకు అన్నాడు ఆ ఏమవుతుంది అయితే గియితే మహా అయితే కాలేజీ నుంచి డిబార్ చేస్తారు
అంతే కదా అన్నాడు.
కాసేపు మా అందరి మొహాల్లో భయం కనిపించింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకొని సరే ఏదైతే అదే అయింది వెళ్లి జాగ్రత్తగా ఇచ్చిరా , గాభరా పడకు హుందా గా వ్యవహరించు అని చెప్పి పంపించాము .
మేము దూరంగా నిలబడి చూస్తున్నాం, వాడు అమ్మాయిల వెయిటింగ్ రూం తలుపు తట్టి అమ్మాయిని పిలిచాడు . కాసేపటికి ఆ అమ్మాయి వచ్చి ఏంటి అన్నట్లు చూసింది. వీడు విషయం చెప్పి పుస్తకం ఇచ్చాడు. వద్దు అక్కర లేదు అని ధడేల్ మంటూ తలుపులను వాడి మొహం మీద వేసి లోపలికి వెళ్ళిపోయింది. వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలో అక్కడే ఉన్న పని అమ్మాయి వచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా మా కృష్ణ ఆ పని అమ్మాయి ని పిలిచి విషయం చెప్పి పుస్తకం చేతిలో పెట్టి రూమ్ లోకి పంపించాడు. అయితే గోడకు కొట్టిన బంతిలా వెంటనే ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకొని వచ్చేసింది , ఆ అమ్మాయి గారు
తీసుకోవట్లేదు సార్ అంటూ. సరే ఏడవని, అంటూ ఆ పుస్తకం తీసుకుని కృష్ణ వచ్చేసాడు. అప్పుడు వాడి ముఖం చూడాలి అవమానభారంతో ఎర్రగా కందిపోయి ఉంది. మేమందరం భలే జరిగింది అనుకుంటు నవ్వుతూ నిలబడ్డాం . మమ్మల్ని చూసి ,ఎందుకు వెకిలి నవ్వులు,అపశకునం పక్షులు అంటూ తిట్టిపోయడం మొదలుపెట్టాడు. అసలు మనది ఏం తప్పు? మనల్ని తిడతాడు,వెధవ ! వీడికి అసలు ఆ అమ్మాయిని సరిగ్గా మేనేజ్
చేయడం చేత కాలేదు . సరేలే , రసాభాస కాలేదు, అనుకుంటూ సంతోషించి , ఇంకా వేరే విద్యార్థులు ఎవరైనా మమ్మల్ని చూసి గమనిస్తే , అవమానం అనుకుంటూ వాడు కామర్స్ సెక్షన్ కి, మేము సైన్స్ సెక్షన్ వైపు వెళ్ళిపోయాం.
రాజ్యలక్ష్మికి మొత్తానికి కృష్ణ సంగతి అర్థం అయిపోయింది. వేయి మందిలో ఉన్నా సరే వారిలో తనను ఎవరు గమనిస్తున్నారు అన్నది సరిగ్గా గుర్తుపట్టగలిగేది అమ్మాయి మాత్రమే. నిజంచెప్పాలంటే అమ్మాయిలకు మాత్రమే ఉండే ప్రత్యేకశక్తి . అంతే కాదు ఆ చూపు ఎటువైపు నుంచి వస్తుంది, ఎక్కడ తగులుతున్నది కూడా క్షణాల్లో కనిపెట్టగలరు. మహిళ కు అది బహుశా ఆ భగవంతుడు ప్రసాదించిన వరం అనుకుంటాను. అప్పటి నుంచి రాజ్యలక్ష్మి ఇంకా జాగ్రత్తగా మసలు కోవడం మొదలుపెట్టింది. పొరపాటున కూడా కామేశ్వరరావు (కృష్ణ)వైపు లేదా మా వైపు అసలు చూసేది కాదు. దాంతో మావాడికి అమ్మాయి అంటే ఇంకా ఆకర్షణ పెరిగిపోయింది. తర్వాత ఏమి జరిగి
ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే !
ఆ రోజుల్లో ఫోన్లు ,సెల్ఫోన్లు , ఫ్రీగా మాట్లాడుకోవడం అమ్మాయి అబ్బాయి ధైర్యంగా నిలబడి మాట్లాడుకోవటం లాంటివి జరిగేవి కావు. ఆ తర్వాత రోజుల్లో మా వ్యక్తిత్వాలు చూసి మేము వ్యవహరించే విధానం చూసి కాలేజీలో మాకు మంచి పేరు వచ్చింది. రానురాను అమ్మాయిలు మమ్మల్ని చూసి భయపడటం మానేసి చాలా స్నేహంగా వ్యవహరించేవారు. వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే మేము ఐదుగురు కలిసి చాలా వరకు సహాయం చేసేవాళ్ళం. ఎప్పుడైనా ఎవరైనా అబ్బాయిలు వారిని ఇబ్బందులకు గురి చేసినా, ఇంకో రకంగా కామెంట్ చేసి ఇబ్బందులకు గురి చేసినా, మేము వెళ్లి వారితో మాట్లాడి , అటువంటి సంఘటనలు మరి ఆ తర్వాత జరగకుండా చేసేవాళ్ళం. వీటి వల్ల వచ్చే ఫలితం రాఖీ పౌర్ణమి నాడు మాకు కలిగేది.
రాఖీలు కట్టడానికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చేసే వాళ్ళు. రాఖీలు కట్టించుకోవడానికి మాకు రెండు చేతులు సరిపోక పోయేవి. మేము జీవితంలో మంచి ఉన్నత స్థానాలు అందుకోవడానికి అటువంటి ప్రేమ- అభిమానాలు కూడా కారణం కావచ్చు నేమో!.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి