*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౨ - 52)

 మత్తేభము:
*కలలంచు న్శకునంబులంచు గ్రహయో | గంబంచు సాముద్రికం*
*బులటంచుం దెవులంచు, దిష్టియనుచు | న్భూతంబులంచు న్విషా*
*దులటంచు న్నిమిషార్ధ జీవనములం | దుం బ్రీతి పుట్టించినా*
*సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయ్యా! | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
కను రెప్ప ఆడే సమయంలో, సగం వుండదు మా మనుషుల జీవితం. అటువంటి ఈ జీవితం పైన మాకు ప్రేమ పుట్టించడానికి, చెడు కలలు వస్తున్నాయి అని, మంచి శకునములు లేవని, ఇంకొకరి చెడు దృష్టి మన మీద వుందని, గ్రహాల ప్రభావం మా మీద సరిగ్గా లేదని, మా అరచేతిని చూసి నీకు మంచి రోజులు లేవని, రోగాలు పీడిస్తాయి అని, ఇలా ఎన్నెన్ని కష్టాలు పెట్టావయా, తాండవ ప్రియా!......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*బుద్బుద ప్రాయమైన ఈ జీవితం మీద మాకు మమకారం పెంచి, మా దృష్టి, మనసు, మేము చేసే పని నీ నుండి దూరం కాకుండా వుంచడానికి ఎన్ని కష్టాలు పడ్డావు స్వామీ!. నర దృష్టి అన్నావు, పీడ కలలు, హస్త సాముద్రికము, రోగములు, చెడు యోగములు అని మమ్మల్ని నీ వద్దే వుంచుకోడానికి ఎంత ప్రయత్నం చేసావు, కార్తీక దామోదరా!  నువ్వు మా కోసం ఇంత చేసినా, నీ చేతలకు అర్థం తెలియక పరమేశ్వరుడు దయలేనివాడు, కరుణ చూపడు అని నిన్ను నిందాస్తుతి చేసినా, కన్నతండ్రివి కదా, నీ మనసు కరుగదా! తప్పక కరుగుతుంది. ఆ పైన, మాకు మా అమ్మ చేయూత వుంది కూడాను.  మమ్మల్ని నీవు వదలి పెట్టలేవు. అనుక్షణమూ నీ కంటి రెప్పలా మమ్మల్ని కాపాడుతావు తండ్రీ! అవును, ఆ నమ్మకమే మా జీవన చుక్కాని, నిస్సందేహంగా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు