*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౫౩ - 53)

 మత్తేభము:
*తలమీద గుసుమ ప్రసాద మలిక | స్థానంబు పైభూతియున్*
*గళసీమంబున దండనాసికతుద | న్గంధ ప్రసారంబు, లో*
*పల నైవేద్యము జేర్చు నే మనుజుడా | భక్తుండు నీ కెప్పుడున్*
*జెలికాడై విహరించు రౌప్యగిరిపై | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
ఏ మనిషి నిన్ను పూజించిన ఆకు, అక్షింతలు తన తల మీద భక్తి తో వుంచుకుంటాడో,  నీకు పూజ చేసిన గంధము తన శరీరానికి రాసుకుంటాడో, నీ విబూదిని నుదిటి మీద, వంటిమీద రాసుకుంటాడో, మెడలో రుద్రాక్ష మాల ధరిస్తాడో,  నీకు పెట్టిన ప్రసాదాన్ని తిని తన ఆకలి తీర్చుకుంటాడో అటువంటి నీ భక్తుడు నీకు దగ్గరగా వుండి నువు వుండే మంచుకొండ మీద నీతో నీ స్నేహితుడు గా తిరుగుతూ వుంటాడు.......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నిన్ను పూజించడానికి ఉపయోగపడిన బిల్వపత్రి, విభూది, రుద్రాక్ష మాల, సుగంధ ద్రవ్యాల ప్రభావం తెలిసినవారు ఎవ్వరూ వాటిని క్షణమైన విడిచి దూరంగా వుండరు. వుండలేరు. నీ ప్రసాద రుచి మరిగిన వారు, నీ ప్రాసాదాన్ని విడిచి ఎలా వెళ్ళగలరు. ఇటువంటి వారైన నీ భక్తులకు వచ్చే కష్టాలు, కలతలు తామారాకు మీది నీటి బిందువు వలే, వారిని అంటవు కదా, పరమేష్ఠీ! అటువంటి నీ భక్తులకు నీ బంగారు కొండ చేరడం సులభతరమే కదా, కాశీనాధా!అందువలన ఈ భూమి మీద వున్న వారిని అందరినీ ముందు నీ భక్తలుగా చేయి. అలా నీ భక్తులైన వారికి అందరికి మంచుకొండ అయిన నీ వెండికొండ మీద స్థిర నివాసం కలుగ చేయి, కారుణ్యధామా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు