ఔ మల్ల!:- - బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999

 నేను సిన్నగ ఉన్నప్పుడు
సిన్న సిన్న ముచ్చట్లకే
బగ్గ సంబుర పడేటోల్లం.
కొత్త వయిలు, కొత్త పెన్ను, 
కొత్త సెప్పులు కొనుక్కున్నా,
కొత్త అంగిలాగులు
పట్టిచ్చుకున్నా,
బెల్లపు బువ్వ అండుకున్నా,
కోడిని కోసుకున్నా,
శియ్య కూర తెచ్చుకున్నా,
గుడాలు ఏసుకున్నా,
రొట్టెలు,సర్వ పిండి,
అట్లు, సేసుకున్నా,
సెనిగలో,మక్కలో,
పల్లీలో ఏంచుకున్నా,
అటుకులు మర్ర వోసుకున్నా
మత్తు సంబురమనిపిచ్చేది.
కచ్చురం మీద పోయినా
సైకిల్ ఎక్కినా,తొక్కినా,
బస్సు ఎక్కినా,
కుట్ కుట్ మోటర్ ను,
కారును, మీది మోటరును సూసినా
బగ్గ సంబురమయ్యేది.
గట్లనే
ఇంటికి సుట్టాలచ్చినప్పుడైనా,
ఏరే ఊరికి పోయినప్పుడైనా
పిల్లను/ పిలగాన్ని సూడవోతున్నప్పుడైనా,
లగ్గం పెట్టుకున్నప్పుడైనా
లగ్గమయినా,
పురుడు అయినా, పుట్టెంటుకలయినా
కడుపునిండా బువ్వ తిని
శానా సంబుర పడేటోల్లం
పంట బగ్గ పండినా,
పండ్లు , పలాలు అమ్మచ్చినా
కోతులోల్లు,పాములోల్లు
గ్యారడోల్లు, పైడి బామనోల్లు,
సిందోల్లు,బబ్బిలోల్లు, ఒగ్గోల్లు,
తుపాకి రామడు
గిట్ల ఎవరచ్చినా
పడి పడి సూసుకుంట,
ఆల్ల ఏశాలను,
ఆల్ల శాస్టలను సూసినా
ఆల్ల ఆటలు,మాటలు 
పాటలు ఇనుకుంట
బగ్గ సంబుర పడేటోల్లం
ఇగ పండుగలత్తే
గా సంబురమే సంబురం
ఔ మల్ల!

కామెంట్‌లు