రాజ హంసలు:-రచన: నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు, చిట్యాల,నల్గొండ,9542236764.

ఆరిపోయే ప్రాణానికి ఆజ్యం పోసే 
అపర ధన్వంతరి వారసులు 
అస్త్ర శస్త్ర చికిత్స పరంపరతో                  
నిశ్చల అవయవాలకు నడక నేర్పే సృజన శీలురు 
చిద్రమైన బతుకు చిగురింప చేసే తొలకరి జల్లులు

స్టెతస్కోప్ సర్పాన్ని సతతం
మెడలో ధరించే శివుని ప్రతిరూపాలు
అందరికీ ఆరోగ్యం లక్ష్య సాధనగా 
అహరహం వైద్య సేవే పరమావధిగా 
స్వచ్ఛ జల ప్రవాహాన సాగిపోయే రాజహంసలు 

సమగ్ర సమాజ ఆరోగ్య పరిరక్షణకై 
నిరంతరం పరితపించే ఆదర్శ మార్గ దర్శకులు 
భేద భావాలు లేని నిర్మల గంభీర శిఖరాలు
మానవత్వ పరిమళాలు వెదజల్లే మహా వృక్షాలు 
అంతుపట్టని అంటురోగ నిషీధి తరిమే ఉషా కిరణాలు 

నరునిగా అవతరించిన శ్రీమన్నారాయణులు
ప్రాణం ఫణంగా పెట్టి పోరాడే త్యాగమయ జీవులు 
దేహమంతా ముక్కలై మరణ శయ్యపై చేరినా                                      
రోగం రొప్పితో అవయవాలు అచేతనమైనా 
స్వస్థత పరిచి స్వాంతన చేకూర్చే ప్రాణ దాతలు 

కరోనా కాలాన ఆసుపత్రులు కోవెలలై 
కొలువు దీరే తెల్లకోట్లతో  కోట్లాది దేవుళ్ళంతా
దీర్ఘాయుష్షు ప్రసాదించే అపర బ్రహ్మలు వైద్యులు
సంప్రదింపుల సలహాల మధుర భాషణంతో 
జబ్బుల తరిమి జాతిని రక్షించే పరం జ్యోతి స్వరూపాలు 

చెరగని చిరునవ్వుతో పగలు రేయి పరిశ్రమతో 
పవిత్ర వైద్య వృత్తి ధర్మం పాటించే జన్మ ధన్యం! 
వైద్యం వ్యాపారం కాదు సేవా దృక్పథమని చాటే
ప్రేమ కరుణ దయతో కూడిన తెల్ల కోటుకు వందనం!

(1జూలై,జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా)

కామెంట్‌లు