ముందు చూపు లేక పోతే?:- ఆర్యసోమయాజుల శరత్--సాఫ్ట్ వేర్ ఇంజనీరు9885668181

   అదొక పాత ఇల్లు.బాగా పాడుబడినట్టు అయి పోయింది.మరి గోడల్లో కన్నాలు మామూలే కదా! ఒక కన్నంలో రెండు ఎలకలు హాయిగా కాపురం ఉంటున్నాయి.
        ఒకరోజు ఆ యింటి యజమాని తన భార్యతో ఈ విధంగా చెప్పాడు.
        "మన ఇల్లు కట్టి వందేళ్ళు అయి పోయింది,ఇక దీనిని పగులగొట్టి మంచి ఇల్లు కట్టించే సమయం వచ్చింది.మంచి ఇంజనీరుకు చూపించి సలహా తీసుకుని తగిన విధంగా నిర్మించుకుందాం"
         "అవునండీ రెండునెలల క్రితమే ఈ విషయం మీకు చెబుదామనుకున్నాను"అన్నది ఆయన భార్య.
           ఈ మాటలన్నీ రెండు ఎలకలూ విన్నాయి.ఒక ఎలుక రెండో ఎలుకతో "మనం వేరే చోట కన్నం వెతుక్కుని వెళ్ళి పోవాలి,ఇక ఈ ఇల్లు పగలగొడితే మనకు ప్రమాదం"అన్నది.
          "అబ్బా, అన్నీ భయాలే నీకు పగుల గొట్టనీ చూద్దాం" అన్నది.
        "సరే నీఇష్టం నేను వెళ్ళి వేరే కన్నం చూసుకుంటాను అని వెళ్ళి పోయింది.రెండో ఎలుక మటుకు అదే కన్నంలో ఉంటోంది,పది రోజుల తరువాత పెద్ద శబ్దం వినబడింది.చూస్తే ఇంటి ముందర గోడ పగుల గొడుతున్నారు.
        "ఇంకా ఈ గోడ పగుల గొట్టినపుడు చూద్దాం"అనుకుని అది ఆ కన్నంలోనే నక్కి ఉంది.
        రెండో ఎలుక పరిస్థితి ఎలా ఉందో చూద్దామని మొదటి ఎలుక రోజూ ఆ పాత ఇంటి వద్దకు వచ్చి చూడసాగింది.
        అనుకున్నంతా అయింది.రెండో ఎలుక ఉన్న కన్నం గల గోడను పగుల గొట్టసాగారు. పగులగొట్టే పనివాడు కన్నంలో ఎలుక ఉన్నట్టు గమనించి కన్నం మీద గుణపంతో ఒక్క దెబ్బ వేశాడు.రెండో ఎలుక భయపడి పోయి,"అయ్యో, నా సహచరి మాట వినుంటే బాగుండేది!" అనుకుంటూ పారిపోవడంకోసం కన్నం బయటికి వచ్చింది.మరలా గుణపం దెబ్బ దాని తోక మీద పడింది తోక చిన్నముక్క తెగిపోయింది.
         పరుగున అది బయటికి వచ్చింది.ఎదురుకుండా రాళ్ళ మధ్య తన సహచర ఎలుక కనబడింది.
       "బతుకు జీవుడా" అనుకుంటా దాని దగ్గరకు వెళ్ళింది.
       "నీకు ప్రమాదం ముంచు కొస్తుందని నాకు తెలుసు.అందుకే నేను ఇక్కడ ఉండి పగుల గొట్టే ఇంటిని గమనిస్తున్నాను.నాతోరా,సురక్షితమైన కన్నం చూశాను,అక్కడ పిల్లులు కూడాలేవు.నీవు విశ్రాంతి తీసుకో నీ తోక గాయం మానుతుంది"అని ప్రేమగా చెప్పింది.
       దానిముందు చూపుకు సంతోషిస్తూ రెండో ఎలుక మొదటి ఎలుకను అనుసరించింది.