చమట చుక్క:- డా.. కందేపి రాణీప్రసాద్.

ఆయనేమో ఆఫీసులో బిజీ
పిల్లలేమో ర్యాంకుల పోరాటాల్లో కుస్తీ
ఇంట్లో ఎవ్వరూ ఉండరని
తన్నెవరూ పట్టించుకోరని
ఫిర్యాదు చేసే ఆడవాళ్ళు కోకొల్లలు!

లాక్ డౌన్ లో
సీన్ రివర్సయింది
భర్త హాల్లోనే టివి చూస్తున్నాడు
పిల్లలేమో ఇల్లు పీకి పందిరేస్తున్నారు
తనేమో
వంటింట్లో ఇరుక్కుపోయింది
వండుతూ, తోముతూ, కడుగుతూ!

పిల్లలతో దాగుడుమూతలు
అడుకోవలనుంది
మగనితో ముచ్చటగా
ముచ్చట్లడాలనుంది
కానీ
ఇవన్నీ తీరని కోరికలై
గుండెను మెలిపెట్టేస్తున్నాయి
మనసును మౌనంగా కోసేస్తున్నాయి!

కళ్ళెదురుగా ఉన్నా
కబుర్లాడలేక
అందేంత దూరంలో ఉన్నా
అందుకో లేక
ఎదురుగానే ఉన్నా
ఎగిరి గంతేయ్యలేక
దరి చేరలేక, దగ్గరగానే ఉన్నా
వంటపని అడ్డుగోడై నిల్చిన వైనం 
దేవుడు వరమిచ్చినా
పూజారి వరమియ్యనట్లుంది!

పని సుడిగుండంలో చిక్కి
ఆమె నలిగిపోతున్నది
చేతికి ఒక్క ఆధారమైన దొరక్క
ఆమె ఉబిలో కూరుకుపోతున్నది
ఆగని రంగుల రాట్నంలో
మారని బ్రతుకులా
ఆమె గిరగిర తిరుగుతున్నది

దేశమంతా లాక్ డౌన్ తో
ఇంట్లో బోర్ ఫీలౌతుంటే
ఉపిరి సలపని పనితో
ఉక్కిరి బిక్కిరౌతున్నది
ఇల్లాలు ఒక్కతే!
మనసికోల్లాసం
మాట దేవుడెరుగు
మంచి నిద్ర కూడా కరువే!

అంట్లు తోమకున్నా
అయ్యోపాపం అంటే చాలు!
బాత్ రూం కడగకున్నా
భార్య శ్రమ గుర్తిస్తే చాలు!
వంట చేయకపోయినా
వంకలు పెట్టకపోతే చాలు!
ఇల్లాలి పని పంచుకోనున్నా
ఇల్లాలి నుదుటి
చెమట చుక్క తుడిస్తే చాలు!