నయనాభిషేకం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 హృదయం ఆర్ద్రమై,
కళ్ళు వర్షించే బాష్పధార
మనసును తేలిక చేస్తుంది.
బాధలు,భయాలు,అశాంతులు
ముప్పేట దాడి చేసిన వేళ,
పాతాళ గంగాళం నుంచి
కన్నీళ్ళు కళ్ళను కడుగుతాయి.
అనంతమైన ఆవేదన చుట్టుముట్టి,
అయినవాళ్ళ అనాదరణ పరాకాష్ఠకు చేరిన సమయాన,
నయనాలు క్షాళితమై
అభిషేకాలు జరుగుతాయి.
నిరాశ నిండా ముంచినపుడు,
దగాపడ్డ మనిషికి తోడవుతాయి.
అంతులేని అబద్ధాల తాకిడికి,
గురైన పిడికెడంత మనసు చేసే
శబ్దాలే సన్నని నీటిపొరలై
ధారాళంగా స్రవిస్తాయి.
ఆవేశం,ఆర్తి జతగూడి,
జుగల్ బందీ చేస్తున్నప్పుడు,
కన్నీటి ధారలే లయరహితమై
వెల్లువలా జాలువారుతాయి.

కామెంట్‌లు