ఇళ్లవద్ద పళ్లచెట్లు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

   పిల్లలు విహారయాత్రకై అడవిలోకి వెళ్లారు. అడవినిండా చెట్లే.  ఆకు పచ్చటి  అందాలను కన్నార్పకుండా చూసారు. వాటిలో చాలా పండ్లచెట్లు ఉన్నాయి. చెట్లపై ఉన్న పండ్లను చూడగానే పిల్లలకు నోరూరింది. వాటికేసి ఆశగా చూశారు. చెట్లు పిల్లలవైపు చూసి "ఏమిటి అలా చూస్తున్నారు? మీరెప్పుడు మా పండ్లను తినలేదా?" అని అడిగాయి. "మీ పండ్లు  చాలా ఖరీదు.  మేము పేద పిల్లలం  వాటిని కొని తినటం మా వల్లకాదు. అందుకే ఆశగా చూస్తున్నాం" అన్నారు. చెట్లకు ఆశ్చర్యం వేసింది. "ఏమిటి? మా పండ్లను అమ్ముతారా? ఇక్కడనుండి ఉచితంగానే తీసుకువెళుతున్నారుగా?" అన్నాయి చెట్లు. మాములు రేట్లుకాదు. అదిరే పోయే ధరలు. మాలాంటి పేదపిల్లలు కొని తినే పరిస్థితే లేదు" అన్నారు. చెట్లకు అంతా అర్ధం అయింది. "అయితే ఓ పని చేయండి. మా విత్తనాలు మీ ఇంటి వద్ద నాటుకోండి. ఐదే ఐదేళ్లలో ఫలాలనిస్తాం. తిన్నన్ని తిని మిగిలినవి అమ్ముకోండి" అన్నాయి. చెట్లమాట పిల్లలకు నచ్చింది. విత్తనాలు తెచ్చుకున్నారు. ఇళ్లముందు, ఇళ్లప్రక్కనున్న ఖాళీ స్థలంలో నాటుకున్నారు. రోజు నీళ్లు పోశారు. ఇప్పుడు ఆ చెట్లు వారి ఇళ్లవద్ద లెక్కలేనన్ని పెరుగుతూ వున్నాయి. పండ్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. 
కామెంట్‌లు