కవి బాద్షా...మన జాషువా:-- మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

సీసమాలిక

వినుకొండ గ్రామాన వీరయ్య లింగమ్మ
పుణ్యదంపతులకు పుత్రుడితడు ,
గుఱ్ఱము జాషువా గుణములో మేటిగన్
కులముతో  ఛీత్కారఘోరమెంతొ ,
బాల్యము నుండియే  బాధలు దిగమ్రింగి
సాధించె కసితోడ చదువునెంతొ ,
విద్యా గరిష్ఠుడై విర్రవీగేటట్లు
కలము చేతనుబట్టి కవితలల్లె,
గబ్బిలమును జూసి ఘనముగన్ వివరించె
శివునికి తన బాధ శ్రేష్టముగను,
క్రీస్తు చరిత్రతో కీర్తినొందెను బాద్ష
ముంతాజు మహలుతో  మోదమొంది,
శారద మాతను సాహిత్యమం దునన్
దర్శింప జేసిన దార్శనికుడు,
కనకాభిషేకాలు గండపెండేరాలు
బిరుదులు వరదలు పేరు లెన్నొ.

తేటగీతి

కులము కాదుర పెద్దది గుణము గొప్ప,
కలము తోడ నిరూపించె ఘనుడు నితడు,
తెలుగు సాహిత్య సమరాన తేజరిల్లె,
భావి తరములకాదర్శ  భవ్వుడితడు.

కామెంట్‌లు