ప్రాధాన్యత:-ద్వారపురెడ్డి. జయరాం నాయుడు(టీచర్)కైకలూరు,కృష్ణా జిల్లా

 అది రామాపురం అనే గ్రామం ఇది ఒక మేజర్ పంచాయితీ . ఆదాయ వనరులకు కొదువ లేదు. ఆ గ్రామంలో నీటితో కళకళలాడే బావులు, చెరువులు, వాగులు ఉన్నాయి . పచ్చని పంట పొలాలతో చూడముచ్చటగా ఉండేది ఆ గ్రామం.
   5 సం||రాలకు ఒకసారి వచ్చే సర్పంచ్ ఎన్నికలు ఈసారీ వచ్చాయి. అభ్యర్డులు రకరకాల హామీలు ఇస్తున్నారు. ఒక సర్పంచ్ అభ్యర్థి ఇంటికో బోరు వేయిస్తాను, ఎకరానికో బోరు త్రవ్విస్తాను అని ఎన్నికల హామీ ఇచ్చాడు.మరొక అభ్యర్థి చెరువులు త్రవ్విస్తాను,చెక్ డ్యాములు కట్టిస్తాను,బంజరుభూముల్లో మొక్కలు నాటిస్తాను తద్వారా జలం స్థిరీకరించబడి ఇంకా ఎక్కువ పంటలు పండుతాయి మన ఊరు సుభిక్షంగా ఉంటుంది నాకే ఓటెయ్యండి అని అభ్యర్థిస్తున్నాడు.ఇంటికో బోరు అని వరాలు ఇచ్చిన అభ్యర్థి సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటికో బోరు, ఎకరం పొలానికి ఒక బోరు చొప్పున ఊరంతా వేయించాడు. ప్రజలు ఎంతో సంతోషించారు. నచ్చినపుడు నీరు లభిస్తుంది. పొలాల్లో రెండు పంటలు పండిస్తున్నారు.
   ఇలా ఓ పది సంవత్సరాలు బాగానే గడచి పోయాయి. తమ కాళ్ళదగ్గరే నీరు లభిస్తున్నందువలన నీటిని ఇష్టానుసారంగా వాడుకోవడం, వృధా చేయడం చేశారు.
     ఆ ఊరి చుట్టూ ఉన్న చెరువులు బాగు చేయకుండా వదిలి వేశారు. వాగులు, ఏరులు లోని నీరును అడ్డుకట్టలు వేయకుండా వృధాగా వదిలేశారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. 20 అడుగుల్లో లభించే నీరు 400 అడుగులు వరకు వెళ్ళినా నీరు దొరకని పరిస్థితి నెలకొంది. క్రమక్రమంగా ఆ ఊరికి నీరు అందని పరిస్తితి వచ్చి కరువు బారిన పడి ఊరిలో బ్రతకలేక చాలామంది బ్రతుకు తెరువు కోసం ఊరు వదలి పోవలసి వచ్చింది.
ప్రకృతి వనరులను ప్రాధాన్యత క్రమంలో ఉపయోగించకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది.
      ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో వనరులను పెంచి పంచిన వారినే గెలిపించి మన ఊరి అభివృద్ధికి బాటలు  వేసుకుందాము అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు.
   అందుకే పెద్దలు అన్నారు"కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి అని".