సాధారణంగా ప్రతి ప్రభుత్వ, లేదా ప్రైవేట్ ఉద్యోగి తను పనిచేస్తున్న వ్యవస్థ రూపొందించిన నియమావలళికి కట్టుబడి పని చేయవలసి ఉంటుంది . కానీ ప్రజా సంబంధాల తో ముడిపడి ఉన్న రైల్వే వ్యవస్థలో నిక్కచ్చిగా పాటించడం బహు దుర్లభము. అన్ని వేళలా అలా పాటించటం ఏ వ్యక్తికి వీలు కాదు .పరిస్థితులను బట్టి కొన్ని పనులు వీటికి వ్యతిరేకంగా చేయవలసి ఉంటుంది . అలాగే కొన్ని చేయగలిగే పనులను కూడా ఆ సమయంలో ఉన్న పరిస్థితులను బట్టి లేదా అవగాహన రాహిత్యంతో చేయలేకపోవచ్చు.
అది 1992 వ సంవత్సరము. నేను అప్పుడు అమీర్ పేట రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో ,కౌంటర్ క్లర్క్ గా పని చేస్తున్న రోజులు. అప్పుడప్పుడే రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ కంప్యూటరైజ్డ్ అవుతుంది. అప్పటికి ఇంకా ఇంటర్నెట్ లో టికెట్లు పొందే సదుపాయం లేదు. అమీర్ పేట లో నాలుగు కౌంటర్లలో కూడా ఎప్పుడు కనీసం పది పన్నెండు మంది లైన్ లో ఉండే వారు. సిటీలో అక్కడక్కడా రిజర్వేషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం వల్ల స్టాప్ సర్దుబాటు వీలుకాక .చాలామంది డబుల్ డ్యూటీ అంటే ఓవర్ టైం చేయవలసిన అవసరం ఉండేది. నేను ఒక రోజు డబుల్ డ్యూటీ చేస్తున్న టైంలో, అంటే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 8 గంటల వరకు. 2 నుండి 2:15 వరకు ఉదయము క్యాష్ క్లోజ్ చేసి, క్యాషియర్ కి అప్పచెప్పి ,మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి రెండు గంటల 15 నిమిషాలకు కౌంటర్ ఓపెన్ చేయాలి. కరెక్ట్ గా రెండు గంటలకు ఒక నిమిషం ముందుగా ఒక పాసింజరు నాకు 2 ఫార్మ్స్ ఇచ్చి ఒకటి క్యాన్సిలేషన్ కి ,రెండవది బుకింగ్ కి అని చెప్పడంతో వాటిని కంప్లీట్ చేసి నేను క్లోజ్ బోర్డు పెట్టడానికి సమాయత్తమవుతుంటే, అతను తిరిగి మరో 2 ఫార్మ్స్ఇచ్చి వీటిని కూడా డీల్ చేయమన్నాడు. నేను అతనితో రెండు మాత్రమే తీసుకుంటాను, ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి, తిరిగి కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత మీ పని కంప్లీట్ చేస్తాను, అని చెప్పి ,నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ వెంటనే ఆ పాసింజరు లోపలికి షిఫ్ట్ సూపర్వైజర్ దగ్గరికి వచ్చి తను ఒక ట్రైనీ IRTS ఆఫీసర్ అని ,నేను అతన్ని తిరస్కరించిన విషయం చెప్పి, తన పని చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సూపర్వైజర్ నా దగ్గరికి వచ్చి ఆయన IRTS ఆఫీసరు. మీరు ఎందుకు కాదన్నారు అని అడిగారు .దానికి నేను వెంటనే అయితే కానివ్వండి( so what )ఆయనకు 2 forms ఇచ్చాను , నాలుగు ఇవ్వము కదా ! అన్నాను .తిరిగి ఆ సూపర్వైజర్ అప్పుడే ఓపెన్ చేసిన కౌంటర్ దగ్గరికి వెళ్లి ,ఆఫీసర్ యొక్క టికెట్లు ఇప్పించి పంపించడం జరిగింది(.As per railway rules only one or two forms per head at once).
మరుసటి రోజు నాకు మా రైల్వే అకౌంట్స ఆఫీస్ నుండి ఒక తెలిసిన ఆడిట్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, ఆ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీస్లో మూడు నెలల ట్రైనింగ్ గురించి వచ్చారని, నిన్నటి రోజు జరిగిన సంఘటన గురించి నన్ను ఆఫీసుకు వచ్చి కలవమని చెప్పారని . కానీ నేను ఆ ఇన్స్పెక్టర్తో నేనేమీ తప్పు చేయలేదు, అయినా వీలైతే తరువాత కలుస్తాను అని చెప్పాను. నేను రెండు మూడు రోజుల వరకు ఆఫీస్ కి వెళ్ళలేదు ,ఆయన్ని కలవలేదు. ఇక నాలుగవ రోజు నుండి ఈ ఆడిట్ ఇన్స్పెక్టర్లు మరియు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మా అమీర్పేట చెకింగ్ చేయడానికి వచ్చారు. ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి ఆ మూడు నెలల్లోనే ఆరు సార్లు ముఖ్యంగా నా కౌంటర్ చెక్ చేయడం జరిగింది. వాళ్లకు ఎటువంటి అవకతవకలు కనిపించలేదు. తిరిగి నాకు పరిచయమున్న ఆడిట్ ఇన్స్పెక్టరు వెళుతూ వెళుతూ ఆ ఆఫీసర్ నన్ను టార్గెట్ చేశాడని చెప్పాడు. ఈ కథని ఇక్కడ కట్ చేస్తే......
దాని తర్వాత 2015 సంవత్సరంలో నేను సూపర్వైజర్ ప్రమోషన్ మీద నాంపల్లి కి బదిలీ కావడం జరిగింది. ఆ స్టేషన్ లో ఉన్నటువంటి నియమాల ప్రకారం సూపర్వైజర్ కూడా అప్పుడప్పుడు కౌంటర్లో పని చేయవలసి వచ్చేది. ఒక రోజు నేను ఇలాగే కౌంటర్ లో పనిచేసే టైంలో విజిలెన్స్ చెక్లో నా కౌంటర్ చెక్ చేయడం జరిగింది. నా క్యాస్ కరెక్టుగా టాలీ అయినది. కానీ ఒక స్పెషల్ క్యాన్సిలేషన్ టికెట్ పైన సూపర్వైజర్ ఎండార్స్మెంట్ లేదు. నేను కూడా సూపర్వైజర్ గ్రేడ్ లో ఉన్నాను కాబట్టి ,తిరిగి మరొక సూపర్వైజర్ తో సంతకం చేయ వలసిన అవసరం లేదు... అనే ఆలోచనతో సంతకం చేయించుకోలేదు. ఆ విషయము వారితో చెప్పినప్పటికీ వారు దానికి వ్యతిరేకించి నాతో స్టేట్మెంట్ తీసుకుని, ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరిగింది .మూడురోజుల తరువాత నాకు విజిలెన్స్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ రావడం, అందులో నేను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని చూడవలెనని. నేను మరుసటి రోజు లెటర్ తీసుకొని ఆయనను చూడడానికి వెళ్లాను. నన్ను ఏ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అయితే చెక్ చేశాడో ఆయనను కలిశాను .అతను నన్ను ఆ ఆఫీసర్ ఛాంబర్ దగ్గర బయట నిలబెట్టి తను లోపలికి వెళ్ళాడు. 30 నిమిషాల వరకు లోపలికి పిలువలేదు. తరవాత లోపలికి పిలిస్తే ఆఫీసర్ దగ్గరకు వెళ్లి నిల్చున్నాను. ఆయన నన్ను గమనించకుండా తను ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకొక పది నిమిషాలు అలాగే నిలబెట్టారు. తిరిగి నన్ను పైకి కిందకు చూసి నీ పేరు రామకృష్ణ రెడ్డి కదా, నీకు చాలా పొగరు, అంటూ 1992లో జరిగిన సంఘటన గుర్తు చేశాడు. ఆయనే నాకు ఆ రోజు తటస్థించిన ట్రైనీ IRTS ఆఫీసర్ .ఇన్ని సంవత్సరాలు ఆయన ఆల్ ఇండియా లెవెల్ లో ఎన్నో విభాగాల్లో అధిపతిగా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ,నన్ను గుర్తుంచుకొని ఆఫీసుకు పిలిపించడం జరిగింది. ఈ టికెట్ పైన సూపర్వైజర్ సంతకం లేనందుకు నన్ను Parli లేదా బెల్లంపల్లి కి ట్రాన్స్ఫర్ చేయమని ఇన్స్పెక్టర్ తో చెప్పడం ,నేను దానికి సారీ సార్ అని మాత్రమే సమాధానం చెప్పడం, తిరిగి ఆయనే రూల్స్ అంత కరెక్ట్ గా పాటిస్తున్నావా? "ఓకే కీప్ ఇట్ అప్" అంటూ నన్ను పంపించేశారు. తర్వాత నాకు ఎటువంటి పనిష్మెంటు రాలేదు. తర్వాత అదే సంవత్సరంలో రైల్వే వీక్ అవార్డ్స్ లో ఆ ఆఫీసర్ చేతులమీదుగానే బెస్ట్ వర్కర్ గా నేను అవార్డు తీసుకోవడం ఎంతో గౌరవంగా భావించాను.
కనుక ఎవరైనా ఒక నియమావళికి లోబడి పనిచేస్తున్నప్పుడు ,ఇటువంటి సమస్యలు రావడం సర్వ సాధారణమే అయినప్పటికీ , అటువంటి సమస్యలకు కలవరపడకుండా ఎదురు నిలవటం కత్తి మీద సాము లాంటిదే. ఇటువంటి విధానాన్ని తాత్కాలికంగా వ్యతిరేకించిన అధికారి ఎన్నో సంవత్సరాల తర్వాత మా పైఅధికారిగా రావటం, నేను అవలంబించిన విధానాన్ని మెచ్చుకుని ఆయన చేతుల మీదుగానే గౌరవం పొందటం ,మరువలేని సంఘటన.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి