వాళ్లిద్దరూ ..అలావెళ్లిపోయారు ..!!:--------శీరంశెట్టి కాంతరావు రచయిత పాల్వంచ .

 మర్రిచెట్టులో జువ్విచెట్టులా అమ్మానాన్న లిద్దరూ  
ఒకే వృక్షంగామారి  మాకో
చల్లని ఛత్రమై నిల్చారు మనుషులుగా మమ్ముల్ని నిలబెట్టడానికి ఏండ్ల కొద్దీ శ్రమించారు
నాన్న యవ్వనమంతా మోటలు కొట్టీ కొట్టి తొండం పగిలిన బొక్కెనై పోయాడు 
ఏ పంట పెట్టినా 
అప్పుల కుప్పలై పుట్టి వడ్డీలు,నాగులు రూపమెత్తి కాల్జేతులను కట్టిపడేసేవి
వాటిని తెగ తెంచేటందుకు    భూమిని తెగనమ్మడమొక్కటే 
ప్రత్యామ్నమై ఎదురొచ్చేది అటువంటి
ప్రతిసందర్భంలోనూ
అమ్మ కళ్ళు ముసురుపట్టి
వారాలు నెలలు
వర్షించి, వర్షించి వట్టిపోయేవి
ఎప్పుడూ వర్తమానంలోనే జీవించే నాన్నకు 
భవిష్యత్ ను విప్పిచెప్పిన
అమ్మ మాటన అనుసరించి కుటుంబం వలసబాట పట్టింది
కానని రాజ్యంలో 
నలుగురికి అన్నం పెట్టిన రైతులు కూలీలుగా మారి  దినబత్తెంతో  బతుకు పుస్తకపు పుటలను భారంగా తిప్పెయ్య సాగారు    
మా ఆరుగురు సంతానంలో 
ఒక్క చెల్లి తప్ప అన్నదమ్ములైదుగురం  మోదుగులున్న చేను మగపిల్లలున్న ఇల్లూ చెడిపోవన్న సామెతను తుంగలో తొక్కుతూ ఊరిమిది సమస్యల ఉరితాళ్ళను ఇంటిమీదికి తేవడం అలవాటు చేసుకున్నాము
అమ్మానాన్నల పంచప్రాణాలను ఆవకాయల నంజుకుతిన్నాము
ఆఖరి నూనె బొట్టువరకూ
వెలుగునిచ్చే ప్రమిదలా 
మా జీవితాల్ని వెలిగించాలని ఆఖరి క్షణాలవరకూ రెపరెపలాడిన అమ్మ    
కొడిగట్టిన వత్తిలా మలిగిపోయింది 
దీపంలేని ఇంటిలో జీవం వుండనొల్లదన్నట్టు 
ఏడాది తిరక్కముందే 
అమ్మను వెతుక్కుంటూ ...
నాన్నా వెళ్ళిపోయాడు 
చేతులు కాలేపోయాయి
ఇప్పుడు మేమెన్ని ఆకులు పట్టుకుంటే మాత్రం
ఏమిటి లాభం?

కామెంట్‌లు