దుష్టుడితో స్నేహం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 అడవిలోని మడుగులో ఓ కప్ప ఉండేది. అది చాలా మంచిది.  ఎవరి జోలికి వెల్లదు. దానిపని అది చేసుకుంటూ ఉండేది. దాని ఒడ్డునే  ఓ తేలు నివాసం ఉండేది. అది మంచిది కాదు.  చీటికీమాటికి  అకారణంగా అందరితో గొడవపెట్టుకునేది. ఏమన్నా అంటే తన కొండితో  కుట్టేది.  వారు నొప్పితో విలవిలలాడుతుంటే చూస్తూ ఆనందించేది.
      ఎలా కుదిరిందోగాని ఈమధ్య కప్ప, తేలు స్నేహంగా ఉండ సాగాయి. నీటిలోని చేపలు దుష్టుడితో స్నేహం వద్దని  అనేక సార్లు వారించాయి. వాటి మాటలు కప్ప పెడచెవిన పెట్టింది. అవి రెండూ కుశాలుగా కులుకుతూ తిరగ సాగాయి. తేలు అడవిలోని వింతలు చెబితే, కప్ప నీటిలోని విశేషాలు వివరించేది.  వీటి స్నేహం చూసేవారికి  కన్ను కుట్టేది. ఈర్ష్య పుట్టేది. ఇలా కొన్నాళ్లు గడిచింది.  అలా అన్యోన్యంగా వుండే ఆ రెంటి మధ్య ఎందుకో  గొడవ వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయింది.  తప్పంతా తేలుదే. అయినా కప్ప సర్దుకుపోయింది. తేలు ఊరుకుంటేనా? తన కొండితో బలంగా కుట్టింది.  కప్ప విలవిలలాడింది. అందుకే దుష్టుడికి దూరంగా ఉండాలి.  ఎట్టి పరిస్థితులలో కూడా  స్నేహం చేయకూడదు అని పెద్దలు చెబుతూ వుంటారు.