పట్టాభిషేకం....!!:-శీరంశెట్టి కాంతరావు రచయితపాల్వంచ .

 రాత్రి కురిసిన వర్షానికి 
ప్రకృతంతా పరిశుద్ధస్నానంచేసి 
నవనవోన్మేషంతో కనువిందు
చేస్తుంది
నేను మొదటిసారి నాగలి కోటేరేసుకుని నారుమడి దున్నడానికి బయలుదేరు  తుంటే
మా చెల్లి ఎదురొచ్చింది,
మమ్ముల్ని చూస్తున్న అమ్మ కళ్ళల్లో అలవిగాని ఆనందం
జాలువారసాగింది
కోటేరు మాపొలం డొంక తిరిగింది, రెండువైపులావున్న
దిరిశనాంగనలు తమ కొమ్మల కరాలనెత్తి నాకు ఛత్రచామరాలను పట్టాయి
సున్నితమైన పూరేకులకు
తమపై నిల్చివున్న వర్ష బింధువుల జతజేసిన అక్షతలను నాపైన వర్షించాయి
ఆ స్వాగతాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ ముకుళిత హస్తాలతో ముందుకుసాగి
నెమ్మదిగా పారుతున్న 
వాగులో దిగాను
అంతే..
జిలజిల్లాడుతూ నాపాదలను  చుట్టుముట్టిన చేపపిల్లలు  వృత్తాల్లాంటి తమ చిన్ని నోళ్ళను అర తెరచి స్పర్శిస్తుంటే జీవితంలో ఎన్నడు ఎరుగని సున్నితమైన మైకం ఏదో నాతనువులోని అణువణువునా పులకింతలు
రేపింది.
వాగు దాటి ఒడ్డెక్కానో లేదో 
పెద్దీత గింజలంత వందల వేల చిరుకప్పలు స్వాగతం పలుకుతూ పక్కకు జరిగి గౌరవంగా దారి చూపసాగాయి
ఆకుపచ్చ తివాచీ కప్పుకున్న పుడమితల్లి మాగాణం వంటిమీద గుంపులు దీరిన కొంగలు తీగ‌లుసాగిన వెన్నముద్దల్లా లేచి నాతలమీద ప్రదక్షిణలు చేయసాగాయి
హఠాత్తుగా కోటేరు కిందవున్న ఎద్ధుల జత ముందరికాళ్ళతో భూమాత గుండెల్ని మురిపంగా  రాకుతూ రంకెలు వెయ్యసాగాయి మెల్లగా
నేను నారు మడిని చేరుకున్నాను నాకోసమే వేచివున్న నాన్న నెమ్మదిగా పక్కకు తప్పుకున్నాడు
నేను నాగలి పన్నుగడవేసి
ఎడమచేత మేడిని కుడిచేత ములుగర్రనూ పట్టి         మొదటి కోండ్ర వేశాను
దూరంగా కొండమీది దేవలంలో మ్రోగిన జేగంటానాదాన్ని నాదాకా మోసుకొనివచ్చిన  పిల్లవాయులు ఉత్తరంగా
సాగిపోయాయి ప్రకృతి సాక్షిగా నాకు వారసత్వ పట్టాభిషేకం పాక్షికంగా జరిగిపోయింది.