బడాయికోతి (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 అడవిలో ఓ కుర్రకోతి ఉండేది. అది బలే బడాయిది. అన్ని తనకే తెలుసన్నట్టు విర్ర వీగేది. లేని గొప్పలు చెప్పుకుంటూ కాలం గడిపేది.  కొత్తవారు నిజమే అనుకుని నమ్మేవారు. తెలిసినవారు   'దాని అలవాటే  అది'  అనుకుని నవ్వుకునేవారు. ఓ సారి అత్తగారి వూరు వెళ్ళింది. అక్కడ గొప్పలు చెప్పుకుంది. తానొక గజ ఈతగాడు అయినట్టు, ఎన్నో ఈతపోటీలలో గెలిచినట్టు చెప్పుకుంది. అసలు దానికి ఈతే రాదు. 
       ఇదిలా ఉండగా ఓ రోజు రాణిగారు స్నానం చేస్తుంటే ఆమె పెళ్లి ఉంగరం జారీ నదిలో పడింది. తీసేవారే లేరు. కుర్రకోతి గజ ఈతగాడు అనేసంగతి ఎవరో రాజు చెవిన వేశారు. కుర్రకోతిని పిలిపించారు. వందవరహాలు ఇస్తాం. ఉంగరం తీయమన్నారు. ఈతరాని కుర్రకోతి వెర్రి చూపులు  చూసింది. ఎవరికి చెప్పకుండా పరుగందుకుంది. భటులు వెంటబడ్డారు. వారికి దొరకకుండా తప్పించుకోగలదా? వారు పట్టుకున్నారు. బలవంతంగా నీళ్లలోకి తోసేశారు. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంది.   ఈత రాదని గ్రహించిన ఎవరో దాన్ని  ఒడ్డుకు చేర్చారు. గొప్పలు చెబితే ఇలాగే ఉంటుంది. కుర్రకోతికి బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఎవరికి కనిపించలేదు. 
కామెంట్‌లు