ఎడారి బాటలో నోరు:-- యామిజాల జగదీశ్

 అదేంటో
వయస్సయితే ఎడాదికేడాది
పెరుగుతోంది కానీ
జ్ఞానం మాత్రం 
అంతకంతకూ తరిగిపోతోంది
ఏమై ఉంటుందాని అద్దంలో 
చూసుకుంటే 
ఎప్పుడొచ్చాయో
ఎప్పుడూడాయో తెలీకుండానే
జ్ఞానదంతాలు రాలిపోతూ పోతూ
దాదాపు సగానికిపైగా
మిగిలిన దంతాలనూ తమతో
తీసుకుపోయాయి
బోసినవ్వులో పడ్డానిప్పుడు
నిండుగా నవ్వుదామంటే
పళ్ళుంటేగా
కనుక నవ్వూగివ్వూ సన్నగిల్లాయి
మిగిలిన పన్నెండు పళ్ళూ 
ఎప్పుడూడుతాయో తెలీడం లేదు
పళ్ళూడటంలో
నాకు మా అమ్మ వారసత్వమొచ్చింది
ఎలాగంటే
మా నాన్నకు ఒకటి రెండుతప్ప మిగిలిన దంతాలన్నీ గట్టిగానే ఉంటే
మా అమ్మకు మాత్రం పళ్ళన్నీ ఊడిపోవడం 
ఎరుగుదును
నేనూ ఆ దిశలోనే అడుగులేస్తున్నా
అమ్మకున్న పెట్టే గుణం రాలేదు కానీ
పళ్ళూడిపోవడంలో 
అమ్మ పోలికలొచ్చాయి నాకు
పగలబడి నవ్వడం మానేశాను
నోరంతా ఎడారవుతుండటంతో
కరకరలేవీ తినలేని స్థితికొచ్చేశాను
పళ్ళూడిపోతుండటంతో.....

కామెంట్‌లు