పసిడి కాంతుల దివ్వెలు మా పిల్లలు:-త్రిపురారి పద్మ జనగామ.
నా ఒడిలో పసిపాపలై విరిసిన నవ్వులు
నా ఎదలో పసిడి కాంతులై పెరిగిన దివ్వెలు


నా అడుగులో అడుగులైన బుడుగులు
నా అడుగులోని బలమే వారైన పిడుగులు


నాలోని ఊపిరికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు
నా ఊపిరే వారైన వాయులీనాలు

నా ప్రాణమే ప్రేమైన సుగుణాలు
నా లోకమే వారైన రవితేజాలు

నా రూపానికి ప్రతిరూపాలైన దీపాలు
నా ఆశల ఆశయాలకు మార్గాలు

నా ఆశల పల్లకినెత్తిన బోయీలు
నా పాటల పల్లవికి చరణాలు

నా లక్ష్యాల నావకు చుక్కానీలు
నా లక్షణమైన జీవితానికి సారథులు.

నా హృదయ తరంగ రవళీ సుధలు
నా హృది నిండిన వెన్నెల జిలుగులు

నా గాయాల గేయాలకు ఔషధ పదములు
నా భావాల విరులకు తేనియ ధారలు

నా ఆలోచనాలోచనా సులోచనాలు
నా ఆచరణాచరణా పథ లహరులు

నా అణువణువున నిండిన సిరులు
నా కణకణమున పారిన ప్రేమ ఝరులు


నాలోని అమ్మతనమే అమృతమయిన పిల్లలు
నా జీవిత పయనానికి దైవమిచ్చిన వరములు


మా కంటిపాపలై మెరిసిన పిల్లలే,మా జీవిత సౌధాలు
మా ఇంటి జ్యోతులై వెలిగిన పిల్లలే,మా జీవన కిరణాలు.


           

కామెంట్‌లు