పాపాయి:- సత్యవాణి

 పాపాయి కలిగింది మాయింట
పంచేము చక్కెరపోళీలను
పాపను చూడగ పరిశుభ్రతతో 
రారండంటూ పదవరోజున పంచేము చిక్కసం
ఊయల పండుగ చేతము 
రమ్మని ఉత్సవాన్ని జరిపించాము
బాలసారె మహోత్సవాన్ని
బహుబాగా జరిపించాము
గుప్పిళ్ళిప్పెను పాపాయంటూ 
ముద్దకుడుమలను పంచాము
నవ్విందమ్మా పాపాయంటూ
నువ్వుండలనూ పంచేము
బోర్లపడినది పాపాయంటూ
బొబ్బట్లను పంచాము
కూర్చుంది పాపాయి
బెల్లం కుందులు పంచేము
అన్నము ముట్టెను
పాపాయంటూ
వెన్నుండలనూ పంచేము
అడుగులు వేసెను
 పాపాయంటూ అరిసెలు దండిగ పంచాము
పలికిందమ్మా పాపాయయంటూ
పంచదార చిలుకలు పంచాము
పాటలు పాడెను పాపాయంటూ
పరమాన్నమునే పంచాము
బడికి వెళ్ళెను పాపాయంటూ
పలకలు కనికలు పంచాము
పాపలు కలిగిన యే యిల్లైనా
ప్రతిదినమూ పండగదినమేలే
పాపాయిలు నడయాడే యింటను
పరమాత్ముడు కొలువుండునులే