తులసీదళం:-తోపుడుబండి సాదిక్ & టీమ్

 జనారణ్యంలో తులసి మొక్క లాంటివాడు ఆ బుడ్డోడు.కేవలం తొమ్మిదంటే తొమ్మిదేళ్ల వయసు.నిన్నూ, నన్నూ ఆ మాటకొస్తే సృష్టిలోని ప్రతీప్రాణి నీ ప్రేమిస్తాడు.సమస్త భూమండలం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడు.తాపమెక్కి భగభగ లాడుతున్న భూమాత తాపాన్ని తగ్గించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. మొక్కలు పెంచుతాడు,చెట్లను ,పిట్టలను ప్రేమిస్తాడు.అనాధలు,అభాగ్యులంటే వల్లమాలిన ప్రేమ.తనలాగే తన తోటివారు కూడా చదువుకోవాలనే ఆశ పడుతుంటాడు. తనకు చేతనైన సాయం చేస్తాడు.నిధులు సమీకరిస్తాడు.అలాగని ఎవరినీ చెయ్యిచాచి అడగడు. తనదైన వినూత్న పంథాలో చేస్తాడు.
  చిన్న చిన్న కప్పుల్లో మట్టిపోసి అందులో తులసి మొక్కలు పెంచుతాడు.అమెరికాలో ఉన్నాడు కదా అక్కడ ఒక్కో మొక్కను ఒక్కో డాలర్ కు అమ్ముతాడు.అలా 100 మొక్కలు అమ్మి 100 డాలర్లు సంపాదించాడు.వాటిని మన మిత్రుడు గౌతమ్ కు పంపాడు.తన ద్వారా ఒక ఫోన్ కొనిపించి తోపుడుబండికి పంపించాడు.
  గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల కోసం మనం ఫోన్లు ఇస్తున్నాం కదా.మనదగ్గర వందలాది దరఖాస్తులు వచ్చిఉన్నాయి. వాటిలోంచి నందిని అనే విద్యార్థినికి ఈ ఫోన్ బహుకరించాం.ఆ పాప చాలా సంతోషించింది.
ఇంతకూ ఆ తులసిమొక్క లాంటి బుడ్డోడి పేరు చెప్పలేదు కదూ....హన్స్ బజ్జురి. (Hans Bajjuri)
లవ్యూ బేటా.కారు చీకట్లో కాంతి రేఖవు నువ్వు.కృష్ణ పరమాత్ముడి తులాభారంలో తులసీదళానివి నువ్వు.
ప్రేమ,ఆశీస్సులతో