తమిళ కవి వైరముత్తు రాసిన కవితా పుస్తకాలలో "ఇంద పూక్కల్ విర్పనైక్కల్ల" (ఈ పువ్వులు అమ్మకానికి కావు) అనేది అపూర్వమైనది!!
అందులో నించి "పుస్తక పురాణం" అనే శీర్షికతో ఆయన ఓమారు పుస్తకాలపై కవితను ఆలపించారు....
ఆ కవితకు నా స్వేచ్ఛానువాదం...
ప్రాణానికి శ్వాస కదూ పుస్తకం?
నీలో ఒక సూర్యుడు కదూ పుస్తకం?
అమృతం కదూ పుస్తకం?
నీకు వరమివ్వడానికి ఎవరో
చేసిన తపస్సు కదూ పుస్తకం?
పుస్తకాల గొప్పతనం గురించి
అనేకమంది మేధావులు
ప్రశంసించి మాట్లాడారు.....!!
"చదువుతున్న ప్రతిసారీ
ఆ పుస్తకాలేవో చెప్పండి
రాసిన వ్యక్తి
ఎలాంటి వాడో చెప్తానన్నాడు"
బెర్నార్డ్ షా.....!!
"ఉద్యమ బాటలో
చేతి తుపాకుల కన్నా
పెను ఆయుధాలు పుస్తకాలు"
అన్నాడు లెనిన్!!
చదవడానికి ఓ క్రమం చెప్పిన
ఇంగ్లీషు మేధావి ఫ్రాన్సిస్ బేకన్
చెప్పాడిలా.....
"కొన్ని పుస్తకాలను ఆస్వాదిస్తాం!
కొన్నింటినట్లాగే మింగేస్తాం!
కొన్ని పుస్తకాలను నమిలి జీర్ణిస్తాం!"
అమెరికాలో
నీగ్రోలు
నల్లజాతీయులు
సంతలో పశువుల్లా
డబ్బుకు అమ్ముడవటం చూసి
మనసు మరిగి
అబ్రహాం లింకన్
దేశాధ్యక్షుడయ్యాక
ఆ విధానాన్ని నిర్మూలించారు!!
నీగ్రోలకు మద్దతుగా
వారి వేదనను అర్థం చేసుకుని
హారియెట్ బీచర్ స్టోవ్ అనే రచయిత్రి
రాసిన నవలే “Uncle Tom’s Cabin” !
బానిసత్వాన్ని రూపుమాపిన
అబ్రహాం లింకన్
ఆ రచయిత్రిని కలిసి మనసారా
కొనియాడారు!!
ఇదే కదా
పుస్తకం శక్తి అంటే!
ఇరవై మూడేళ్ళలోనే
విడుదల కోసం
ఉరితాడుకు ముద్దిచ్చారు
మహావీరుడు భగత్ సింగ్!!
ఆయన రాసిన
"నేనెందుకు నాస్తికుడినయ్యాను"
అనే పుస్తకం
మన భారతదేశంలో
ఉద్యమానికి బీజం వేసింది!!
భగత్ సింగ్ పుస్తకాన్ని
అనువదించి ఆవిష్కరించిన
జీవానందం ఆరు నెలల జైలుశిక్ష
అనుభవించారు
లాహోర్ కుట్ర కేసులో
ఇంగ్లీష్ న్యాయస్థానం
భగత్ సింగుకి
ఉరిశిక్ష విధించింది
జైలు అధికారి
ఉరితీయడానికి తీసుకుపోవడానికి
వచ్చినప్పుడు
భగత్ సింగ్
"లెనిన్ చరిత్ర"ను చదువుతున్నాడు.
జైలు అధికారితో భగత్ సింగ్
"నేను విప్లవవాదిని!
మరొక విప్లవనేతతో చర్చిస్తున్నాను.
కాస్త ఓపిక పట్టు" అన్నాడు!
కనుక
పుస్తకాలను
ప్రేమిద్దాం!!
పుస్తకాలను
పఠిద్దాం!!



addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి