ఆ రోజు ....: శ్యామ్ కుమార్ >నిజామాబాద్

 వివాహం జరిపించడానికి ఆ రోజు కార్యక్రమానికి ఎంతోమంది కృషి చేస్తే కానీ అది  పూర్తి కాదు. ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్ట పడ్డా కూడా ఆ రోజు  ఏవో కొన్ని లోపాలు కనిపించడం,  వచ్చిన వారిలో అతి ముఖ్య అతిధులు చిరాకు పడడం , అలకపాన్పు ఎక్కడం కూడా చూస్తూ ఉంటాం.  సౌకర్యాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర తప్పులు జరిగి  లోటుపాట్లు కనిపించడం  సర్వసాధారణమే!!
వివాహానికి హాజరయ్యే మిత్రులు అతిధులు బంధువులు తలా ఒక పని చేస్తూ వారికి తోచిన విధంగా సంతోషంగా  గడపడానికి ప్రయత్నిస్తుంటారు.  కొందరేమో వారి వ్యక్తిగత  అభిరుచులకు తగ్గట్టుగా  భోజన సౌకర్యాలను కూడా పట్టుబట్టి చేయించుకుంటారు.
 ఆ   సమయంలో తప్పనిసరిగా కొన్ని ఎప్పటికీ గుర్తు వుండి పోయే  విచిత్రమైన  సన్నివేశాలు జరిగిపోతుంటాయి. ఆ విధమైన కొన్ని   సంఘటన లు, పల్లెటూరు , పట్నం రెండిటికీ చెందని భువనగిరి అనే ఒక చిన్న ఊరిలో నా స్నేహితుడు  సిద్దుల ఆంజనేయులు పెళ్లిలో  జరిగాయి.  ముఖ్యంగా పెళ్ళికొడుకు పడిన బాధలు అంతా ఇంతా కాదు.
ఆంజనేయులు నా చిన్ననాటి స్నేహితుడు.  భువనగిరి లో నాకు  ఉన్న స్నేహితుల్లో ఆంజనేయులు అతి ముఖ్యుడు. చిలిపి చేష్టలకు ఇద్దరం సమవుజ్జీలం!  పొలాల గట్ల వెంబడి నడుచుకుంటూ చెరువుకి దగ్గర దారిలో వెళ్ళేవాళ్ళం.  తిరిగి వస్తున్నప్పుడు చింత చెట్టు దగ్గర ఎవరూ కాపలా లేకుంటే రాళ్లతో కొట్టి  ఆ పడిన కాయలు తీసుకొని అవి తినుకుంటూ  వాటిల్లో  పులుపును   బలవంతంగా ఆనందిస్తూ వచ్చేవాళ్ళం.
 మేము చదువుకున్న రోజుల్లో, చిన్నప్పుడు , మా ఊరు చాలా పెద్దగా, రోడ్లు విశాలంగా,  ఇళ్లు చాలా పెద్దగా కనిపించేవి.  ఇప్పుడు వెళ్ళి చూస్తే రోడ్లన్నీ ఇరుకుగా ,తీసుకెళ్లిన  కార్ ను ఒక పక్కగా పెట్టుకోడానికి కూడా వీలు ఉండదు.ఇక అసలు విషయానికి వ స్తే....
 తన వివాహానికి సరి అయిన అమ్మాయి గురించి ఆంజనేయులు ఎక్కడెక్కడో    వెతికాడు  కానీ ఒక పట్టాన కుదరలేదు.   
 ఎక్కడెక్కడ తిరిగినా దొరకని అమ్మాయి ఆఖరికి వారి ఇంటి ముందు పక్క సందులో ఉన్న పద్మ అనే అమ్మాయితో వివాహం కుదిరింది.  వాడితో కలిసి చదువుకున్న మేము అందరం వారి వివాహానికి కాస్త ముందుగా వెళ్లి అన్ని పనులలో పాలు పంచుకోవడం మొదలుపెట్టాం,ముఖ్యంగా    హరినాథ్ ,మోహన్, బాలకృష్ణ ,రవి, ప్రభాకర్, వెంకట్.   ఇంటి ముందు పందిరి, ఆ రోజుల్లో  వెదురు తడకలతో వేసేవారు.  వాటిపైన తాటి ఆకులు కప్పే వాళ్ళం. దాని తర్వాత చుట్టూత మామిడి తోరణాలు కట్టడం మా వంతు అయ్యింది.  సన్నటి రంగు రంగుల కాగితాలు తెచ్చి  రకరకాల డిజైన్లు కట్ చేసి వాటిని వెదురుబొంగుల కి    ఉడకబెట్టిన  పిండితో  అతికించాము. 
 వాడికి కాబోయే భార్య మాకు ముందుగానే తెలిసినా కూడా ఆరోజు మా స్నేహితులందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి చూసి వచ్చాము. అమ్మాయి పేరు పద్మ చూడ్డానికి చాలా చక్కగా ఉంది .
  కొందరు స్నేహితులు- వచ్చిన అతిధులకు వడ్డనలు మంచినీళ్లు అందించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటే కొందరు మాత్రం ఏదో ఒక మూల సర్దుకొని పేకాటలు మొదలుపెట్టారు.  మరికొందరు ఆంజనేయులు చుట్టూ కూర్చుని సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు.  చెవులు చిల్లులు పడే  మైకుహోరుతో క్యాసెట్లో-  ఏవో పాటలు రోజంతా నడుస్తూనే ఉన్నాయి.  మధ్యాహ్నం విస్తరాకులలో బంతి  (   కింద కూర్చొని) భోజనాలు అయిన తర్వాత పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి.  కొబ్బరాకులతో కట్టినా,పెళ్లి పందిరి చూడ్డానికి చాలా బావుంది.  ముఖ్యమైన దారిలో ఇంటిముందు  పెళ్లి పందిరి వేసి రోడ్డుకు అటు ఇటు తడకలు కట్టి  దారి మూసివేశారు.
 మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ పెళ్లి చాలా బాగా చేశారు.  పెళ్లి లో  శాస్త్రుల వారి కార్యక్రమాలు అయ్యేటప్పటికీ దాదాపుగా సాయంత్రం ఆరు గంటలు దాటింది.
 ఇక ఊరేగింపు కార్యక్రమం మొదలు పెట్టారు
ఎప్పుడు తలచుకున్నా   సరే, కడుపుబ్బ నవ్వు  కొనే కార్యక్రమం  ఇది! .అబ్బాయిని అమ్మాయిని ఓపెన్ టాప్ జీపులో కూర్చోబెట్టి కాస్త ముందుగా బ్యాండ్ మేళాలతో ఊరంతా తిప్పి తీసుకువచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు.  పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ను వెనుక సీట్లో కూర్చోబెట్టి ముందుగా మేమందరం కింద నడుస్తూ ఉంటే కొందరు స్నేహితులు  పిచ్చి డాన్సులు చేయడం మొదలుపెట్టారు  .  అక్కడక్కడా   రోడ్డుమధ్యలో ఆపి బ్యాండ్ మేళాలతో    స్నేహితులు అందరూ వంతులవారీగా నృత్యాలు  చేయడం మొదలయ్యింది.  ఇండ్లలో నుంచి అందరూ బయటికి వచ్చి అమ్మాయిని అబ్బాయిని అంటే ,పెళ్లి కూతురు -పెళ్లి కొడుకు ను చూస్తూ నిలబడ్డారు .   పెట్రోమాక్స్ లైట్ ల మధ్య  పెళ్ళి ఊరేగింపు బ్రహ్మాండంగా సాగింది.  ఎవరు పడితే వారు వచ్చి డాన్స్ చేయసాగారు.   కొందరేమో డాన్సులు అయిపోయిన తర్వాత ఆంజనేయులు దగ్గరకు వచ్చి దండాలు పెట్ట   సాగారు. వారికి  జేబులో నుంచి పది  పరకా  ఇస్తూ పోయాడు ఆంజనేయులు.  అలా  పెళ్లి ఊరేగింపు నత్తనడక నడుస్తూ ఉండగా దాదాపు తొమ్మిది దాటింది. ఆ రోజుల్లో టీవీలు వగైరాలు ఉండేవి కావు కాబట్టి  అందరూ త్వరగా నిద్ర పోయే వారు. దాదాపుగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.  అయినా మా బ్యాండ్ మేళం జోరు ఆగలేదు. 
   అప్పటి వరకు చాలా సాదాసీదాగా మామూలుగా జరిగిపోయింది.     ఇక అప్పుడు మేమెవరం ఊహించని కొత్త  కార్యక్రమం మొదలు పెట్టారు మా స్నేహితులు. 
  ఆ సందడిలో  పక్కన,చీకట్లోకి వెళ్లి   బీర్లు తాగి వచ్చి ,  ఇంకా  ఇంకా, ఎక్కువ ఊపులో నృత్యం చేయడం మొదలు పెట్టారు.  రాత్రి 11 గంటలు దాటింది. నేను గమనించి చూస్తే మా ఊరేగింపు వెనకాల వస్తున్న బంధుమిత్రులు విసిగి వెనక్కి వెళ్ళిపోయారు.  మేము కూడా చాలా వరకూ అలసిపోయాము అప్పటికే .  ఆంజనేయులు నన్ను పిలిచి
" ఏరా ఇంక చాలు.   ఇంటికి వెళదామా?" అని అడిగాడు.  నేను  ముందుకెళ్ళి నృత్యం చేస్తున్న నా స్నేహితులకి చెప్పాను ఇంక ఇంటికి వెళ్ళిపోదామని 
"అప్పుడేనా? ఇంకా సగం కూడా కాలేదు వెళ్దాం ,తొందరేముంది!"  అంటూ ముందుకు తీసుకెళ్ళ సాగారు .  జీపులో కూర్చున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పరిస్థితి చూసి నేను కూల్ డ్రింక్, మంచినీళ్లు తెచ్చి ఇచ్చాను.  నిజం చెప్పాలంటే ఎవరికి వాళ్ళు డాన్స్ చేస్తున్నారు కానీ ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. అసలు ఎవరూ పట్టించుకునే పాపాన పోవట్లేదు. స్నేహితులు అందరూ దాదాపుగా తాగిన మైకంలో ఇంకా ఎక్కువ  డాన్సులు చేయడం మొదలుపెట్టారు. అక్కడి పరిస్థితి చూసి పెద్ద వాళ్ళు అందరూ ఎప్పుడో వెనుతిరిగి వెళ్లిపోయారు. అప్పటికే  అర్ధరాత్రి పన్నెండు దాటింది .ఇక ఆంజనేయులుకు అసహనం పెరిగిపోసాగింది. లాభం లేదనుకుని   లేచి నిలబడి ,వాడే జీప్ నుంచి స్నేహితులను  పిలవడం మొదలుపెట్టాడు. అయితే ఎవరైనా వింటే కదా.  ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.  . ఏం చేయాలో ఏమాత్రం అర్థం కాని స్థితిలో కూర్చుండిపోయాడు.  పాపం పెళ్లి కూతురు పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. దాదాపు ఐదు గంటల నుండి జీపులో  కూర్చొని కూర్చొని అలసిపోయింది.  నేను నవ్వుతూ అడిగాను" ఏం చేద్దాం రా "అని .
"ఏం చేద్దాం! ఎవడు విని చచ్చేట్టు లేడు!  ఎదవలు బాగా ఎక్కువగా తాగేశారు" అని నిస్సహాయంగా సమాధానం చెప్పాడు ఆంజనేయులు. 
ఆఖరికి  బ్యాండ్ మేళం వారిని పిలిచి బ్యాండు ఆపేయమని చెప్పాడు  ఆంజనేయులు.  వారు సరేనంటూ ఆపేశారు.
 ఒరేయ్! ఆపితే తంతా మంటూ   తాగిన మైకంలో ఉన్న స్నేహితులు బెదిరించే సరికి వాళ్ళు మళ్ళీ  బ్యాండ్ వాయించడం మొదలుపెట్టారు. 
"ఇక లాభం లేదు ,మనం నడిచి వెళ్ళిపోదాం దిగు " అంటూ  భార్య   చెయ్యి పట్టుకొని జీప్ డోర్ తీసుకుని  బయటకు  దిగటానికి లేచాడు ఆంజనేయులు.  అయినా  అప్పటికి కూడా డాన్స్ చేస్తున్న స్నేహితులు ఎవరూ   గమనించటం లేదు.    ఇక తప్పనిసరి  అయ్యి ఆంజనేయులు  జీపు దిగాడు.  అది చూసి స్నేహితులంతా పరిగెత్తుకొచ్చి 
"అరె స్నేహమంటే ఇదేనా ?మన స్నేహం ఇదేనా?" అంటూ తాగిన మైకంలో   వాడిని బ్రతిమలాడ సాగారు.  పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కష్టం చూసి నాకేమో ఒక వైపు నవ్వు ఆగటంలేదు .వాడు సీరియస్ అయి అందర్నీ "ఒరేయ్  వెనక్కి వస్తారా లేదా ?  ఒక్కొక్కరి  కాళ్ళు విరగ కొడతాను "అంటూ కోపంగా  తిట్టడం, అరవటం మొదలు పెట్టేసరికి అప్పుడు ఏమి చేయలేక మళ్ళీ జీపులో పెళ్ళికొడుకు పెళ్ళికూతురును కూర్చోబెట్టి వెనక్కి తీసుకువచ్చారు.  అప్పటికి రాత్రి రెండు గంటలు దాటింది. పెళ్లి మండపానికి వచ్చిన తర్వాత కూడా వారిని లోనికి  పోనివ్వకుండా స్నేహితులందరూ  చుట్టూ చేరి కూర్చోబెట్టి మాట్లాడ సాగారు. వాళ్ళందర్నీ కంట్రోల్ చేసి వాడిని లోపలికి పంపించే టప్పటికీ మాకు తల ప్రాణం తోకకు వచ్చింది.  ఒక రకంగా చెప్పాలంటే  చిన్న ఊర్లోనే స్నేహితుల మధ్య ప్రేమాభిమానాలు నిజంగా ఉంటాయి.  వారికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం.
 వివాహం జరిగిన తర్వాత రెండవ రోజు సత్యనారాయణ వ్రతం చేసి భోజనాలు పెట్టించారు.  అప్పుడు నన్ను ఆంజనేయులు దగ్గరికి పిలిచి రహస్యంగా  నా  చెవిలో అడిగాడు
" ఇంతకీ నాకు మొదటి రాత్రి ఎప్పుడు  పెట్టిస్తారు" అని.
 నేను  వాడి  మొహం చూసి నవ్వేశాను "నాకెలా తెలుస్తుంది రా  !అదేదో పెద్ద  వాళ్లు చూసుకునే   పని!" అన్నాను.
" ఇంతకీ అసలు ఎప్పుడు పెడతారో నాకేం అర్థం కావట్లేదు." అన్నాడు చిరాకుగా.  
"దానికి టెన్షన్ పడకు. తొందర ఎందుకు" అన్నాను.ఇద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నాం.
 ఆ రోజు రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరం బయటకు వచ్చి   ఇంటి బయట ఉన్న పందిరి కింద కూర్చొని   ఏవో విషయాలు మాట్లాడుతున్నాం. పెళ్లికూతురు  రోడ్డుకు అటు వైపు ఉన్న వాళ్ళ ఇంట్లో  ఎదురుగుండా వున్న కిటికీ లోనుంచి  ఆంజనేయులును చూస్తూ కనిపించింది.  వీడు కూడా నవ్వుతూ  ఏవో సైగలు చేయడం గమనించాను.  ఇప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది . జీవితంలో ఈ విషయం చెబితే  ఎవరు నవ్వకుండా  ఉండలేరు.
  అదేమిటంటే, అప్పుడు ఉన్నట్టుండి అనుకోకుండా కరెంటు పోయింది. చిమ్మచీకట్లో ఏమీ అర్థం కావట్లేదు.    ఆంజనేయులు లేచి నిలబడి
" ఇప్పుడే వస్తారా శ్యామ్."  నా చెవి దగ్గర గుసగుసగా చెప్పి పెళ్లికూతురు ఇంటివైపు ఆ చీకట్లో వెళ్ళిపోయాడు . అందరూ దీపాలు వెలిగించే ప్రయత్నాలు  చేయసాగారు.  అప్పట్లో      జనరేటర్లు  లేదా ఇన్వర్టర్లు ఉండేవికావు.  ఇంతలో పెళ్లి కూతురు ఇంట్లో నుంచి కలకలం మొదలయ్యింది.  ఆ చీకట్లోంచి ఆంజనేయులు  ఆదరాబాదరాగా వచ్చి నా పక్కన  రొప్పుతూ కూర్చున్నాడు.  పెళ్లి కూతురు ఇంటి వాళ్ళు  బయటకు వచ్చి చూడసాగారు.
 "ఏమైంది ?ఏంటి కంగారు పడుతున్నారు?" 
అని అడిగాను. 
"కరెంటు పోయింది కదా, ఈ చీకట్లో వెనక తలుపు నుంచి ఎవడో దొంగ వచ్చాడు.  ఎవరు ఎవరు అని అరిచేసరికి పారిపోయాడు. ఏమైనా సామాన్లు పోయాఏమో కరెంట్ వస్తే కానీ అర్థం కాదు "అని చెప్పారు. 
 కానీ  ఆ దొంగ   ఎవరో నాకు మాత్రం అర్థం అయిపోయింది.  అయినా కూడా అనుమానం తీరక ఆంజనేయులు దగ్గర వెళ్లి కూర్చుని "ఏరా నువ్వు ఏమన్నా   కొంపదీసి వెళ్ళావా అటువైపు" అని  అనుమానంగా అడిగాను.
 "అవునురా! వెనక తలుపు వైపు పద్మ నిలబడి ఉండింది.   సరే ,కాసేపు కలిసి వద్దామని వెళ్లాను"
 అన్నాడు నవ్వుతూ.  వాడి మొహం చూసి నాకు నవ్వు ఆగింది కాదు. 
   "వెళ్లావు ,సరే మరి పరిగెత్తుకొని ఎందుకు వచ్చావు" అన్నాను. వాడు మాట్లాడలేదు మళ్లీ అడిగాను "ఏమైంది "అన్నాను. 
"వెళ్ళిన కాసేపటికి ఎవరో గమనించి ,ఎవరు? ఎవరో !! అని అరవటం మొదలు పెట్టారు రా.    ఇక చూస్తే బాగుండదని ,వెంటనే వెనక్కి వచ్చేసాను"   అని నవ్వటం మొదలు పెట్టాడు.
 అప్పుడు నాకు అసలు విషయం పూర్తిగా అర్థమై "వెధవ !కంగారు పడకు! తొందర పడకు .కాస్త ఆగు.   అన్నిటికీ తొందర ఏంట్రా మరీను" అన్నాను.  
కాసేపట్లో కరెంటు వచ్చి దీపాలు వెలిగాయి. అందరూ "ఎవరో చిల్లర దొంగ వచ్చి ఉంటాడు" అని అనుకుంటూ మాట్లాడుకుంటుంటే     మేము ఇద్దరం మాత్రం  పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ ఉండిపోయాం.  జీవితంలో మళ్ళీ ఎన్నో   సార్లు కలిసినప్పుడు , వాడి పెళ్లి విషయాలు మాట్లాడుకునే  సమయంలో ఈ విషయం మాట్లాడుకుని తెగ నవ్వుకునే వాళ్లం.
 ఆ తర్వాత ఆంజనేయులికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు.  నాకు వివాహం జరిగి, మొదట  కొడుకు జన్మించడం జరిగింది.
  నేనెప్పుడూ ఆంజనేయులు ఇంటికి వెళ్ళినా వాళ్ళ అమ్మ గారు ఆంజనేయులు కి సంతానం కలగటం లేదని చాలా దిగులుగా మాట్లాడేది. "ఏంటో మీకు అందరికీ సంతానం కలుగుతుంది మా వాడికి  కలగటం లేదు "అని తెగ బాధ పడేది.  ఇందులో ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత  సంవత్సరం నుండి వాడికి వరుసగా నలుగురు ఆడపిల్లలు కలిగారు.  దాంతో వాళ్లకు ,  వాళ్ల ఇంట్లో అందరికీ పిల్లలు లేరు! పిల్లలు లేరు! అనే కొరత తీరిపోయింది. తర్వాత వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మాయిలతో   కళ కళ లాడుతూ  కనిపించేవారు . కొడుకు పుట్టాలని ఎదురు చూసి ఎదురు చూసి అందరూ అమ్మాయిలే కలిగారు.అలా అయ్యేటప్పటికి ఇక చాలు అని నాలుగో అమ్మాయి తో సరి పుచ్చుకున్నాడు.  ప్రస్తుతం ఆ నలుగురు అమ్మాయిలు చక్కగా చదువుకొని జీవితంలో బాగా స్థిరపడ్డారు.  మా వివాహం అయిన తర్వాత రెండవ రోజు పూర్తిగా  వాళ్ళింట్లోనే మమ్మల్ని  ఉన్చేసుకున్నాడు.  నా జీవితంలో సుఖదుఃఖాలకు అన్నిటికీ నా స్నేహితులే తోడుగా ఉన్నారు.  ఎవరికైనా సరే వారి వారి జీవితాల్లో జరిగిన మధుర సన్నివేశాల్లో స్నేహితుల పాత్ర  మరువలేనిది. నిజమే
కదా !!
                              ***
ఫోటో లో...భార్య శ్రీ మతి  లీల తోశ్యామ్ కుమార్. 

కామెంట్‌లు