*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౫ - 85)

 శార్దూలము:
*నీపై కావ్యము జెప్పుచున్న యతడు | న్నీ పద్యముల్ వ్రాసి యి*
*మ్మా పాఠంబొనరింతునన్న యతడున్, | మంజుప్రబంధంబు ని*
*ష్ఠా పూర్తిం బఠియించుచున్న యతడున్, | సద్బాంధవుల్ గాక, ఛీ*
*ఛీ! పృష్ఠాగత బాంధవంబు నిజమా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
మా మనుషులకు, నీ గురించి  పుసతకాలు రాసేవాళ్ళు,  నీ మీద పద్యాలు రాసిస్తే ఆ పద్యాలు చదువుకుంటాను అనే వాళ్ళు,  నిన్ను గురించి రాసిన పుస్తకాలను ఎంతో ప్రేమగా చదువుకునే వారు చుట్టాలు అవుతారు. కానీ, కేవలం ఒకే తల్లిదండ్రులకు పుట్టినంత మాత్రాన చుట్టాలు, బంధువులు అవలేరు కదా........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నిన్ను సేవించి, తరించే ప్రహాదుడు, మార్కండేయుడు, ఆంజనేయుడు, నీ పైన గ్రంధాలు రచించిన వేద వ్యాసుడు, పోతన, వాల్మీకి, నిన్ను భజించి ముక్తికాంతను పరిణయమాడిన రామదాసు, పురందరదాసు, భక్త తుకారాం, నందుడు మొదలైన వారంతా మా మానవులకు బంధువులు.  ఎవరైతే, తోటి మానవులకు నిరంతరం సేవచేయడమే లక్ష్యం గా పనిచేస్తారో, ఇప్పటికీ చేస్తున్నారో వారు, మా బంధువులు.  మాకు అన్నదమ్ములు గా, అక్కచెల్లెళ్ళు గా పుట్టిన మాత్రం చేత బంధువులు అవుతారేమో గానీ, ఆత్మబంధువులు, పరమేశ్వర ఆత్మబంధువులు అవలేరు.  మనమందరం పరమేశ్వర ఆత్మబంధువులు అయ్యే ప్రయత్నం మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా చేయాలి. అందరూ పరమేశ్వర ఆత్మబంధువులు అవ్వాలి. ఆ అందరిలో "మనమందరం" వుండాలి.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు