కాలేజీ జీవితం అనేది ఒక రంగుల ప్రపంచం. అందులో ఏది నిజమైన రంగో, లేక ఏది ఇంద్ర ధనుస్సు లాగా కొద్దిసేపట్లో తేలిపోయే రంగో తెలీదు.
అబ్బాయిలు తమకు తెలియకుండానేఈ తికమకలో చిక్కుకొని అక్కడనుంచి బయటికి రావడానికి చాలా కష్టపడతారు. అది సఫలమూ కావచ్చు,విఫలము
కావచ్చును!సీరియస్ గా చదువుకునే అమ్మాయిలు
కూడా దీనికి అతీతం కాదు! ఇంచుమించు ఇలాంటి
వాతావరణం ప్రతిబింభించే సన్నివేశాలు మీ ముందు
వుంచుతాను.ఆస్వాదించండి మరి !
అవిమేము డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నరోజులు. ఆ రోజుల్లో మా స్నేహితుడు వేణు కూడా ఇలాంటి గందరగోళం లోనే చిక్కుకొని ఆ ముచ్చటైన మూడు సంవత్సరాలు అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు.
మాక్లాసులో ఉన్న అమ్మాయిల్లో పద్మ అనే ఒక చురుకైన తెలివైన అమ్మాయి ఉండేది. నా వరకు ఆ అమ్మాయి పెద్ద అందగత్తె కాదు కానీ కాస్త ఆకర్షణీయంగా కనిపించేది. మేలిమి బంగారు రంగుతో విశాలమైన కళ్ళు పొడవాటి రెండు జడలు కోటేరు ముక్కు తో ఎప్పుడూ సీరియస్ గా మొహం పెట్టి ఉండేది. ఎప్పుడూ నవ్వేది కాదు కానీ ఎప్పుడైనా నవ్వితే మాత్రం చాలా అందంగా కనిపించేది.(నావరకూ)
వేణుకు ఆ అమ్మాయికి , దాదాపుగా అన్నిట్లో సరిసమానంగా మార్కులు వచ్చేవి. ఆ అమ్మాయి అందరితోపాటు మా వేణు తో కూడా స్నేహభావంతో మాట్లాడుతూ ఉండేది. క్లాసు లో పాఠం వింటూ కూడా ఎప్పుడూ ఆ అమ్మాయిని గమనిస్తూ ఉండేవాడు వేణు. కాలేజీ బస్సు ఎక్కి నది మొదలు ఆ మె బస్సు దిగి కాలేజీలో కి వెళ్లే వరకు కూడా ఆ ..అమ్మాయిని వీడి చూపులు వెంటాడుతూనే ఉండేవి .
కొన్ని రోజులు వారిని గమనించిన తర్వాత వాణ్ణి ఉండబట్టలేక ఒక రోజు అడిగేసాను " ఒరేయ్ ఏంటి సంగతి అమ్మాయి అంటే ఇష్టమా? నీకు ఇంట్రెస్ట్ ఏంటి ?పెళ్లి చేసుకుంటావా ?"అని.
"చ !చ !పెళ్లి ఏంటి ?ఇంట్రెస్ట్ ఏంటి? అలాంటి ఆలోచన లు నాకు ఏమీ లేవు" అనేసాడు.
మొదటి మూడు నెలల తర్వాత మాకు ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పెట్టారు.
వేణుకి,ఆ.. అమ్మాయి తో తలనొప్పులు మొదలయ్యే ముహూర్తం అన్నమాట.!
మధ్యాహ్నం లంచ్ సమయం తర్వాత జరిగే జువాలజీ ప్రాక్టికల్ పరీక్షలో ఒక అతి సామాన్య మామూలు సంఘటన జరిగి , ఆ తర్వాత వీడికి ఆ అమ్మాయితో తలనొప్పి వ్యవహారం కాలేజీ అయిపోయే వరకు కొనసాగింది.
ప్రతి మూడు నిమిషాలకు రాయాల్సిన ఒక ప్రశ్నకు సమాధానం తో మొదలయ్యే ఆ పరీక్ష అరగంటలో ముగిస్తుంది. చాలా టెన్షన్ తో జరిగే ఆ పరీక్షల్లో టేబుల్ మీద ఎవరో వదిలేసిన ఒక పెన్ను కనిపించింది. ఆ ల్యాబ్ లో నుంచి వస్తున్న వీడు ఆ పెన్ చూసి తీసి జేబులో పెట్టుకున్నాడు,ఎవరిదో కదా అడుగుతే ఇచ్చేద్దాం అని అనుకుంటూ.
బయటకు వచ్చాక కాసేపటికి పద్మ మళ్ళీ క్లాస్ రూమ్ లోకి వెళ్లి "నా పెన్ను ఇక్కడే పెట్టాను ఎవరు తీశారు" అంటూ అందర్నీ అడగటంమొదలు పెట్టింది. అది విని మా వేణుగాడు "ఇదేనా మీది "అని జేబులోంచి పెన్ను తీసి చూపించాడు.
"అవును" అంటూ సీరియస్ గా మొహం పెట్టి తీసుకుంది. అంతలో లంచ్ బెల్ మోగడం తో అక్కడినుంచి పరీక్ష విశేషాలు మాట్లాడుకుంటూ అందరం వెళ్ళిపోయాం .అమ్మాయి మాత్రం అలాగే సీరియస్ గా మొహం పెట్టుకొని లేడీస్ రూమ్ వైపు వెళ్ళి పోయింది.
మధ్యాహ్నం లంచ్ అయిపోయిం తర్వాత మళ్ళీ మాకు క్లాసులు మొదలయ్యాయి. బాటనీ క్లాస్ నడుస్తోంది ఇంతలో ఆఫీస్ ప్యూన్ వచ్చి "వేణుని ప్రిన్సిపాల్ గారు ఆఫీస్ కి రమ్మన్నారు" అంటూ చెప్పి వెళ్ళాడు. మేము స్నేహితులం అందరం మొహాలు చూసుకున్నాం " ప్రిన్సిపాల్ వీడిని ఎందుకు పిలవడం ? ఏంటి విషయం ?అని .
లెక్చరర్ కూడా మా వైపు అనుమానంగా చూశాడు. మేము వాడికి ధైర్యం చెప్పి "ఏంటో విషయం కనుక్కొ ! వెళ్ళు, భయం ఎందుకు!!" అంటూ పంపించాం.
ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళిన వేణుగోపాల్ ను ప్రిన్సిపాల్ ఆపాదమస్తకం పరికించి చూశాడు.
"ఏంటి బాబు, చూస్తే బుద్ధిమంతుడిలా కనబడుతున్నావ్, ఏంటి నువ్వు చేసే పనులు?. పద్మజ పెన్ ఎందుకు కొట్టేసావు? ఏం కొనుక్కో లేవా ?"అన్నాడు.
జరిగిన విషయం చెప్పాడు వేణుగోపాల్.
"ఇంకోసారి ఇలాంటివి జరగకూడదు ."
ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మిష్టర్ వేణుగోపాల్ ! ఇంక వెళ్ళు" అన్నారు ప్రిన్సిపల్.
కాసేపటికి క్లాసుకి తిరిగి వచ్చిన వేణుగోపాల్ మొహం చూసి మాకు అర్థమైంది వీడి కి ఏదో ప్రాబ్లం చుట్టుకుంది అని.
వేణు వచ్చి కూర్చున్న కాసేపటికి క్లాసు అయిపోయిన తర్వాత కలవమని బాటని హెడ్ జానకి మేడంగారు నుంచి వారికి కబురు వచ్చింది. ఏముంది ,వీడు వెళ్లగానే అక్కడ కూడా షరా మామూలే. మళ్లీ జరిగిందంతా చెప్పి నవ్వలేక నవ్వాడు వేణు.
అదుగో అప్పటి నుంచి ఈ అమ్మాయికి మా వాడు బద్ధశత్రువు అయిపోయాడు. అసలు వీడు చేసిన తప్పు ఏమిటో? ఆ అమ్మాయి అంత సీరియస్ గా ఎందుకు తీసుకుందో? ఇప్పటికీ మాకు అర్థం కాదు!! . అయితే ఆ శత్రుత్వం అంతా వాళ్ళిద్దరూ చదువులో చూపించ సాగారు. వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ ,ఇంటర్నల్ అసెస్మెంట్ లో ఎక్కడ కూడా ఒక మార్కు తేడా వచ్చినా సరే ,వాళ్ళు ఇద్దరూ లెక్చరర్ దగ్గరికి వెళ్లి పోట్లాడడం మొదలు పెట్టారు. మా వాడి కంటే ఆ అమ్మాయికి ఒక మార్కు ఎక్కువ వచ్చినా మేము వాణ్ని "ఒరేయ్ వెళ్లి బావిలో దూకు, ఎందుకు నీకు ఈ బ్రతుకు?" అని తెగ ఆటపట్టించే వాళ్ళం.
మా వాడి డాబా మీద నుంచి చూస్తే అమ్మాయి బంగ్లా మీద ఉన్న తన రూం లో కూర్చుని చదువుతూ కనిపించేది. అమ్మాయి మీద పోటీతో వేణు కూడా భయంకరంగా చదవడం మొదలు పెట్టాడు. పరీక్షల సమయంలో అయితే మాకు కనిపించేవాడు కాదు. డాబా మీదికి వెళ్ళి అమ్మాయి చదువుతున్నది గమనించి ,ఆ అమ్మాయి మానే వరకు వీడు కూడా పుస్తకం వదిలేవాడు కాదు. రాత్రి పూట అయితే మరీను. రాత్రి పన్నెండు దాటిన ,ఒంటి గంట దాటినా సరే అమ్మాయి గదిలో లైటు ఆరిపోయే వరకూ వీడు కునికిపాట్లు పడుతూ బలవంతంగా నిద్ర ఆపుకుంటూ , చదువుకుంటూ కూర్చునేవాడు . ఉదయానికల్లా వాడి కళ్ళు ఎర్రగా ఉండేవి" ఏమైంది రా ?"అని అడిగితే"
" నా చావుకొచ్చింది, రెండు కొట్టినా సరే ఇంకా నిద్రపోకుండా అలాగే చదువుతూ కూర్చుంది పెద్దమ్మ తల్లి. మహా తల్లి" అన్నాడు కోపంతో బుసలు కొడుతూ. వాడి మొహం చూసి మేమంతా కడుపుబ్బ నవ్వుకున్నాం.
బాటనీ ల్యాబ్‌లో ఒకసారి నారాయణ రెడ్డి గారు క్లాస్ తీసుకుంటూ ఉన్నారు. మేము క్లాసులో దాదాపుగా 16 విద్యార్థులు మాత్రమే ఉండేవాళ్లం. ల్యాబ్ లో పెద్దపెద్ద టేబుల్స్, వాటి ముందుగా స్టూల్స్ వేసుకొని కూర్చుని పాఠం వినే వాళ్ళం. ముందు వరుసలో పద్మజ కూర్చుంది మేమంతా రెండవ వరస లో ఐదుగురు కూర్చున్నాం. ఆ సమయంలో వీడి ని ఆటపట్టించాలని ఎందుకనో శ్రీనివాసు కు అనిపించింది. మెల్లిగా గుసగుసగా వేణుగోపాల్ తో " అరేయ్ !ఆ పద్మజ పక్కన వాడెవడో కూర్చున్నాడు, నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ. చేతగాని వెధవ" అన్నాడు. వేణు కి ఏమీ అర్థం కాక మా వైపు చూశాడు ఏంచేయాలి అన్నట్టుగా.
మళ్లీ గుసగుసగా శ్రీనివాస్ చెప్పాడు
"నువ్వు వెళ్లి పద్మజ పక్కన కూర్చొ" అని.
అప్పుడు మా వాడు ఆవేశంతో స్టూల్ తీసి పైకి లేపి పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న చిన్న స్థలంలో స్టూల్ వేసి కూర్చుండిపోయాడు. ఆ సమయంలో నారాయణరెడ్డి గారు బోర్డ్ వైపు తిరిగి రంగు చాక్‌పీస్ లతో బొమ్మ వేస్తూ ఉన్నారు . ఇదంతా గమనించలేదు. బోర్డు మీద రాయడం పూర్తయిన తర్వాత మా వైపు తిరిగి పాఠం చెప్పడం మొదలుపెట్టారు. ఆయనకు ఏదో తేడా కనిపించింది గమనించి చూశారు మమ్మల్ని. ఆయనకు విషయం అర్థమైనట్టుగా ఉంది. పాఠం చెప్పడం మానేసి చాలా సీరియస్ గా వేణు వైపు చూసి" మిస్టర్ వేణుగోపాల్ నువ్వు లేచి వెళ్లి వెనక నీ ప్లేస్ లో కూర్చో "అన్నారు.
గమ్మత్తు ఏమిటంటే మా వాడు కూడా అంతే సీరియస్ గా లేచి స్టూలు తీసి పైకి పట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మా దగ్గర స్టూలు వేసి కూర్చుండిపోయాడు. క్లాసంతా నిశ్శబ్దం గా మారి పోయింది కాసేపు. మేము లోలోపల సంతోషంగా నవ్వుకొన్నా ము .క్లాసు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ విద్యార్థి ఈ సంఘటన గురించి ఏమి మాట్లాడలేదు, ఎందుకంటే చదువులో మేము ముందు గా ఉండటమే కాకుండా, హింసాత్మకమైన పోట్లాటలకు కూడా ముందు ఉండేవాళ్ళం, జడిసే వాళ్ళం కాదు. ప్రతి పరీక్షలో రిజల్ట్స్ వచ్చేవరకూ ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందా లేక నేను ఫస్ట్ వస్తానా అని అనుకుంటూ వేణుగోపాల్ టెన్షన్ తో ఎదురు చూసే వాడు. ఇలాంటి గమ్మత్తయిన సంఘటనలతో మా రెండవ సంవత్సరం గడిచిపోయింది. డిగ్రీ మూడో సంవత్సరంలో చేయబోయే పనులు , జరగబోయే సంఘటనలు వాటి ఆనందాలని అంచనా వేస్తూ అందరం సమ్మర్ సెలవలకి మా పల్లెటూర్లకు
వెళ్లిపోయాం. వేణుగోపాల్ మాత్రం మళ్ళీ ఎప్పుడు కాలేజీ స్టార్ట్ అవుతుందా ?మళ్ళీ ఎప్పుడు పద్మజను చూస్తానా ?అనుకుంటూ ఇంటికి వెళ్ళివుంటాడని మా గట్టి నమ్మకం.
***
ఫోటోలో....రచయితతోశ్రీమతి లీల శ్యామ్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి