సోము 9వ తరగతి చదువుతున్నాడు. 7వ తరగతి వరకు అతడే తన తరగతిలో మొదటి ర్యాంకు వచ్చేవాడు. కరోనా విజృంభణతో 7వ తరగతి ఫైనల్ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణుడు అయినాడు. అతడు 8వ తరగతిలోకి రాగానే కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు జరగడం లేదు. చాలా రోజుల తర్వాత ఆన్లైన్ తరగతులు మొదలు అయ్యాయి. మొదట్లో ఎంతో ఆసక్తిగా పాఠాలను విన్న సోము రాను రాను వినడం తగ్గించాడు. తల్లిదండ్రులు వేరే పనుల్లో మునగడం వల్ల సోము రాను రాను మొబైల్ గేమ్స్, సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. తీరిక సమయాల్లో బయటికి వెళ్ళి, మిత్ర బృందంతో రోజూ గంటల తరబడి క్రికెట్ ఆడి వచ్చేవాడు. సోము చెల్లెలు అపర్ణ 6వ తరగతి చదువుతున్నది. బుద్ధిగా ఆన్లైన్ తరగతులు వింటూ ఏరోజు పని ఆరోజు చేసేది. "అన్నయ్యా! శ్రద్ధగా ఆన్లైన్ తరగతులు వింటూ బుద్ధిగా చదువుకోరాదూ! ఈ సంవత్సరం ఆన్లైన్ తరగతులు వినకపోతే పై తరగతులకు వెళ్ళే కొద్థీ మరీ వెనుకబడి పోతావు." అన్నది అపర్ణ. "వేలెడంత లేవు. నువ్వా నాకు నీతులు చెప్పేది నా చదువు నా ఇష్టం. అయినా ఏనాటికైనా చదువులో నన్ను మించిన వారు ఇంకెవరూ ఉండరు. నీ పని నువ్వు చూసుకో. నా జోలికి వస్తే ఊరుకోను." అన్నాడు సోము. మూర్ఖులకు హితబోధ అనవసరం అనుకుంది అపర్ణ.
సోము 9వ తరగతిలోకి వచ్చాడు. ఈసారి తొందరగా ఆన్లైన్ తరగతులు మొదలు అయ్యాయి. వరుసగా రెండు సంవత్సరాలు 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు అయ్యారు. ఈ కరోనా తగ్గేది కాదు. తానూ 10వ తరగతి పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్ చదివే అవకాశం ఉందని మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇంతలో సోము వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు తమ పిల్లలతో వారం రోజుల పని మీద సోము వాళ్ళ ఇంటికి వచ్చారు. "అపర్ణా! ఆన్లైన్ తరగతులు ఎలా వింటున్నావమ్మా? ఏమైనా అర్థం అవుతున్నాయా?" అని అడిగింది సోము వాళ్ళ పెద్దమ్మ కమల. అప్పుడు సోము కల్పించుకొని, "ఏమీ వినడం లేదు. ఎప్పుడూ మొబైల్ ఫోన్లో ఆటలు. లేకపోతే బయట స్నేహితులతో ఆటలు. ఏమైనా చదువు మీద శ్రద్ద, కరోనా భయం అనేవి ఉంటేనా? నా పరువు తీస్తుంది. నేనేమో క్లాస్ ఫస్ట్. నా చెల్లెలు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాను." అన్నాడు. "మరి సోమూ! నువ్వెలా చదువుతున్నావు?" అన్నది కమల. అప్పుడు అపర్ణ కల్పించుకొని "అన్నయ్యకేం? సూపర్. వాడికి పోటీ ఎవ్వరూ రారు. నేనే అన్నయ్య మాట వినకుండా చదువును నిర్లక్ష్యం చేస్తున్నా."అన్నది. అప్పుడు కమల " నీ అన్నయ్యను చూసి బుద్ధి తెచ్చుకోవే అపర్ణ. మా పిల్లలు చూడు. నీలాగే చదువును నిర్లక్ష్యం చేస్తూ నాకు తలనొప్పిలా తయారు అయ్యారు. పెద్దవాడు రంగ 10వ తరగతిలోకి వచ్చినా చదువంటే భయం లేదు. ఈసారి కూడా పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణత సాధిస్తామని వాదిస్తున్నాడు. చిన్నామె రమకు 8వ తరగతి సబ్జెక్టులు ఏమీ అర్థం కావడం లేదు. సోమూ! ఈ వారం రోజులూ నీ చెల్లెలు రమకు కఠినమైన సబ్జెక్టులు నువ్వే చెప్పాలి." అన్నది కమల. అప్పుడు అపర్ణ "ఒరేయ్ అన్నయ్యా! ఎప్పుడైనా నాకు అర్థం కాని విషయాలు చెప్పమంటే తీరిక సమయం అంతా నీ చదువే చదువుతుంటారు. లేదంటే రాతపని. కానీ రమ కోసమైనా ఒక్క వారం రోజులు సమయం కేటాయించి అర్థం కాని విషయాలు చెప్పరా? చెబుతాడు పెద్దమ్మా. అన్నయ్య చాలా మంచోడు." అన్నది.
అపర్ణను అవమానించిన సోముకు తగిన శిక్షే పడింది. 8వ తరగతిలో తాను ఏ సబ్జెక్టూ సరిగా వినలేదు. చదవలేదు. ఏమీ రాదు. ఇప్పుడు రమకు ఏమి చెప్పాలి? తనను తెలివైన వాడిగా గుర్తించిన పెద్దమ్మ ముందు పరువు పోతుంది. చెల్లెలు రమ ముందు కూడా పరువు పోతుంది. ఏమి చెయ్యాలో పాలుపోలేదు సోముకు. గత సంవత్సరం నుంచి చెల్లెలి మాట వినక చేజేతులా చదువును నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు విచారించి ఏమి లాభం అనుకున్నాడు సోము. తన నిర్లక్ష్యం మూలంగా పెద్దమ్మ ముందు, చెల్లెలి ముందు పరువు పోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కాబట్టి పిల్లలూ! ఆన్లైన్ తరగతులను శ్రద్ధగా వినండి. ఏరోజు పనిని ఆరోజు చేయండి. అదృష్టం మీద ఆధారపడితే మీ భవిష్యత్తు దారుణంగా దెబ్బతింటుంది.
అన్నయ్యా! బుద్ధిగా చదువు. (కథ) -- సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి