అనగనగా ఒకకోతి:- *డి.కె.చదువులబాబు*

 ఒక అడవిలో ఒక కోతి చెట్టుకు ఆనుకుని కళ్ళు మూసుకుని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి'ఇది రాత్రీ పగలూ బాగా దొంగతనాలు చేసినట్లుంది.అలిసిపోయి నిద్రబోతోంది.' అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విషయం కనపడిన ప్రతి జంతువుతో చెప్పింది. అటుగా వచ్చిన తిండిపోతుఎలుగు కోతిని చూసింది.'ఈ కోతి పీకలదాకా  తిన్న ట్లుంది..'అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈసంగతి కనపడిన ప్రతి జంతువుకూ చెప్పింది.
ఆదారిన వచ్చిన కొంగ వైద్యుడు కోతిని చూసింది.'ఈకోతి ఏదో రోగంతో పడిపోయినట్లుంది'అనుకుంటూ వెళ్ళిపోయింది.ఈవిషయం కనిపించిన ప్రతి జంతువుతో చెప్పింది. తర్వాత అటుగా వచ్చిన ఆకలిగొన్న కుందేలు 'ఈకోతి ఆహారం దొరకక ఆకలి బాధతో కళ్ళు తిరిగి చెట్టుకు చేరగిలపడినట్లుంది.' అనుకుంటూ వెళ్ళిపోయింది.ఈవిషయం కనిపించిన ప్రతిజంతువుకూ చెప్పింది. ఒక సోమరి నత్త కోతిని చూసి 'ఇది చాలా సోమరిలాగా ఉంది' అనుకుంటూ వెళ్ళి పోయింది,
విషయం అనుమానపు సింహం చెవిన పడింది.'తన పదవిని కాజేయాలని కోతి పథకం పన్నుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుంది' అనుకుందిసింహం.
కొంతసేపటి తర్వాత కోతిని మేల్కొల్పడానికి దొంగనక్క ఆకుదోనెలో చల్లని నీళ్ళు తీసుకొచ్చింది.ఎలుగు ఏదో పసరు తీసుకొచ్చింది.కొంగ వైద్యానికి మూలికలతో వచ్చింది.కుందేలు కోతి ఆకలితో పడిపోయిందని రెెండు అరటిపండ్లు సంపాదించి తీసుకొచ్చింది.జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి.సింహం కూడా వచ్చింది.అప్పుడు ఒక ముదుసలి గ్రద్ద వచ్చి అక్కడ వాలింది. అవి గుంపు కావడానికి కారణం అడిగి తెలుసుకుంది. "కోతి ఎందుకలా ఉందనుకుంటున్నారూ ?"అంది.
దేని అభిప్రాయం అవి చెప్పాయి. 
గద్దనవ్వి "ఇప్పుడు మీరందరూ మీమనసులో ఆలోచనలను చెప్పారు. మన మనసులో ఏ ఆలోచనలు ఉంటాయో అలాగే లోకంకూడా మనకు కనిపిస్తుంది. మన మనసు మంచి ఆలోచనలతో ఉంటే అంతటా మంచిని చూస్తాం. కోతి ఎందుకలా ఉందో అడిగి తెలుసుకుందాం!" అంది.
 జంతువులన్నీ అరవడంతో కోతి కళ్ళు తెరిచి చూసింది. తనచుట్టూ చేరిన జంతువులను చూసి ఆశ్చర్యపడింది. గద్ద కోతికి జరిగిన సంగతులు చెప్పి ,కళ్ళు మూసుకుని ఏంచేస్తున్నావని అడిగింది. కోతి కిచకిచ నవ్వి "మీ ఆలోచనలు తప్పు. అవి మీమనసులో అభిప్రాయాలు మాత్రమే. నేను పట్నంలో ఓమనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటాము. అని విన్నాను" అంది. 
గద్ద నవ్వి "నువ్వు విన్నదీ, చూసిందీ నిజమే.కానీ కదలకుండా, మెదలకుండా కళ్ళుమూసుకున్నంత మాత్రాన ధ్యానం కాదు. 'గురువులేని విద్య గుడ్డివిద్య 'అనే సామెత వినలేదా!ధ్యానం గురించి తెలిసిన ఎవరో ఒకరిని కలిసి ఎలా చేయాలో నేర్చుకో.ఏపనినీ ఆపని గురించి తెలిసిన వారినుండి నేర్చుకోకుండా గుడ్డిగా చేయకూడదు"అని చెప్పింది. "అలాగే నేను నేర్చుకుని వచ్చి,మీకూ నేర్పిస్తాను"అంది కోతి.
జంతువులన్నీ వాటి మనసులోని ఆలోచనలను కోతికి ఆపాదించినందుకు సిగ్గుపడుతూ వెళ్ళిపోయాయి.
కామెంట్‌లు