గూనవ్వ ..!! > రావుల కిరణ్మయి -రచయిత్రి > హన్మకొండ *

 పాఠశాల లో తనకు లీజర్ పీరియడ్ కావడం తోనూ,స్టాఫ్ రూములో తను తప్ప వేరే ఏ టీచరూ లేకపోవడం తోనూ వరుణి హాయి గా సాహిత్య మాస పత్రికను చదువుతూ కూర్చున్నది.ఆమెకు ఇలా ఒంటరిగా కూర్చుని చదువుకోవడమంటే చాలా ఇష్టం.కానీ,రోజూ ఇలా కుదరదు.ఎవరో ఒకరు తనతో పాటు లీజర్ గా ఉండి మాట్లాడుతూ కూర్చుంటారు .తను మాట్లాడదు.కానీ వాళ్ళు చెప్పేది మాత్రం శ్రద్ధ గా వింటుంది కాబట్టి,చెప్పే వాళ్ళకు వినే వాడు లోకువన్నట్టుగా కలగూర గంప లాంటి ముచ్చట్లన్ని తన ముందు దింపేస్తారు. వాళ్ళను సున్నితంగా తిరస్కరించవచ్చు,కానీ అలా చేయలేదు.మొహమాటం వల్ల.అలా పరిసరాలను మరిచి పోయి చదవడం లో మునిగి పోయిన వరుణి దగ్గరకు అటెండర్ అరేంజ్ డ్ టైం టేబుల్ తీసుకువచ్చి ,
మేడం!,హెడ్ మాస్టర్ గారు ఇందులో సైన్ చేసి క్లాస్ కు వెళ్ళమన్నారండీ అన్నాడు వినయంగా.
తీసుకోని చూసింది అది తొమ్మిదవ తరగతి.ఆ క్లాస్ తనకు అస్సలు లేదు.ఆ పిల్లలు కూడా కాస్తా అల్లరి పిల్లలే ,అని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం తోనే తల ప్రాణం తోకకస్తుందని మిగతా టీచర్లు అనగా విని ఉంది కాబట్టి  ఆ క్లాసుకు వెళ్ళడానికి కొంచెం అయిష్టత అనిపించినా ,అంతలోనే తన బాధ్యత అనుకొని  సైన్ చేసి క్లాస్ కు కదిలింది.
వెళుతుంటే హెడ్ మాస్టర్ గారు,
"మేడం !ఈ రోజు స్టాఫ్ తక్కువగా ఉంది.మీరు ఇక అలాగే ఈ పీరియడ్ తొపాటు మరో రెండు పీరియడ్ లు కూడా కంటిన్యూ చేసేయండి.మీ క్లాసుల ను కూడా అక్కడికే పంపిస్తాను "అన్నారు.
"ఒక్క పీరియడే కష్టం అలాంటిది,మూడు పీరియడ్ లు,ఎలాగబ్బా..!"అనుకుంటూనే క్లాస్కు వెళ్ళింది.
తనను చూడగానే పిల్లలు ఆనందంగా, మరింత హుషారుగా,బిగ్గరగా విష్ చేస్తూ అరిచారు.వారిలో ఆనందానికి కారణం,తను పిల్లలను ఒక టీచర్ గా అజమాయిషీ చేయడం కాక ఒక ఆత్మీయురాలిగా వారి ని  బాగా అర్థం చేసుకోవడమే.అలా ఆమె పట్ల పిల్లలలో గౌరవం మిగతా అందరికంటే మెండుగా అనే చెప్పవచ్చు.
అలా,పిల్లలనే అడిగింది"ఇప్పుడు ఏం చేద్దాం?"అని,
ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమాధానాలు.అంత్యాక్షరి ఆడుకుందాం,పాటలు పాడుకుందాం,గ్రౌండ్ లో ఆడుకుందాం.....ఇలా చెప్పి చివరకు "మీరు ఏది చెప్తే అది చేస్తాం కానీ,చదవడం,రాయడం మాత్రం వద్దు మేడం,ప్లీజ్ !"అన్నారు.
వరుణికి,వాళ్ళను చూస్తే జాలి కలిగింది.వాళ్ళు తనలాగే రిలాక్స్ కావాలనుకుంటున్నారని అర్థమై,
"సరే,పిల్లలూ !మీ అందరికీ డ్రాయింగ్ బాగా వచ్చని విన్నాను కాబట్టి,నేనొక టాపిక్ ఇస్తాను మీరు దానికి అనుగుణంగా చిత్రాన్ని గీయండి.మీరు సొంతంగా ఊహించి వేయవచ్చు,లేదా మీ పుస్తకాలలోని వాటిని చూసైనా వేయవచ్చు నాకు ఏ అభ్యంతరం లేదు కానీ, నేనిచ్చిన అంశాన్ని ప్రతిబింబిస్తూ ఉండాలి.అందులో మూడింటికి బహుమతులు కూడా ఇస్తాను."అని చెప్పగానే పిల్లలందరూ సంతోషంగా పెన్సిల్,పేపర్ తీసుకోవదానికి తయారయ్యారు.
ఈ లోగా ,వరుణి,బోర్డ్ పై 
'బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం మిన్న' అని రాసింది. 
క్లాసంతా  ఎగ్జామినేషన్ హాల్ లాగా మారి పోయింది.పిల్లలంతా దూరం దూరం గా జరిగి టెక్స్ట్ బుక్ లోని చిత్రాలను చూస్తూ ఇచ్చిన అంశానికి సరిపోయే చిత్రాలను వెతికే పనిలో పడ్డారు.కలర్ పెన్సిల్స్,స్కెచెస్ ఇలా కలరింగ్ కొరకు కూడా అన్నీ రెడీ గా పెట్టుకొని డ్రాయింగ్ మొదలు పెట్టారు.
వరుణి తన చైర్ లోనే కూర్చొని ఒక్కొక్కరినీ గమనిస్తూ తను కూడా వాళ్ళ ముఖ కవళికలను బట్టి వారి చిత్రాన్ని తన మనో పలకం పై చిత్రించుకుంటున్నది.చివరగా ఒక అబ్బాయిని చూసి వాడి దగ్గర పెన్సిల్ తప్ప బుక్ లాంటిది ఏదీ లేక పోవడం తో వాడు ఊరికనే టైం పాస్ చేస్తున్నాడని అర్థమై వాడికి బొమ్మలు గీయడం రాదని రూడీ చేసుకుంది.మరైతే ఏం చేస్తున్నాడో చూడాలని దగ్గరగా వెళ్ళి భుజం పై చేయి వేసింది,అంతే ,వాడు చప్పున ఆరుద్ర పురుగులాగా తను వేస్తున్న బుక్కును మూసేసి ముడుచుకు పోయాడు.
వరుణి,వాడిని ప్రోత్సహించాలన్నట్టుగా,"కలర్స్ కావాలా?అడిగివ్వనా?"అంది.
వాడు,వద్ధన్నట్టుగా తలూపడం తో వాడికి రాదని  పూర్తి గా తేటతెల్లమై,అందరికీ రావాలని కూడా లేదు కదా !అనుకొని  వచ్చి కూర్చుంది.
అలా పిల్లలు ఇంటర్వెల్ కు కూడా వెళ్ళాలనే ఆలోచనే లేకుండా తమ పనిలో నిమగ్నమవడం వరుణికి చాలా ఆనదాన్ని ఇచ్చింది.ఆ విధంగా ఒక్కొక్కరూ తాము గీసిన చిత్రాలను చక్కగా కలర్స్ అద్ది ఇవ్వడం మొదలు పెట్టారు.
దాదాపుగా ప్రతీ ఒక్కరూ,గాంధీజీ,వివేకానందుడు,రామకృష్ణ పరమహంస,వేమన,బుద్ధుడు ఇలాంటి మహనీయులను వారి వేషధారణ తో చిత్రించి వారి ప్రభోధాలను ఒకటి,రెండు రాశారు.
వరుణికి,ఆశ్చర్యంగాను,ఆనందంగాను అనిపించింది.తాను ఊహించిన  దానికి భిన్నం గా వారి ఆలోచన ఉండడం.
చివరగా ఇంతకు ముందు తనను చూసి ముడుచుకున్న విద్యార్థి తెచ్చిచ్చిన చిత్రాన్ని చూసి ఆమెకు నోట మాట రాలేదు.వాడు ఏ బుక్కు లేకుండా వట్టి పెన్సిల్ తోనే వేసిన ఒక గూని అవ్వ,ఒక పిల్ల వాడికి ప్రేమగా అన్నం తినిపిస్తున్న చిత్రం.అది.జీవకళ ఉట్టి పడుతున్నది.
వాడి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని అడిగింది.
"మేడమ్,ఈమె మా అవ్వ.అది నేను.చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా నన్ను సాదుతున్నది.అయితే ఆమెకు వయసు తో పాటు గూని రావడం వల్ల అందరూ గూనవ్వ ....గూనవ్వ....అని పిలవడం బాధగా ఉంటుంది మేడమ్.మా అమ్మా,నాయనలు  సచ్చిపోతే నన్ను సాధు తున్న దేవత మేడమ్ మా అవ్వ!"అంటుండగా వాడి కళ్ళతో పాటూ వరుని  కళ్ళు కూడా జల...జలా ..వర్షించాయి. వాడి ఆవేదన అర్థమై,ఇందాక తను కూడా వాడికి ఏమీ రాదనీ లెక్కకట్టి ఎంత పొరపాటు చేసిందో గ్రహించింది.కళ్ళు చూపే బాహ్య రూపం కాక మనసు పెట్టి చూస్తేనే అంతఃసౌందర్యం విలువ అని గ్రహించి వాడిని మనసారా అభినందించి మొదటి బహుమతికి ఎంపిక చేసింది.

కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
బడిలో పిల్లలతో
అనుభవాలు జ్ఞాపకాలు బాగుంటాయి.
బాగా రాసారు.అభినందనలు మీకు
------డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
Shyam kumar చెప్పారు…
Heart touching story. Excellent. Closing is good. Tq
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
కిరణ్మయి గారి రచన చాలా బాగుంది సార్ జీవితానుభవాల్లోంచే రచనలొస్తాయన్నదానికి ప్రతిబింబంగా. తను పరిచయమే.

-----డా.విద్యాదేవి.ఆకునూరు
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
👌👌 ....
గూనవ్వ కథ...
చాలా బాగుంది సర్ ....

-------శ్రీధర్ రెడ్డి
రామకృష్ణ కాలనీ
హన్మకొండ.