ఘనమైన " కృష్ణ "లేఖ!!:-- యామిజాల జగదీశ్




"ఉత్తరపర్వం" నాకెప్పుడూ ఇష్టమే. అసలు ఉత్తరాలే రాసుకోని ఈ రోజుల్లో ఒకటీ అరా మాటలు ఉత్తరాలతో అందుకునేప్పుడు కలిగే ఆనందం అనంతం. నెలలో ఒకటి రెండు పోస్టులు నాకైతే అందుతాయి. అవి ఉత్తరాలు కాకపోయినా ఆనందమే. పోస్ట్ అన్న పోస్టుమాన్ స్వరం వింటున్నప్పుడు కలిగే ఆనందాన్ని ఎంతని చెప్పను?! పోస్టుమాన్ నుంచి నేనందుకునేవి రెండు మాస పత్రికలు. అవి, శ్రీశైలప్రభ, శృంగేరీవారి శంకరకృప. ఈ రెండూ కాకుండా అందుకున్న ఉత్తరమే ఈ రచనకు మూలాధారం. 
 
ఇటీవల మిత్రులు డి.వి.ఆర్. భాస్కర్ గారితో మాట్లాడినప్పుడు "వి.ఎ.కె.రంగారావుగారికి ఆరోగ్యం బాగులేదు" అని చెప్పారు. ఏమైందో ఏంటో తెలుసుకుందామని వెంటనే "విఎకె" గారికి మెసేజ్ పెట్టాను. జవాబు లేదు. మళ్ళీ మెసేజ్ ఇచ్చాను. జవాబు లేదు. కృష్ణుడి చిత్రం చూడటంతోనే మీరు జ్ఞాపకాని కొచ్చారనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ మెసేజ్ ఇచ్చాను. దానికీ జవాబు లేదు. మరో రెండు రోజుల తర్వాత మళ్ళా మెసేజ్ ఇవ్వగా మద్రాసులోనే ఉన్నట్టు, కొవిడ్ తో ఎటూ పోలేదని ఎట్టకేలకు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ పొందిన రెండు మూడు గంటల్లో ఓ పోస్టు. ఆ పోస్టు ఎక్కడి నుంచో కాదు, "విఎకె" గారి ఉత్తరం. ఉత్తరం చిన్నదే కానీ ఘనమైనది. ఆనందాన్నిచ్చినదీ అని మాత్రం చెప్పగలను. మనసు కుదుటపడింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఈ ఉత్తరంతో భావించాను. 
విఎకె గారి ఉత్తరం ఇదే....
శ్రీకృష్ణ
- ఉదయం పదకొండు. 
జూలై 27, 2021 -
చిరంజీవి జగదీష్ గారికి
కృష్ణుడి చిత్రం చూస్తే నేను గుర్తు కొచ్చానా? హరిహరీ!
ఆ జగదొంగ, ఆ పాము తల తొక్కినవాడు,
తన మేనమామ మరణానికి కారకుడు,
బట్టలు దొంగిలించి బలవంతంగా అర్ధ నగ్న నమస్కారాలందుకొన్నవాడు,
తన మనవడి మరణానికి పద్మవ్యూహంలో పరోక్ష కారకుడు,
ఒక గూని దానితో యింటికి వెళ్ళి సంగమించినవాడు,
తన సహాధ్యాయి తనకు తినుబండారం పంచి యివ్వలేదని దుర్భర దారిద్ర్యానికి గురి చేసిన వాడు,
తన తలిదండ్రులను చెరసాలవాసానికి కారకుడు,
తనను సొంత సంతానంగా భ్రమించి ప్రేమించి పెద్ద చేసిన యశోదానందులను రాచనగరికి వెళ్ళి పూర్తిగా మరచినవాడు,
తన తలనొప్పికి వారి పాదధూళి తెప్పించుకుని స్వస్తుడైనా వారిని మళ్ళీ తిరిగి చూడని వాడు- 
వాడికీ నాకూ ఏమిటి సామ్యం? తెల్పగలరు.
ఇట్లు 
వీఏకే రంగారావు
ఆయన ఉత్తరానికి ప్రత్యుత్తరం రాస్తాను! జవాబివ్వాలిగా, ఇస్తాను రేపో మాపో....!!
రంగారావుగారి పేరులో కృష్ణ అనే మాటలున్నాయి. అలాగే ఎప్పుడు చెప్పాల్సి వచ్చిన కృష్ణ అనే పదం లేకుండా పలకరించరు. అందుకే కృష్ణుడనే మాట చెవినపడ్డప్పుడో ఫోటోనో విగ్రహమో కంటపడ్డప్పుడు విఎకెగారూ కనులముందుకొస్తారు. 

కామెంట్‌లు