మొక్కపెంచాలి (బాలగేయం):- డా.గౌరవరాజు సతీష్ కుమార్
నింగిలోని చుక్కలను కోసుకొద్దామా
నేలపైన మొక్కలుగ నాటుకొందామా
హరివిల్లునే మనం మోసుకొద్దామా
అందులోని రంగులను రాసుకుందామా!

చుక్కలన్ని కోసుకొచ్చి పాపకిద్దామా
వాటినన్ని మొక్కలుగ నాటిద్దామా
పుడమికి హరితహారం వేసేద్దామా
పుడమితల్లి ఋణం ఇలా తీర్చుకుందామా!

ఇంటిముందు ఇంటివెనుక మొక్కనాటుదామా
గుడిముందు గుడివెనుక మొక్కనాటుదామా
బడిముందు బడివెనుక మొక్కనాటుదామా‌
బాటపక్కన చెరువుపక్కన మొక్కనాటుదామా!

పూలనిచ్చె కాయలనిచ్చె మొక్కపెంచుదామా
పండ్లనిచ్చె కూరలనిచ్చె మొక్కపెంచుదామా
మందులిచ్చె మోకులిచ్చె మొక్కపెంచుదామా
కూడుగూడుగుడ్డనిచ్చె మొక్కపెంచుదామా!

వానలిచ్చె గాలినిచ్చె మొక్కపెంచాలి
మనభూమిని కాపాడే మొక్కపెంచాలి
జీవులనుకాపాడే మొక్కపెంచాలి
అందుకే మనమంతా మొక్కనాటిపెంచాలి!!


కామెంట్‌లు