మొదటగా నవీన గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ కొన్ని మాటలు చెప్పదలచుకున్నాను. 34 - 37 సంవత్సరాల క్రితం మా నాన్నగారు స్వధర్మ స్వరాజ్య సంఘం (మద్రాస్) వారికి పదమూడు రాతప్రతులు ఇచ్చారు. ఇవన్నీ స్కాంద పురాణనికి సంబంధించినవే. ఇవి రాశారన్న విషయమే తెలీదు. మా నాన్నగారూ లేరు. ఈ రాతప్రతులందుకున్న బివిఎస్ఎస్ మణిగారూ లేరు. కారణాంతరాలవల్ల ఇవి అచ్చవలేదు. అయితే మణిగారి మనవరాలు ఈ ప్రతులను మాకివ్వడం కోసం ప్రయత్నించకపోలేదు. మద్రాసులో మేమున్న ఇంటికోసం వాకబు చేసారు. కానీ ఫలితం లేకపోవడంతో వీటిని తమ దగ్గరే ఇంతకాలం పదిల పరచుకోవడం నాకు ఆశ్చర్యమేసింది. అడిగేవారెవరూ లేరు కదాని వీటిని పక్కన పడేయక జాగర్త చేసి కొంత కాలం క్రితం మా అన్నయ్యకు కాంటాక్టులోకి రావడంతో ఇప్పుడివి నాకు 2021 ఆగస్టు 2వ తేదీన పోస్టు ద్వారా అందుకున్నాను. వీటిని రిజిస్టర్డ్ పోస్టులో పంపించినట్టు నవీనగారు చెప్పినప్పటి నించీ మనసంతా ఈ ప్రతులపైనే ఉంది.
ఎప్పుడు అందుకుంటానా ఎప్పుడు పార్సిల్స్ విప్పి చూస్తానా అని. అది ఈరోజు జరిగింది. మధ్యాహ్నానికి రెండు పార్సిల్స్ అందుకున్న మరుక్షణమే టైపింగ్ వర్క్ ఆపి రాతప్రతులను వేళ్ళతో స్పర్శించి చూస్తుంటే మా నాన్నగారిని స్పర్శించినంత ఆనందం వేసింది. ఈ పదమూడు నోటుపుస్తకాలూ మామూలుగా తయారైనవి కావు. మా నాన్నగారు తెల్ల పేజీలు కొనుక్కొచ్చుకుని వాటిని నోటు పుస్తకాల
రూపంలో కుట్టి వాటన్నింటికీ అట్టలు వేయడం అలవాటు. ఆ తర్వాత ప్రతీ పుస్తకంలోనూ శ్రీమాత్రే నమః, మొదటి పేజీలో పుస్తకం పేరు, తన పేరు, రాసుకున్న తర్వాత రాయడం మొదలుపెడతారు. ఎప్పుడు కొత్తది రాయడం మొదలుపెట్టినా ఈ పద్ధతినే పాటించేవారు. పైగా ఇంట టేబులు, కుర్చీ వంటివి లేవు. నేలమీద ఓ చిన్న చాప లాటిది వేసుకుని దానిమీద కూర్చుని రాయడమే.
ఆయన కూర్చునే చోటు పక్కనే తన గురుత్రయం ఫోటోలు ఉంటాయి. తిరువేంకటకవులు, కావ్యకంఠ గణపతి మునిగారి ఫోటో, హరికథా పితమహులు ఆదిభట్ట నారాయణ దాసుగారివి తప్పనిసరిగా ఉండేవి. అలాగే వాళ్ళ నాన్నగారి ఫోటో ( మా తాతగారు) కూడా ఉండేది. అలాగే పక్కనే అమరకోశం పుస్తకం, గణపతి మునిగారి పుస్తకం, ఆయన ఓ చిన్న పుస్తకంలో రాసుకున్న శ్లోకాలు, ఓ ఫౌంటెన్ పెన్ను తప్పనిసరిగా ఉండేవి.
రాతపని లేనప్పుడు అమరకోశం తిరగేసేవారు. తెల్లపేజీలు, డైరీ, జాతక చక్రాల నోటుపుస్తకం, మనియార్డర్ ఫామ్స్, తాంబూలం పెట్టె, వక్కలు ఉంచుకునే వారు. తనను కలవడానికి ఎవరో ఒకరు వచ్చేవారు. వారూ నేలమీద కూర్చోవలసిందే. నాకు ఊహ తెలసినప్పటి నుంచీ ఇంట్లో రాసుకున్నాసరే లేక తను పని చేసిన శ్రీ శారదా విద్యాలయ బాలికల పాఠశాలకు వెళ్ళి అక్కడైనా నేలమీద కూర్చునే రాసుకునేవారు.
పేజీలకు పేజీలు ఎంత ఓపికగా రాసేవారో చెప్పలేను. అలా రాసిన పుస్తకాలలోనివే ఇప్పుడు నేనందుకున్న పదమూడు నోటు పుస్తకాలు. అవి, 1. స్కాంద పురాణం - వైష్ణవ ఖండం - శ్రీ వేంకటాచల మాహాత్మ్యం/ 2. శ్రీ బదరికాశ్రమ మాహాత్మ్యం/ 3.స్కాందపురాణం - కౌమారికా ఖండం - ఇవి నాలుగు భాగాలు / 4. అయోధ్యా మాహాత్మ్యం / 5. అరుణాచల మాహాత్మ్యం / 6. జగన్నాథ క్షేత్ర మాహాత్మ్యం / 7. స్కాందపురాణం - ద్వితీయభాగం / 8. వైశాఖ మాస మాహాత్మ్యం / 9. కార్తీక మాహాత్మ్యం / 10. మార్గశీర్ష మాహాత్మ్యం.
ఇవన్నీ చూస్తుంటే మా నాన్నగారు రాసే తీరు కళ్ళముందు కదలాడాయి. మాకన్నా మా అమ్మకు ఎన్నో విషయాలు చెప్పుకున్నట్టు నా దగ్గరున్న ఆయన డైరీల వల్ల తెలిసింది. తమ గురుత్రయం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుండే వారో. కానీ అప్పట్లో అవి వినడానికి ఆసక్తి చూపేవాడిని కాను. ఎంతసేపూ పురాణాలేనా అని అనిపించేది. అంతేకాదు, ఇవి తప్ప ఇంకేవీ ఆయనకు తెలీదేమో అనుకునేవాడిని. ఉన్నప్పుడు ఆయన ప్రాధాన్యం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడేమో చూడాలనుకున్నా చూసే వీల్లేకుండా పోయింది.



addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి