మన భాష తెలుగు--తెలుసుకుంటే వెలుగు--తెలుగు ఒడిలో...13:-వ్యాసకర్త: --రాజావాసిరెడ్డిమల్లీశ్వరి

 మామిడి చెట్టు
వేసవికాలం వస్తోందంటే మల్లెలలతో పాటు మామిడి కోసము ఎదురు చూస్తారందరూ.  ఆ మామిడి ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, భృంగాభీష్టము, మధుదూత, మధూళి, మన్నమన్మధాలయము, మాకందము, మావి, మావిడి, రసాలము, వసంత ధూత, వసంత ద్రుమము, సహకారము, శీధు ధూత, వసంతద్రుమము, , శీధు రసము, స్త్రీ ప్రియము, వంటి పేర్లతో పిలువబడుతున్నది. కాగా కొండమామిడి, ముంతమామిడి వంటి రకాలుగా ఉన్నదీ మామిడి.
మావికొమ్మను అల్లుకున్నది మాధవీలత – అంటూ కవిత్వంలో వర్ణించబడిన మామిడి.. చూతపల్లవముల మేసి. గండు కోయిలకూ యన్నది – అంటూ వర్ణించబడిన మామిడి, కాండాన్ని రకరకాల వస్తువుల తయారీకి, ఆకులు గడపల  తోరణాలకి, కాయల్ని – పళ్ళనీ మనకాహారంగా ఉపయోగపడేలా చేస్తూ మనకి  ఆరోగ్యాన్ని ఇస్తున్న మామిడి గురించి మన భాషలో ఉన్న సామెతలను చూద్దాం. 
మావిళ్ళు కాస్తే మశూచి కాలు మెండు. మావిళ్ళకు మరణాలు చింతలకు సిరులు. మామిడి చెట్టుకు మడిగుడ్డ కట్టి దొంగ ఎక్కరులే అన్నట్లు,  మామిడి కాయలు తరిగితే కత్తిపీట దాదర పులుస్తుందా. మామిళ్ళను మంచు చెఱచును. మావిళ్ళను నరికి మోదుగలు నాటినట్లు... అంటూ ఎన్నో సామెతలు చెప్పబడ్డాయి .
మామిడి గురించి. 
“కమ్మని తేనె బిందువులు కాల్వలు గట్టెడు పూలదాన! గా
నమ్ముల విందుసేయు పికనాథులు మెట్టినదాన !చంచరీ
కమ్ములు మంజుల ధ్వనుల గాఢరతిన్ నినుగూడి, నీచ వృ
క్షమ్ముల వంక బోవనివిగా నొనరింపు రసాల సాలమా” 
ఓ సహకారామా! ఓ రసాలమా! కోకిల కూతల చేతి మనోహరమైన దానా! ఝమ్మని కలధ్వనులు చేస్తూ భ్రమించే ఈ భ్రమరమును నీయందే ఆసక్తికల దానినిగా చేసుకో.  పనికిమాలిన వేప, వెదురు వంటి చిల్లర చెట్లు వైపు దానిని పోనీయకుండా చూచుకో. అది నీ విధి సుమా! అది నీకే శోభ సుమా! – అనేది పై పద్యం యొక్క అర్థము. దీనిని జగన్నాథ పండితరాయలు చెప్పారు. 
కాగా మన్మథుడికి గల అయిదు బాణాలలో ఈ మామిడి ఒకటి. చూత (మామిడి) పల్లవముల మెసవిన గండు కోయిల గండు స్వరం మన కాప్లాన్నిచ్చేదే కదా. 
మామిడి కాయ అనగానే ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు గుర్తొస్తాయి కదా. మామిడి తాండ్ర సరేసరి. అది మామిడి పండు గుజ్జుతో తయారు చేస్తారు. కాగా మామిడి ఆకులు, పండ్లరసం ఆరోగ్య ప్రసాదాలే. 
అయితే నాలుగు దిక్కులను  సూచించే నాలుగు కొమ్మలుగల మామిడి చెట్టొకటి వేదకాలం నాటిదిగా చెప్పబడుతోంది. అది కాంచీపురంలోని ఏకాంబరేశ్వరస్వామి ఆలయంలో ఉంది. చెట్టు తీపి, చేదు, పులుపు, ఉప్పు  అనే నాలుగు రుచుల కాయలను కాస్తుందట. మరి విశేషమే కదా. అంత గొప్ప మామిడి చెట్టు గురించి –
“కొమ్మ కొమ్మకును పూవులు పండ్లున్ 
కమ్మతావి కలకాలము మాకం
దమ్మ! చెల్లెనని కుందకుమా! తౌ
సమ్ము మాన్పగల విప్పుడు నీడన్” – (భావతరంగాలు అంటూ ఓదార్చాడు కవి.
ఇలా మన తెలుగు  సాహిత్యం ప్రతి దానిని
సొంతం చేసికొని వాటితో మానవ మనస్తత్వం మొదలు
ఎన్నో మంచి వ్యక్తీకరణలను మంచి పదజాలాన్ని  మనకందించింది. అందుకే తెలుగు చదవాలి...చదివించాలి. 

కామెంట్‌లు
Unknown చెప్పారు…
మల్లీశ్వరి గారూ! మామిడి గురించి చెప్పారు!కొన్ని
తెలియని పదాలు,పద్యము తెలుసుకున్నాను,!
మీరిట్లాగే రాస్తుండాలనీ కోరుకుంటూ...
సుమిత్ర నూతలపాటి!