*అమాయకునికి పట్టిన అదృష్టం* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక అమాయకుడు వున్నాడు. అమాయకుడంటే పెద్దగా తెలివితేటలు ఏమీ లేనోడన్నమాట. ఒకసారి వాడు బతకడానికి ఏదయినా యాపారం చేద్దామని బట్టల మూట నెత్తిన పెట్టుకోని ఒకొక్క వూరే తిరుగుకుంటా చీకటి పడే సమయానికి ఒక అడవిలోనికి వచ్చినాడు. అప్పటికే బాగా తిరిగి తిరిగి అలసి పోవడంతో బట్టల మూట ఒక చెట్టు చాటున దాచిపెట్టి ఆ దారిలోనే అడ్డంగా పడి నిద్రపోయినాడు.
అది అమావాస్య. ముందేముందో వెనకేముందో తెలియనంత చిక్కని చీకటి. ఆ చీకట్లో కొందరు దొంగలు దొంగతనానికని ఆ దారిలోనే పోతా వున్నారు. వీడు దారి నడుమ పడుకోనున్నాడు గదా... దాంతో ఒక దొంగ చూసుకోక కాలు తగిలి దభీమని కిందపడినాడు. వాడు బాధతో “ఎవడోగానీ చూడు... దారి కడ్డంగా ఎంత పెద్ద మొద్దు వేసినాడో" అన్నాడు.
వాని కాలు తగలడంతో నిద్ర లేచిన అమాయకుడు “ఎవర్రా మీరు...  బంగారంలాంటి మనిషిని పట్టుకోని మొద్దంటారా... కొంచమన్నా బుద్దుందా మీకు" అని అరిచినాడు. ఆ మాటలు విన్న దొంగలు "అరెరే... ఈడెవరో మనిషున్నాడే" అని వెంటనే తిరిగి వచ్చి వాన్ని పట్టుకున్నారు. కాగడా వెలుగులో చూస్తే వాడు మట్టి గొట్టుకుపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, మాసిపోయిన గడ్డంతో ఒట్టి పేదోనిలెక్క కనబన్నాడు. దాంతో ఒక దొంగ "పద పద... వీని మొగం చూస్తే ఇళ్ళ ముందు అడుక్కుతినేటోని లెక్క వున్నాడు. వీని దగ్గర ఏముంటాయి" అన్నాడు.
ఆ మాటలకు ఆ అమాయకుడు కోపంగా "ఏందయ్యోయ్... తిరిగి తిరిగి బట్టలు మాసినంత మాత్రాన మరీ అంత తక్కువ చేసి మాట్లాడ్డమేనా... నేనేం అడుక్కుతినేటోన్ని గాదు. యాపారస్తున్ని. కావాలంటే చూడండి ఆ చెట్టుపక్కన బట్టల మూటలు" అన్నాడు. దాంతో దొంగలు వాన్ని పట్టుకోని తలా ఒక తన్ను తన్ని బట్టల మూట గుంజుకోని పోసాగినారు. అది చూసి వాడు వురుక్కుంటా వాళ్ళకు అడ్డం పోయి “అనా... అనా... ఈ బట్టలు కట్టుకుంటారా... అమ్ముకుంటారా" అనడిగినాడు.
దానికి వాళ్ళు "కట్టుకుంటే కట్టుకుంటాం... అమ్ముకుంటే అమ్ముకుంటాం. మధ్యలో నీకెందుకురా" అన్నారు కోపంగా. "ఏం లేదన్నా... అమ్మేటట్టయితే కొంచం తక్కువకి నాకే అమ్మండి. మూడువేలిస్తా" అన్నాడు.
"ఏంది... మూడువేలా... అంత డబ్బు యాడుందిరా నీ దగ్గర" అన్నాడో దొంగ. 
"ఏందన్నా అంత మాటంటావ్. మాంసం తింటున్నాం గదాని యెముకలు మెడలో వేసుకోని తిరుగుతారా ఎవరన్నా... డబ్బులు పై జేబులో యెందుకుంటాయి. మీలాంటి దొంగలకి కనబడకుండా లోపలెక్కడో దాచిపెట్టుకుంటాం గానీ" అన్నాడు. .
"ఆహా... ఐతే వీని దగ్గర మస్తుగ డబ్బులున్నాయన్నమాట" అనుకోని అందరూ చుట్టూ మూగి కిందామీదా అంతా వెదికి అంగీ లోపలి జేబులో దాచి పెట్టుకున్న డబ్బులన్నీ తీసేసుకున్నారు. వాళ్ళు పోతా వుంటే ఆ అమాయకుడు వురుక్కుంటా పోయి వాళ్ళకు అడ్డంపడి "అనా.. అనా.. తినడానికి కూడా లేకుండా నా దగ్గరున్నదంతా
దోచేసినారు. ఇంక నేనేం చెయ్యాలి. నన్నుగూడా మీ వెంబడే తీసుకోని పోండి. మీరేం చెయ్యమంటే అది చేస్తా. ఏదో తినడానికి ఇంత అన్నం పడేస్తే సాలు” అని అడుక్కోసాగినాడు. 
దాంతో వాళ్ళు "సరే... రా... జాగ్రత్త. మేము చెప్పినట్టే చెయ్యాలి చూడు" అని తీసుకోని పోయినారు.
వాళ్ళు ఆ రోజు ఆ అమాయకుడుండే వూరికే దొంగతనానికి పోయినారు. ఒక ఇల్లు బాగా కనబడడంతో దాంట్లోకి దూరినారు. వీడు గూడా వాళ్ళతో బాటు లోపలికి దూరతా "అనా... అనా... లోపల ఏం చేయాల" అనడిగినాడు. 
"ఏముంది... చప్పుడు గాకుండా బంగారం, వెండి దొరికినేవి దొరికినట్లు నున్నగా మూట గట్టేసెయ్" అన్నాడు. దానికి వాడు "వెండి, బంగారమా... ఎట్లుంటాయవి" అని మళ్ళా అడిగినాడు. “ఏముందిరా... పచ్చదంతా బంగారం, తెల్లదంతా వెండి... ఆ మాత్రం తెలీదా" అన్నారు వాళ్ళు
సరేనని ఆ అమాయకుడు లోపలికి పోయినాడు. చప్పుడు గాకుండా ఒకొక్క గదే దాటుతా వంటింట్లోకి పోయినాడు. అక్కడ ఒక అవ్వ పండుకోనింది. ఆ గదిలో సత్తుగిన్నెలన్నీ తెల్లగా మెరిసిపోతావుంటే, కంచు పాత్రలన్నీ వచ్చగా ధగధగలాడతా కనబన్నాయి. ఆహా... ఎంత బంగారం, ఎంత వెండి అని సంబరపడిపోతా వాటిని ఒకొక్కటే తీసి మూటలో వేసుకోసాగినాడు. కాసేపటికి మూట నిండిపోయింది. ఇంగ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే వంటింట్లో చక్కెర, నెయ్యి, సేమ్యాలు, పాలు కనబన్నాయి. అవన్నీ చూడగానే వానికి నోరూరింది. "అబ్బ! పాయసం తిని ఎన్ని నాళ్ళయింది. వాళ్ళందరూ దొంగతనం పూర్తి చేసేలోగా పాయసం చేసుకొని తాగేద్దాం" అనుకోని పొయ్యి అంటించి పాయసం చేయసాగినాడు.
ఆ గదిలోనే అవ్వ పండుకోనింది గదా... ఆమె చేయి కడుపు మీద పెట్టుకోనింది. కాసేపటికి నిద్రలో ఆ చేయి కిందకు చాచింది. అది చూసిన అమాయకుడు అవ్వ పాయసం కోసం చేయి చాపుతుందేమో అనుకోని "వుండే ముసల్దానా... చేసేటోనికన్నా చూసేటోనికే తొందరెక్కువని... కాసేపు ఆగలేవా... ఐతూనే ఇస్తాగానీ" అంటూ చేయి తీసి మరలా కడుపు మీద పెట్టినాడు. కాసేపటికి మరలా నిద్రలో అవ్వ చేయి పక్కకు చాపింది. అది చూసిన అమాయకుడు. "అరెరే... ఏందా తొందర... ఎప్పుడూ తిండిమొగం చూడనిదాని మాదిరి... ఒక్క నిమిషమాగు ఐపాయలే" అంటూ గిన్నె దించి... గంటెతో వేడి వేడి పాయసం తీసుకోనొచ్చి అవ్వ చేతిలో పోసినాడు.
అంతే... ఒక్కసారిగా చేయి సుర్రుమనేసరికి... అవ్వ "ఓరి నాయనోయ్... ఓరి దేవుడోయ్... నా చేతిని ఎవడో కాల్చేసినాడురోయ్" అంటూ గట్టిగా అరుస్తా పైకి లేసింది. ఆ అరుపులకు భయపడిన అమాయకుడు పరుగెత్తబోయి మూటను కొట్టుకున్నాడు. అంతే దానిలోని గిన్నెలన్నీ ధనధనధన పెద్ద చప్పుడు చేస్తా కిందబడినాయి. అంతే ఆ చప్పుళ్ళకు, అవ్వ అరుపులకు ఇంట్లో వాళ్ళేగాక వీధి వీధంతా వులిక్కిపడి లేచినారు. దొంగలంతా సామాన్లు తీసుకోని పారిపోతా కనబడ్డారు. వెంటనే జనాలంతా ఎక్కడోన్ని అక్కడ పట్టుకోని మెత్తగ తన్నినారు. ఆ అమాయకుడు ఆ వూరోడే కాబట్టి, వాని గురించి తెలుసు కాబట్టి వాన్ని ఎవరూ ఏమీ చేయలేదు. తరువాత జరిగిందంతా తెలుసుకోని "రేయ్.. నీవు అమాయకునివయినా చానా మంచి పనే జరిగింది. ఈ దొంగలు అందరు దొంగల్లా అట్లాంటిట్లాంటి అల్లాటప్పా దొంగలు కాదు. పెద్ద గజదొంగలు. చుట్టుపక్కల ఏడేడు పధ్నాలుగూర్లలో వీళ్ళ పేరు చెబితేనే హడల్. వీళ్ళని ఎవరు పట్టిస్తారో వాళ్ళకి లక్ష రూపాయలిస్తామని ఎన్నోసార్లు దండోరా వేసినారు. కానీ ఎవరూ పట్టుకోలేక పోయినారు. ఈ రోజు నీవల్ల దొరికినారు" అని చెప్పి వాన్ని, దొంగల్ని తీసుకోని రాజు దగ్గరికి పోయినారు.
రాజు జరిగిందంతా తెలుసుకోని పడీ పడీ నవ్వుతా "ఏదేమైనా నీవల్లే వాళ్ళు పట్టుబన్నారు" అని చెప్పి ఆ లక్ష రూపాయలు వానికే ఇచ్చినాడు. దాంతో వాడు హాయిగా పెండ్లి చేసుకోని పిల్లాపాపలతో కాలు మీద కాలేసుకోని బతికినాడు.

కామెంట్‌లు