ఆకాశవాణి నాటకాల హీరో!: -- అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాదు

 విజయవాడ ఆకాశవాణి సర్వకళలకాణాచి లా విలసిల్లిన రోజులలో నాటకాలంటే చెవికోసుకునేవారు.నేటి సినీనటీనటులకున్నంత క్రేజ్  40ఏళ్ల క్రితం రేడియో లో పనిచేసే వారికి ఉండేది. ముఖ్యంగా గాయకులు  నాటకాలు వేసే వారు  ఎనౌన్సర్ ల గాత్ర మాధుర్యం శ్రోతలని కట్టిపడేసేది. ఆ ఎనౌన్సర్లలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని మధుర స్మృతులు పంచుకున్నారు  శ్రీ ఎ.బి.ఆనంద్ గారు. నేడు మనవలు మునిమనవలతో హాయిగా విజయవాడ లో ఉంటున్నారు. అసలు పూర్తి పేరు ఆళ్ళ బ్రహ్మానంద రెడ్డి. శ్రీ నండూరి సుబ్బారావు గారి వలన ఎ.బి.ఆనంద్ గా రేడియో లో స్థిరపడ్డారు. హరహరమహాదేవ ఆయనకు మంచిపేరు గుర్తింపు తెచ్చిన  నాటకం.ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు ప్రోగ్రాం లో శిష్యుడిగా  శ్రీ గురుభ్యోనమ: అందరినోట పలికేది.ఎస్. ఆర్.ఆర్.కాలేజీ లో చదువుతుండగా బి.ఎ.ఫైనల్ విద్యార్ధి ఆనంద్ చేత ఆడిషన్ ఫామ్ నింపించి నాటకాలలో రంగప్రవేశం చేయించారు నండూరి వారు.వింజమూరి లక్ష్మి గారు అన్నపూర్ణ గా నటించిన ఆనాటకం లో హీరో శ్రీ కృష్ణ దేవరాయలు గా ఆనంద్ నటించి కవి రచయిత శ్రీ వింజమూరి శివరామారావుగారి ప్రశంసలు పొందారు. ఆయనను సెలక్ట్ చేసింది బందా కనకలింగేశ్వరరావుగారు.


 నా బాల్య స్మృతులు

నా పేరు ఆరుమళ్ల బ్రహ్మానంద రెడ్డి ఆకాశవాణిలో ఏ.బి ఆనంద్. మా నాన్న సుబ్బారెడ్డి  వారి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో మా నాయనమ్మ చాలా గారాబంగా పెంచింది. చేతి నిండా డబ్బు ఉంది అడ్డు చెప్పే పెద్దలు లేరు. దానితో అరిషడ్ వర్గాలు  వచ్చి చేరాయి. 120 ఎకరాల పొలాన్ని 20 ఎకరాలుగా చేశాడు. ఆయన జీవితంలో అనుకోకుండా ఇందుపల్లిలో మలయాళ స్వామీజీ  ఉపన్యాసాలు జరుగుతుంటే దానికోసం వెళ్లాడు ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడ కాపలాదారు లోపల స్వామీజీ  ఏకాంత సేవ లో ఉన్నారు ఇప్పుడు కలవడానికి వీలు లేదు అంటే ఏకాంతరా మేము చూస్తాం అన్న మాట స్వామీజీకి వినిపించేలా చెప్పడం ఆయన విన్నారు. ఆ సాయంత్రం సభ జరుగుతున్న వేళ దాని ఎదురుగా  తన మిత్రులతో ఆయన ఉపన్యాసం ప్రారంభించారు దానితో అవతల ఉన్న ప్రేక్షకులంతా ఇటు వచ్చి చేరారు అది ఆయన జీవితంలో జరిగిన పెద్ద మార్పు. తరువాత స్వామీజీ పిలుపుతో ఏర్పేడు వెళ్లి వారి ఆశీస్సులతో  గీతా సిద్ధాంతం,  గీతా సందేశం అనే రెండు గ్రంథాలను రాశారు. గాంధీజీ మరణించినప్పుడు హిందూ జాతి పతన కారణాలను రాశారు. నేను చదవడానికి ఉపక్రమిస్తే అది చదివే వయసు కాదు నీది నీ చదువు చదువు నీవు పెరిగి పెద్దవాడైన తరువాత ఇవన్నీ సొంతం చేసుకో అని సలహా ఇచ్చారు ఆయన చెప్పినట్లే చేశాను. నాకు అక్షరాభ్యాసం చేయించింది మా అన్నయ్య కోటిరెడ్డి, పాఠాలు చెప్పి మా తేలప్రోలు గ్రామానికి అక్షరభిక్ష పెట్టినవారు పాటిబండ శ్రీమన్నారాయణ గారు  గురువుగారి ఇంట్లోనే రాత్రులు గడిపాం. ఉదయం లేవగానే  కాలవకు తీసుకెళ్లి ముందు ఈత నేర్పి ఆ తర్వాత ఎనిమిది రకాల ఆసనాలతో ఎలా ఈదాలో చెప్పిన గురువులు. మమ్మల్ని ఉదయమే లేపి కిలోనరా దూరంలో ఉన్న కొత్తకోటికి నడిపించి తీసుకువెళ్లి  ఆపాదమస్తకం, ఒండ్రు మట్టి పూసి అది వేడెక్కిన తరవాత  జీవితంలో కాలువలో రకరకాల విన్యాసాలు చేసి అలసి ఇంటికి వచ్చి చదువులో కూర్చునేవాళ్ళం ఇది మా దినచర్య. ఉన్నత పాఠశాలకు వచ్చిన తరువాత  అక్షరాల అర్ధాన్ని జీవితాంతం మర్చిపోకుండా ఉండేలా చెప్పిన ఏకైక గురువు  బూర్గుల పురుషోత్తమ శాస్త్రి గారు మా హెచ్.ఎం పోలు. సుబ్బారెడ్డి గారు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి  మంచి మార్కులు వచ్చిన వారితో మాత్రమే కార్యక్రమాలను చేయించే ఏర్పాటు చేశారు. నా శిష్యులతో నే చేసిన మొదటి నాటకం దొంగ, పోతుకూచి సాంబశివరావు గారు  రచించినది. అక్కడ చదువుతూనే మా గ్రామంలోనే కాక పూర్ల లాంటి అనేక గ్రామాలలో ఆ నాటకాన్ని ప్రదర్శించడంతో మంచి పేరు తెచ్చుకున్నాం 1958 వ సంవత్సరం వరకు లయోలా కళాశాలలో  విశ్వవిద్యాలయ నాటక పోటీలకు వెళ్లిన దాఖలాలు లేవు  నేను వెళ్ళగానే నాటకం కోసం ప్రయత్నం చేస్తే ఫాదర్ మత్తయాస్ ప్రిన్సిపాల్ నువ్వు చదవడానికి వచ్చావా అంటే నాటకాలు వేయడానికి వచ్చావా అంటే నాటకాలు కోసమే అని చెప్పారు. దాంతో  హిత శ్రీ గారితో  విముక్తుడు నాటిక వ్రాయించి విశాఖ వెళ్లి ప్రదర్శించి బహుమతి తీసుకువచ్చాను. తరువాత సంవత్సరం నాటకాల కోసం ఎస్.ఆర్.ఆర్ కాలేజీకి వచ్చి  అనేక నాటకాలు చేస్తున్న సందర్భంలో రేడియో ప్రవేశం నండూరు సుబ్బారావు గారి వల్ల జరిగింది. మా గ్రామంలో ఉన్నప్పుడు మేము ఆడని ఆటలు లేవు, పాడే పాటలు లేవు మేము చేయని అల్లరి లేదు. మమ్మల్ని చూసి పెద్ద వాళ్ళు ఉలిపి కట్టి ఊర్లోకి వస్తే పిల్లజల్ల జాగ్రత్త అనేవాళ్ళు  అంత అల్లరి పిల్లలుగా పేరు తెచ్చుకుని మంచి మార్కులు సంపాదిస్తున్న విద్యార్థులగా అందరి మన్ననలను పొందాము. పాటిబండ వారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాత్రింబగళ్ళు ఆడపిల్లల తోనే ఉండేవాళ్ళం  ఒకే కుటుంబంగా  అన్నా చెల్లెలు,  అక్క తమ్ముడుగా ఉండేవాళ్ళం అందరితో కుటుంబ సంబంధాలు ఉండేవి. మా అన్నయ్య హై స్కూల్లో మాస్టారు కావడంతో  అన్ని ఆటలను నేను  అజమాయిషీ చేసేవాణ్ణి  దాంతో స్కూల్ లీడర్షిప్ నాకు వచ్చింది. స్త్రీ పాత్రలు స్త్రీలే నిర్వహించాలి అన్న పట్టుదలతో నా స్నేహితురాండ్రతో  తెలుగు హిందీ  నాటికలు వేదిక మీద ప్రదర్శించే వాణ్ని. హిందీ మాస్టార్లు కాజా వెంకటేశ్వరరావు-  రంగారావుగారు దర్శకులు  ప్రఖ్యాత సినీ నటులు కోట శ్రీనివాసరావు సుత్తి వీరభద్ర రావు వాళ్ళంతా నా సహనటుడు  దర్శకుడు జంధ్యాల మాకు నాటకాలు రాసి ఇచ్చేవారు.  ఆ అనుభవాలతో ఈనాడు ఆకాశవాణిలో అనేకమంది శ్రోతల అభిమానాన్ని చూరా గొనడం ఆకాశవాణి నాకిచ్చిన అదృష్టం.


కామెంట్‌లు