ఈరోజు టెడ్డీ బేర్ రోజండోయ్:-- యామిజాల జగదీశ్

 సెప్టెంబర్ 9 -  ఈరోజుకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే టెడ్డీ బేర్ డే అని ఈ రోజున జరుపుకోవడం. 
అమెరికా అధ్యక్షుడిగా ఉండిన రూజ్వెల్టుని టెడ్డీ అనే ముద్దు పేరుతో పిలిచేవారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయనొకమారు వేటకు వెళ్ళారు. అప్పుడాయనకు ఓ ఎలుగుబంటి పిల్ల కనిపించింది. అయితే దానిని చంపాలనిపించక ఆయన వెనక్కు వచ్చేసారు. ఈ విషయం మరుసటిరోజు పత్రికల్లో వచ్చింది. అది చదివిన ఓ వనిత చిన్న ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి రూజ్వెల్ట్ అనుమతితో ఆ బొమ్మకు టెడ్డీ అని పేరు పెట్టింది. నిజానికి ఈ సంఘటన నూట ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నాటిది. అయితే టెడ్డీ బేర్ డే అనేది మాత్రం 2000 వ సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నారు. 
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఈరోజు కష్టంగానే ఉండొచ్చు. రేపు ఇంకా దారుణంగా ఉండొచ్చు. కానీ రేపటి మరుసటి దినం అంటే ఎల్లుండి బాగుండొచ్చు. పరిస్థితులు మారవచ్చు. జీవితంలో ఓ వెలుగు కనిపించొచ్చు అన్నారు చైనాకు చెందిన పారిశ్రామికవేత్త 
Jack Ma. 

ఆదుకునేందుకు ఎవరూ లేరు
చేతిలో చిల్లి గవ్వ లేదు
అసలు మనల్ని మనిషిగా చూడటానికి 
ఒక్కరూ లేకపోవచ్చు....
ఎవరెలా అనుకుంటేనేం...
మన ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకూడదు.
ఇదుంటే అన్నీ సర్దుకున్నట్టే....తప్పకుండా ఏదో ఒకటి సాధించొచ్చు. ఇందుకు ఉదాహరణగా మార్గరెట్ స్టీఫ్ కథనాన్నే చెప్పుకోవచ్చు.
జర్మనీలోని జియెన్జెన్ అనే నగరానికి చెందిన వారే మార్గరెట్ స్టీఫ్. ఈమె 1847లో జన్మించారు. నలుగురు పిల్లల్లో ఆమె మూడవది.
మార్గరెట్ కి ఏడాదిన్నర వయస్సప్పుడు జ్వరమొచ్చింది. ఈ జ్వరంతో ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. పోలియోకి గురైంది. కుడి చెయ్యి కూడా పాక్షికంగా దెబ్బతింది.
ఆ కాలంలో పోలియోకి మందో ఇంజక్షన్లో లేవు. ఆమె తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. తమ కూతురుకి భవిష్యత్తే లేదనుకున్నారు.
కానీ మార్గరెట్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.జబ్బే కదా...అదలా ఉండనీ...నేను నా పని చేసుకుపోతాను...నేనుంటున్న ఊళ్ళో తప్పక పైకొస్తాను అని గట్టిగా అనుకుంది మార్గరెట్. 
తల్లిదండ్రులతో పట్టుబట్టి స్కూల్లో చేరింది. సగటు కన్నా ఎక్కువ మార్కులే సంపాదించేది. అందరితోనే ప్రేమతో మెలిగేది. ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకుంది.
స్కూలు చదువు అయిపోయింది. తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించింది 
ఆమెకు కుట్టుపని అంటే మక్కువెక్కువ. మళ్ళీ అమ్మానాన్నలతో గొడవపడి ఓ టైలరింగ్ స్కూల్లో చేరింది మార్గరెట్.
కాళ్ళు పని చేయవు. కుడి చెయ్యి కూడా సరిగా పని చేయదు. ఈ అమ్మాయి సూదిలో దారం ఎక్కించగలదా అని ఆమెను హేళన చేశారు. నవ్వేవారు.
 అయినప్పటికీ ఆమె వారి హేళన మాటలను, నవ్వులను పట్టించుకోలేదు. తానెంతో ఇష్టపడి ఎంచుకున్న టైలరింగులో ఎలాగైనాసరే రాణించాలనే నిర్ణయానికొచ్చింది. కొన్నేళ్ళ తర్వాత ఆమె ఓ మంచి టైలర్ గా గుర్తింపు పొందింది.
రకరకాల బట్టలు కుట్టడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. తనున్న నగరంలోనే ఓ టైలరింగ్ దుకాణాన్ని ప్రారంభించింది.
అనతికాలంలోనే ఓ రెడీమేడ్ షాప్ ప్రారంభించింది. అందులోనూ ఆమె విజయం సాధించింది.
1880లో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఇలా బట్టలు కుట్టడంతో ఎందుకు సరిపెట్టుకుని కోవాలి...మరేదైనా చేయాలనుకుంది మార్గరెట్.
అప్పట్లో పిల్లలు ఆడుకోవడానికి చెక్క బొమ్మలు, పింగిణీ బొమ్మలు మాత్రమే ఎక్కువగా ఉండేవి. అయితే చిన్న పిల్లలను పడుకోపెట్టడానికి లాలించడానికి ఏదైనా మెత్తని బొమ్మ తయారు చేస్తే ఎలా ఉంటుందా అనుకున్న మార్గరెట్ కి మెరుపులాంటి ఓ ఆలోచన వచ్చింది.
వెంటనే ఓ గుడ్డలో దూదిని ఉంచి ముందుగా ఓ ఏనుగు బొమ్మ తయారు చేసింది. అలా చేసిన బొమ్మలను ఆమె మిత్రులకు బంధువులకు ఇస్తూ వచ్చింది.
ఆ బొమ్మలతో పిల్లలు ఆనందంగా ఆడుకోవడం గ్రహించిన మార్గరెట్ ఇదే తరహాలో సింహం, ఎలుక, పులి ఇలా రకరకాల జంతువుల బొమ్మలు తయారుచేసి అమ్మడం మొదలుపెట్టింది.  ఇంతలో రిచర్డ్ ఎలుగుబంటి స్కెచ్ వేసి చూపిస్తాడు. ఆ స్కెచ్ నచ్చి మార్గరెట్ స్టీఫ్ టెడ్డీ బేర్ బొమ్మ తయారు చేస్తుంది. ఈ బొమ్మకు గిరాకీ పెరిగింది.
అదే సమయంలో అమెరికాలోనూ ఓ మహిళ (Morris Michtom) ఇలాంటి బొమ్మే తయారు చేసింది. ఆమె కూడా తన బొమ్మకు టెడ్డీ బేర్ అని పేరు పెట్టింది.
1907లో మార్గరెట్ సంస్థ‌లో నాలుగు వందల మంది పని చేశారు. ఇంటి నుంచే బొమ్మలు తయారు చేసిచ్చే వారి సంఖ్య దాదాపు 1800. అప్పుడామె ముందున్న ఆర్డర్ .... 9,74,000 బొమ్మలు ఇంకేముంది...ఆమె వ్యాపారం జోరుగా సాగింది. తన తుది శ్వాస వరకూ ఆమె ఈ బొమ్మల తయారీకి తన జీవితాన్ని అంకితం చేసింది మార్గరెట్. ఆమె తన అరవై రెండో ఏట 1909లో మరణించింది. కానీ ఆమె ప్రారంభించిన Steiff teddy bears సంస్థ ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటగా టెడ్డీ బేర్ బొమ్మ తయారుచేసిన ఘనత మార్గరెట్ స్టీఫ్ కే దక్కింది.
టెడ్డీ బేర్ కు సంబంధించి మరి కొన్ని విషయాలు....
ఆక్స్ ఫోర్డ్ నిఘంటువులో టెడ్డీ బేర్ అనే మాట మొదటిసారిగా 1906లో కలిపారు.
ఉతికి ఎండబెట్టి ఆడుకోవడానికి వీలైన టెడ్డీ బొమ్మలను మొదటిసారిగా 1954లో తయారుచేశారు. 
ప్రపంచంలో అతి చిన్న టెడ్డీబేర్ బొమ్మను దక్షిణాఫ్రికాకు చెందిన Cheryl Moss తయారు చేశారు. ఆమె కుట్టిన టెడ్డీ బేర్ బొమ్మ సైజు కేవలం  0.29 అంగుళాలు మాత్రమే.
ఇక ప్రపంచంలోనే అతి పెద్ద టెడ్డీ బేర్ బొమ్మను కుట్టి రికార్డు పుటలకెక్కిన వారు ఓ అమెరికన్. ఈ బొమ్మ సైజు 55 అడుగుల 4 అంగుళాలు. 
ప్రపంచంలోనే అత్యధిక టెడ్డీ బేర్ బోమ్మలను సేకరించిన వారు Jackie Miley. దక్షిణ డకోటాకు చెందిన ఈమె దగ్గర 8,026 టెడ్డీ బేర్ బొమ్మలున్నాయి. ఆమె ఈ ఘనతను 2012లో సాధించారు.
టెడ్డీ బేర్ బొమ్మలను సేకరించేవారిని  ‘arctophile’ అని అంటారు.

కామెంట్‌లు