స్వేచ్ఛ విలువ (కథ) సరికొండ శ్రీనివాసరాజు

 విక్రం తన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాడు. తన మిత్ర బృందాన్ని ఆహ్వానించి ఇంట్లో పార్టీ ఇచ్చాడు. విక్రం వాళ్ళ ఇంట్లో అందమైన పంజరాలు అందులో అరుదైన జాతి రామచిలుకలు చూడ ముచ్చటగా ఉన్నాయి. "భలేగా ఉన్నాయిగా. ఈ రంగుల రామచిలుకలు నేను ఎక్కడా చూడలేదురా." అన్నాడు రాము. "పక్షులంటే నీకు ఎంత ప్రేమరా. ఇంత అరుదైన పక్షులను పెంచుతున్నారు. అదృష్టం అంటే నీదిరా! ఎవ్వరి ఇళ్ళలోను ఇంత అందమైన చిలుకలు ఉండవు." అన్నాడు వీరభద్ర. విక్రం రామచిలుకలకు మంచి ఆహారం తినిపిస్తున్నాడు. పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత అందరూ ఇళ్ళకు చేరుకున్నారు..

       "ఒరేయ్ విక్రం! రేపు రెండవ శనివారం, ఎల్లుండి ఆదివారం రెండు రోజులు సెలవులు కదా! మనమంతా ఈ రెండు రోజులు ఊరి బయట ఆడుకుందాం. ఎప్పుడూ చదువు చదువు ఇదే లోకం. ఈ రెండు రోజులు మాత్రం చదువును పక్కన పెట్టి ఊరి బయట ఆడుకుందాం." అన్నాడు వాసు. వాసు ఆ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి. వాసూనే ఇలా అనేసరికి అందరూ ఒప్పుకున్నారు. ఆ మిత్ర బృందం వాసు వాళ్ళకు తెలిసిన అతను రంగయ్య అనే అతని పెద్ద తోటలో తనివి తీరా ఆడుకున్నారు. రకరకాల చెట్ల మీద రకరకాల పక్షులు ముచ్చట గొలుపుతున్నాయి. పిల్లలంతా ఆ పక్షుల కిలకిలా రావాలకు ప్రవేశించి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆడుకుంటే ఎంత బాగుండు అనుకున్నారు. "రెండు రోజులకు అంటే రంగయ్య తాతయ్య ఒప్పుకున్నాడు కానీ ఎప్పుడూ అంటే ఒప్పుకోడురా! అసలే మనది కోతుల బృందం. పండ్లు రాలగొట్టుకొని తినడం, చెట్లను పాడు చేయడం జరుగుతుంది." అన్నాడు వాసు. "రోజూ స్కూలుకు వెళ్ళడం, ఇంట్లోకి వస్తే ఇల్లు దాటి బయటికి రాకపోవడం. అబ్బో! జైల్లో ఉన్నట్లు ఉంటుంది." అన్నాడు విక్రం. "అదేంటిరా! మీ ఇంట్లో అందమైన రామచిలుకలు ఉన్నాయి కదా! వాటితో బోలెడంత కాలక్షేపం కదా!" అన్నాడు వినయ్. "ఎంతైనా తోటలో ఉన్న పక్షులను చూసిన ఆనందం ఇంట్లో పెంచే పక్షులతో రాదు. చెట్లపై గూళ్ళు కట్టుకొని స్వేచ్ఛగా తిరుగుతున్న పక్షులకు ఉన్నంత ఆనందం ఇంట్లో బందీలుగా పెంచబడే పక్షులకు ఏముంటుంది? అంత అందమైన పక్షులకు ఆనందం కరవైనందుకు బాధగా ఉంది. ఆకాశంలో ఆంగ్ల అక్షరం వి ఆకారంలో ఎగురుతున్న పక్షులను చూస్తే చూడ ముచ్చటగా ఉంది. మనకూ ఒక తోట ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది." అన్నాడు రాము.
        "ఇంట్లో బందీలుగా ఉండి, రెండు రోజులు బయట స్వేచ్ఛగా ఆడుకునేసరికి మనకు స్వేచ్ఛ అవసరం తెలిసి వచ్చింది. నేను ఎంతో ప్రాణంగా చూసుకునే ఆ పక్షులకు కూడా స్వేచ్ఛను ప్రసాదిస్తే బాగుంటుంది. అవి ఎక్కడ ఉన్నా స్వేచ్ఛగా ఉన్నాయన్న తృప్తి ఉంటుంది. లేకపోతే వాటిని రోజూ బందీలుగా చూస్తూ బాధపడటం తప్ప ఏమీ ఉండదు." అన్నాడు విక్రం. "మనమంతా మన ఇంట్లో ఖాళీ ప్రాంతాల్లో చెట్లను పెంచుదాం. చెట్ల కోసం ఖచ్చితంగా స్థలం కేటాయించాలి. ఖాళీ ప్రాంతాల్లో మొక్కలను నాటి పెంచుదాం. అటు పక్షులకూ మంచిది. పర్యావరణాన్ని రక్షించవచ్చు." అన్నాడు వాసు. అలాగే అన్నారు అందరూ. 

కామెంట్‌లు