సహృదయత....!! ( గల్పిక ):- డా. ఏ.వి. నరసింహారావు హన్మకొండ .

 నాలుగు నెలల తరువాత పార్కుకి బయల్దేరాడు రమణ మూర్తి. తనకు కరోన రావడం, హాస్పిటల్లో చేరడం, సీరియస్ గా  ఉన్న తన ఆరోగ్యం మెల్లగా కోలుకోవడం, తరువాత ఇంట్లో వాళ్ళ జాగ్రత్తలు, ఇలా నాలుగు నెలల కాలం చాప క్రింద నీరు లా జారిపోయాయి. 
తన మిత్ర బృందాన్ని కలుస్తున్న  ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.  తను ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత పార్కుకు పోవడం, స్నేహితులతో  కబుర్లు చెప్పుకుంటూ కష్ట సుఖాలు పంచుకోవడం అలవాటు అయింది. ఒక్క రోజు కూడ పార్కుకు వెళ్ళక పొతే మనస్సు  వెలితిగా ఉంటుంది. చాలా రోజుల తరువాత పార్కు కు వెల్తుంటే రమణ మూర్తి కన్నా ఆయన మనస్సే పార్కు చేరింది.
పార్కు చేరాక, అనాలోచితంగా అతని కళ్ళు, తమకంటే ముందు వచ్చి  పళ్ళు, కూరగాయలు అమ్ముకునే నర్సయ్య చిరునవ్వు పలకరింపు కోసం వెతికాయి.  కానీ అతను  కనపడలేదు.   అక్కడే దాదాపు  ముప్పై సంవత్సరాల యువకుడు కూరగాయలు పళ్ళు అమ్ముతూ  కనిపించాడు.  ఒక్క క్షణం సందేహించి, మెల్లగా అతని దగ్గరికి వెళ్లి అడగాలా? వద్దా ?అని ఆలోచిస్తూ నిలబడ్డాడు రమణ మూర్తి .
"ఏం కావాలి సార్, పళ్ళా, ఆకు కూరలా "?అన్నాడు అతను.
"అది కాదు,  ఇక్కడ ఒక పెద్దాయన కూరగాయలు అమ్ముకునే వాడూ....."
"ఆయనా.. మా నాన్న గారు సార్,  ఆయన పెద్ద కొడుకుని నేను..."
"మరి ఆయన..!!." మాట పూర్తి చేయలేక ఆగి పోయాడు రమణమూర్తి. 
ఒక్క క్షణం అతని కళ్ళలోరకరకాల భావాలు, రంగులు మారిపోయాయి. 
అతను తననుతాను కంట్రోల్ చేసికొని చెప్పాడు..
"సార్ , మా నాన్న గారికి రెండు సార్లు కరోన వచ్చింది.  మొదటి సారి వచ్చి పదిహేను రోజుల్లో తక్కువ అయ్యింది. అయితే, రెండోసారి మాత్రం మేమెంత వద్దని చెప్పినా వినకుండా, హాస్పిటల్ కివెళ్లి ఎవరికో తన ప్లాస్మా ఇచ్చారు.  అప్పుడే ఆయనకు మళ్లీ  కరోన వచ్చింది.  అప్పుటి కే  ఆయనకు ఇమ్యనిటీ తక్కువ అయ్యిందని   డాక్టర్లు చెప్పినా వినిపించుకోలేదు.  
'ప్లాస్మ ఇవ్వడం తన బాధ్యత అని, ఆ మనిషి మన మనుగడకు బ్యాంకు లోను ఇప్పించి, మన  ఇంట్లో  దీపం వెలిగించిండాని', అంటూ..' మేమెంత వద్దని వారించినా  వినకుండా, హాస్పిటల్ కి వెళ్లి తన రక్తం, పాస్మ ఇచ్చారు.  అంతే అక్కడే ఆయనకు మరోసారి కరోన వచ్చింది.  దానినుండి  కోలుకోలేక అక్కడే దానికి బలైపోయాడు'. 
అంతే,  రమణ మూర్తి కళ్ల ముందు ప్రపంచం  గిర్రున తిరిగింది.  తన పిల్లలు,  
 డాక్టర్లు చెప్పిన మాటలు తన చెవుల్లో  మారు మోగసాగాయి. 
అయితే తనకు పాస్మ ఇచ్చి ప్రాణ దానం చేసింది నర్సయ్య అన్న మాట!
తన సందేహాన్ని నివృత్తి చేసే కొనేందుకు మెల్లగా,  నిశ్శబ్దంగా 
అడిగాడు...." మీ నాన్న తన జీవితాన్ని  త్యాగం చేసి బ్రతుకించిందెవరో  తెలుసా?"
" నేనెప్పుడూ చూడలేదు సార్,  కానీ,  మా నాన్న ఎప్పుడూ అతని గురించి చెప్పేవారు. ఆయన బ్యాంకు లో పని చేసి రిటైర్ అయ్యారని,  ప్రతి రోజూ పార్కులో కలిసే వాడని,  అడగకుండానే తనకు చాలా సార్లు డబ్బు సహాయం చేసాడని...... ఆ.... అతని పేరు..... రమణ మూర్తి గారట..!.."
తరువాత మాటలు వినపడలేదు రమణ మూర్తికి. 
ఒక్క సారిగా పక్కనే ఉన్న సిమెంటు చప్టాపై కూర్చుండి పోయాడు రమణ మూర్తి.  
.....

కామెంట్‌లు