పందెం ...!! > శీరంశెట్టి కాంతరావు .రచయిత >పాల్వంచ .

 మా ఊరి చెరువుకింద వెయ్యి ఎకరాలు సాగుబడి అయ్యేవి
రెండు పంటలు ముక్కార పండేవి
నాట్లు,కలుపులు,కోతలప్పుడు ఎటు చూసినా పనిపాట్లు చేసే జనంతో కన్నుల పండువుగా వుండేది
ఆ ఏడు ఒకపక్క కోతలు కోసేవాళ్ళు కోస్తుంటే మరోపక్క కుప్ప నూర్పిళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు
పనలు ఎత్తగానే పచ్చగడ్డి మేయడానికి మందలు మందలుగా ఊరిపశువులన్నీ మాగాన్ల మీదనే ఉన్నాయి
ఎటుజూసినా జీవకళ తొణికిస లాడుతుంది
ఆకుతోట దగ్గర ఓరైతు పొలంలో ఓ ముఠా కుప్ప నుర్చుతుంది దానికి అర ఫర్లాంగు దూరంలో మరో రైతు పొలంలో మహిళల ముఠా ఒకటి మెదకడుతుంది
కుప్పనూర్చే ముఠాలో మిత్రుల మధ్య ఏదో నవ్వులాటగా మొదలైన ఓ పందెం చివరికి పంతంగా మారిపోయింది
ఎవడైతే దిగంబరంగా మెద గడుతున్న ఆడవాళ్ళ దగ్గర కెళ్ళి పంటకట్ట తెస్తాడో వాడికి బస్తా వడ్లు ఇచ్చేది పందెం
బస్తా వడ్లకోసం బుడ్డగోసిగూడా పెట్టుకోకుండా ఆడవాళ్ళ మధ్యకు ఎవడు పోతాళ్ళే అని అంతా అనుకుంటున్నంతలో ఒకతను నేను తెస్తా అన్నాడు పంతానికి
మెదకట్టే ఆడవాళ్ళల్లో అతని భార్య కూడా వుండడంతో వీడి మొహం వీడేం పోతాళ్ళే అన్న ధీమాతో మిగతా వాళ్ళంతా నువ్వెళ్ళి తెస్తే బస్తాకు బస్తా  ఇస్తా మన్నారు
అంతే! తెగించినవాడికి తెడ్డే లింగం అన్నట్టు చూస్తుండగానే ఒంటి మీది బట్టలన్నీ విప్పి అవధూత మాదిరిగా మారిపోయి మెదగడుతున్న పొలం దగ్గరికి పరుగు తీశాడు అతన్నలా చూసిన ఆడవాళ్ళంతా గగ్గోలు పెడుతూ ఆకుతోటవైపు పారిపోయారు
వెళ్ళిన వస్తాదు ఓ పంటకట్టను
చేతపట్టుకుని మరింత వేగంగా వెనుదిరిగి మిత్రుల దగ్గరి కొచ్చాడు అతని తెగింపుకి అవాక్కైపోయిన  వాళ్ళంతా బొమ్మల్లా నిల్చుండి పోయారు
ఇంతలో ఆకుతోట పక్కన్నే వుండే పెద్దవాగు ఒడ్డున ఆడవాళ్ళంతా గగ్గోలు పెట్టసాగారు
పందాన్ని గురించే వింతగా మాట్లాడుకుంటున్న
చుట్టుపక్కల పొలాల్లోని జనమంతా ఏంటాని వాగు దగ్గరికి ఉరికే సరికి మొగుడు చేసిన పనికి నా ఇజ్జత్ పోయిందంటూ పందెంగెల్చిన వ్యక్తి భార్య వాగులో దూకి సస్తానంటూ దూకబోతుంటే అంతా కలిసి పట్టుకుని ఆపుతున్నారు.  
ఆ మొండోన్ని పట్టుకొని అట్లాంటి పందెం కడతారా!? అంటు ఊరంతా మిగిలిన ముఠావాళ్ళను తిట్టిపోశారు.   
పందెం గెల్చిన రెండు బస్తాలకు తోడు ఆ కల్లం రైతు మరోబస్తా వడ్లు ఉచితంగా ఇచ్చాడు
ఇది జరిగిన నాలుగేండ్లకు 
భర్తచేసిన పనికి ఇజ్జత్ పోయిందని వాగులో దూకి చస్తానన్న ఆ ఇల్లాలు ఓత్రాష్ఠుడి మాయలోబడి లేచిపోయి అదే ఊళ్ళో మరో వీథిలో కాపురం బెట్టింది
ఆ వార్త విన్న ఊరు ముక్కున వేలేసుకుంది
                          ***
కామెంట్‌లు